మ‌నసు ఓ పార్టీలో…. ఆఫ‌ర్ మ‌రో పార్టీలో….

ఏపీకి చెందిన ఓ మాజీ మంత్రి భ‌లే సంక‌ట స్థితిలో ప‌డ్డారు. పొలిటిక‌ల్ రీ ఎంట్రీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ఆయ‌న మ‌న‌స్సు ఓ పార్టీ వైపు ఉంటే…ఆయ‌న‌కు మ‌రో పార్టీ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి విచిత్ర‌మైన ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు. కందుకూరులో మూడుసార్లు గెలిచిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత రాజ‌కీయంగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న తాజాగా కందుకూరులో త‌న కార్యాల‌యం ఓపెన్ చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. ప్ర‌స్తుతం కందుకూరులో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది.

పోటీ అయితే ప‌క్కా…

గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ వైసీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు ఆ త‌ర్వాత టీడీపీలో చేరిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌ళ్లీ అక్క‌డ నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీలో టిక్కెట్ కోసం ఆయ‌న‌తో పాటు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కూడా రేసులో ఉన్నా… ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో చంద్ర‌బాబు పోతుల రామారావు వైపే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబుకు ఆయ‌న న‌మ్మిన‌బంటుగా ఉన్నారు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఇవ్వాల‌ని ప‌క్కాగా డిసైడ్ అయిన మ‌హీధ‌ర్‌రెడ్డి పోటీ ప‌క్కా అయినా ఏ పార్టీ అన్న‌దే కాస్త స‌స్పెన్స్‌గా ఉంది.

టీడీపీలో సీటుకు నో గ్యారెంటీ

ఆయ‌న మ‌న‌స్సు అంతా టీడీపీ వైపే ఉన్న‌ట్టు కందుకూరులో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. టీడీపీలో ఇప్ప‌టికే టిక్కెట్ కోసం ఇద్ద‌రు పోటీ ప‌డుతున్నా చంద్ర‌బాబు మాత్రం పోతుల రామారావు విష‌యంలో స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో మ‌హీధ‌ర్‌రెడ్డికి సీటు వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు. ఒక‌వేళ ఆయ‌న టీడీపీలో చేరినా సీటు లేకుండా అయితే ఓకే అని…లేనిప‌క్షంలో ఆయ‌న టీడీపీలోకి అవ‌స‌రం లేద‌ని పోతుల రామారావు ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు చెప్పిన‌ట్టు స‌మాచారం. మ‌హీధ‌ర్‌రెడ్డి వ‌ల్ల కొంత ఓటు బ్యాంకు పార్టీకి క‌లిసినా సీటు విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు పోతుల వైపే మొగ్గు చూపుతున్నారు.

వైసీపీ నుంచి ఆఫ‌ర్‌… అయినా డైల‌మా…

మ‌హీధ‌ర్‌రెడ్డి మ‌న‌సంతా టీడీపీ వైపే ఉన్నా ఆయ‌న‌కు వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌న్న‌ది దాదాపు ఓపెన్ సీక్రెట్‌. పార్టీలో చేరితే కందుకూరు అసెంబ్లీ సీటు ఇస్తామ‌ని నేరుగా జ‌గ‌న్ దూత‌లే ఆయ‌న‌కు చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం అక్క‌డ వైసీపీ నుంచి తూమాటి మాధ‌వ‌రావు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీలో చేరితే త‌న సీటుకు ఎక్క‌డ ఎర్త్ వ‌స్తుంది అని ఆయ‌న టెన్ష‌న్‌తో ఉన్నారు. మ‌హీధ‌ర్‌రెడ్డికి వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చినా…ఆయ‌న మొగ్గంతా టీడీపీ వైపే ఉండ‌డంతో ఆయ‌న డైల‌మాలో ఉన్నారు. ఇక వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో మ‌హీధ‌ర్‌రెడ్డికి గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచే విబేధాలు ఉన్నాయి. ఇది కూడా ఆయ‌న వైసీపీ ఎంట్రీ విష‌యంలో ఆలోచించేలా చేస్తోంది.

టీడీపీ నుంచి ఆఫ‌ర్ రాక‌పోతే…

ఏదేమైనా ఎన్నిక‌ల వ‌ర‌కు ఆయ‌న‌కు టీడీపీలో సీటు ఆఫ‌ర్ రాక‌పోతే ఆయ‌న చివ‌రి క్ష‌ణంలో వైసీపీలో చేరి అయినా కందుకూరు నుంచి పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నార‌ని ఆయ‌న స‌న్నిహితుల ద్వారా తెలుస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న పొలిటిక‌ల్ ట్రెండ్ ప్ర‌కారం చూస్తే మ‌హీధ‌ర్‌రెడ్డి టీడీపీలో సీటు నుంచి ఆఫ‌ర్ వ‌స్తుందేమోన‌న్న ఆశ‌తోనే ఉన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*