రేపు బలపరీక్ష పెట్టుకుని గాలి ఏంచేశారంటే?

గనుల కింగ్ గాలి జనార్థన్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రేపు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుండటంతో గాలి జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేతో జరిపిన బేరసారాలు బయటకు వచ్చాయి. అవి బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేపు బలపరీక్షలో ఎలాగైనా యడ్యూరప్ప గెలవాలని గాలి సోదరులు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న ఆడియో టేపులు ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారాయి. గాలి జనార్థన్ రెడ్డి రాయచూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవన్న గౌడ తో ఫోన్ లో మాట్లాడిన సంభాషణలను కాంగ్రెస్ బయటపెట్టింది. యడ్యూరప్పకు బలపరీక్షలో మద్దతిస్తే లైఫ్ సెటిల్ చేస్తానని గాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవన్న గౌడతో అన్నారు. అయితే బసవన్న గౌడ మాత్రం ‘‘మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అయితే కాంగ్రెస్ కు నమ్మక ద్రోహం చేయలేను’’ అని చెప్పారు. అలాగే ఎమ్మెల్యేలు రాజీవ్ గౌడ, శివన్న గౌడలతో కూడా గాలి బేరసారాలు ఆడినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మొత్తం మీద రేపు బలపరీక్ష జరుగుతున్న తరుణంలో గాలి మాటలు కన్నడనాట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*