అంకెల్లో చెబుతున్నా…గెలుపు నాదే….!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు. రాజ‌కీయాల్లో స‌రికొత్త ఒర‌వ‌డికి తెర‌దీసిన గ‌న్ని.. ఇప్పుడు రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు ఆద‌ర్శంగా మారారు. 2014లో ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన ఆయ‌న 8 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. సాధార‌ణ ఎమ్మెల్యేల మాదిరిగా ఆయ‌న ఉండిపోలేదు. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్లో ఉంటూ.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిరంత‌రం పోరాటం చేస్తుంటారు. స‌హ‌జంగా ఇలాంటి మాట‌లు అంద‌రి ఎమ్మెల్యేల గురించి చెప్పుకుంటూనే ఉంటాం. అయితే గ‌న్ని టీడీపీ, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమ‌లులో ప్ర‌తి సారి ఫ‌స్ట్ ర్యాంక్ లేదా టాప్‌-5లో ఉంటూ చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఆయ‌న పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌జాధ‌నం ఖ‌ర్చుపై ఆయ‌న ఎక్క‌డిక‌క్క‌డ ఫ్లెక్సీలు వేసి.. ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. నిజాయితీగా అవినీతికి తావులేకుండా…. వివాదాల‌కు దూరంగా ఆయ‌న ప్ర‌తి అడుగును ముందుకు వేస్తున్నారు. ఆయనతో ‘‘తెలుగు పోస్ట్’’ ప్రత్యేక ఇంటర్వ్యూ.

తెలుగుపోస్ట్ : చంద్రబాబు స్ఫూర్తితోనే పారదర్శకతకు పెద్దపీట వేశారా?
గ‌న్ని : పారదర్శకత ఉండాలన్న‌దే మా నాయ‌కుడి ల‌క్ష్యం. ఆయ‌న సూచనల మెరకే నేను చేసిన ప్రతీ అభివృద్ధి పనిని అంకెల రూపంలో సహా పారదర్శకంగా ప్రజలు ముందు ఉంచుతున్నాను. పారదర్శకత మనం పాటించినప్పుడే ప్రజల్లో ఉన్న‌త స్థాయిలో ఆదరణ ఉంటుంది.

తెలుగుపోస్ట్ : రాజ‌కీయాల్లో కాస్త దూకుడు లేకుండా?
గ‌న్ని : ఒక్కో ఎమ్మెల్యేది ఒక్కో స్వభావం. మన జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరి శైలి వారికి ఉంటుంది. కొంద‌రు దూకుడుగా ఉంటారు… మ‌రి కొంద‌రు నిదానంగా ప‌నులు చేస్తారు. ప్రజా సమస్యల పరిష్కారంలో దూకుడు ఉండాలి గానీ… ప్రతీ విషయంలో దూకుడు అనేది రాజకీయాల్లో సాధ్యం కాదు. వ్య‌క్తిగ‌తంగా దూకుడు ప్ర‌వ‌ర్త‌న నాకు న‌చ్చ‌దు. నన్ను ఎన్నుకున్న ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో మాత్రం నేను ఎప్పుడూ దూకుడుగానే ఉంటాను.

తెలుగుపోస్ట్ : ప్ర‌తి రూపాయి ఖ‌ర్చుపైనా.. ఫ్లెక్సీలు వేయాల‌న్న ఈ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది ?
గ‌న్ని: చంద్రబాబు నాయుడు టీడీఎల్‌పీ సమావేశం నుంచి అనేక సమావేశాల్లో మనం ఎంతో అభివృద్ధి చేస్తున్నాం… మనం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో విఫల‌మ‌వుతున్నామ‌ని చాలా సార్లు ప్ర‌స్తావించారు. చేసిన అభివృద్ధిని పారదర్శకంగా అంకెల రూపంలో చెప్పడంలో తప్పు లేదు. రాష్ట్రంలోనే తొలిసారిగా 81 పంచాయితీలు ఉన్న మా ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలోనూ చంద్రబాబు, నా చిత్ర ప‌టాల‌తో ఆ గ్రామంలో జ‌రిగిన అభివృద్ధి, రోడ్లు, గ్యాస్ క‌నెక్ష‌న్లు, బీసీ లోన్లు, కాపు కార్పొరేష‌న్ లోన్లు, రుణ మాఫీ ఇలా ప్ర‌తి అంశంపై అక్క‌డ జ‌రిగిన అభివృద్ధి అంకెల రూపంలో పక్కాగా ఫ్లెక్సీల్లో వివరించాం. దీని వల్ల ఆ గ్రామానికి మనం ఏం చేశామో పూర్తిగా క్లారిటీ ఇచ్చిన‌ట్ల‌వుతుంది. రేపు మనల్ని ప్రశ్నిండానికి ముందు వాళ్లు ఆ అంకెలు చూసుకుని ప్రశ్నించాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను… సీఎంగా చంద్రబాబుగారిని తిరిగి ఎందుకు గెలిపించాలన్నదే ప్రతీ గ్రామానికి మేము ఏం చేశాం అన్నది వివరించేందుకే ఈ వినూత్న‌ కార్యక్రమం చేపట్టాం.

తెలుగుపోస్ట్ : ప్ర‌త్యేక హోదా రాలేదు. పోల‌వ‌రం పూర్త‌వుతుంద‌నే న‌మ్మ‌కం లేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇమేజ్ త‌గ్గింద‌ని భావిస్తున్నారా?
గ‌న్ని : ప్రత్యేక హోదా, పోలవరం, పరిశ్రమలు ఈ మూడు రాకపోయినా చంద్రబాబు ఇమేజ్‌ పెరిగిందే ఈ మూడింటి వల్ల. కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మినందుకు మోడీ ఆంధ్రప్రదేశ్‌కు తీరని నమ్మక ద్రోహం చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని మోసం చేశారు. చివరకు ఆఖ‌రు బడ్జెట్‌లో కూడా ఏపీకి సరైన కేటాయింపులు దక్కలేదు. నాలుగు ఏళ్ల పాటు బీజేపీ, ఏపీకి ఎంతో చేస్తుందన్న నమ్మకంతో సహనంగా ఉన్న చంద్రబాబు చివరకు ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక ప్యాకేజీ వద్దు… దేశంలో 12 రాష్ట్రాలకు ఏదైతే ప్రత్యేక హోదా ఇచ్చారో ఏపీకి కూడా అదే హోదా ఇవ్వాలని కేంద్రంపై పోరు ప్రారంభించారు. పోలవరం పూర్తి అవ్వదని ఎవరైనా అంటే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి లేదు. పరిశ్రమలు అంటే ఏదో తూతూ మంత్రంగా పరిశ్రమలు ఏర్పాటు చెయ్యడం కాదు. దురదృష్టవ‌శాత్తూ విదేశాల నుంచి సైతం భారీ పరిశ్రమలు ఇక్కడకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా… అందుకు అనువైన ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్ పోర్ట్ కూడా మనకు లేదు. ప్రస్తుతం ఎన్నో భారీ రాయితీలు ఇచ్చి అంతర్జాతీయ కంపెనీలను మన రాష్ట్రానికి ఆహ్వానించి వారికి ఎన్నో రాయితీలు ఇచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపించడంతో పాటు యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగేలా చంద్రబాబు గారు ఇప్పటికే స‌క్సెస్ అయ్యారు ఇది ఫ్యూచ‌ర్‌లోనూ ఓ ప్రభంజనంలా కంటిన్యూ అవుతుంది.

తెలుగుపోస్ట్ : జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో టీడీపీకి న‌ష్టమంటున్నారు. మీరేమంటారు ?
గ‌న్ని : జగన్‌ పాదయాత్ర నూటికి నూరు శాతం మాకు ప్లస్సే. చంద్రబాబు నాయుడు ఏదైనా పథకానికి సంబంధించి నేను 1000 రూపాయులు ఇస్తానంటే… జగన్‌ మోహన్‌ రెడ్డి 2000 ఇస్తాననడం, చంద్రబాబుగారు 2000 ఇస్తానంటే జగన్‌ మోహన్‌ రెడ్డి 3000 ఇస్తాననడం జరుగుతోంది. ఇలా అపరిపక్వ, అల్ప ప‌రిజ్ఞానం ఉన్న ఆయ‌న లాంటి వ్యక్తులను జనాలు ఎలా విశ్వసిస్తారు. రాష్ట్ర బడ్జెట్టు సంవత్సరానికి 1,50,000 కోట్లు ఉంటే జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే కాస్త అటు ఇటుగా 5 నుంచి 6లక్షల కోట్ల అమలు కాని హామీలు ఇచ్చారంటే ఆయన ప్రజలను దగా చెయ్యడానికి చూస్తున్నారో అర్థం అవుతోంది. జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర పూర్తి అయ్యేలోగా అవసరమైతే భారతదేశం బడ్జెట్‌ను మించిపోయేలా వాగ్ధానాలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జగన్‌ మోహన్‌ రెడ్డి తన వాగ్ధానాలకు జనాల్లో విలువ లేదన్న విషయాన్ని ఆయనకు ఆయనే బయట పెట్టుకుంటున్నారు. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వానికి చాలా ప్లస్‌. జగన్‌ పాదయాత్ర వల్ల అంతిమంగా ఆయనకు జరిగిన మేలు కంటే టీడీపీకే బాగా ప్లస్‌ అయ్యింది.

తెలుగుపోస్ట్ : నిధులు తెచ్చుకోవ‌డంలో వెనుక‌బ‌డుతున్నార‌ని అంటున్నారు. నిధులు లేకుండా స‌మ‌స్య‌లు ఎలా ప‌రిష్క‌రిస్తారు ?
గ‌న్ని : ఈ విషయం నూటికి నూరు శాతం రాంగ్‌. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ప్రజలు పడుతున్న కష్టాన్ని నేను గుర్తిస్తాను… వారి కష్టాలో నేను పాలుపంచుకుంటాను. ఇటీవల దర్మపోరాట దీక్షకు వచ్చిన చంద్రబాబు సైతం మన జిల్లాలో రోడ్ల అధ్వాన్న ప‌రిస్థితిని ప్ర‌స్తావించారు. వచ్చే జనవరి కల్లా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు అన్నిటినీ పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మనం నిధులు సాధించలేకపోవడం అన్న విషయం అవాస్తవం. ఆర్ & బీ, పీఆర్‌ రోడ్ల విషయంలో నిధుల కొరత‌.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఉంగుటూరు నియోజకవర్గంలోనూ ఉంది. వచ్చే జనవరి కల్లా బ్యాలెన్స్‌ ఉన్న రహదారులన్నిటినీ కంప్లీట్‌గా పూర్తి చేస్తాం. అభివృద్ధి పరంగా చూస్తే జిల్లాల్లో తొలి టాప్ మూడు, నాలుగు నియోజకవర్గాల్లో ఉంగుటూరుకు ఖ‌చ్చితంగా ప్లేస్‌ ఉంటుందని పక్కా లెక్కలతో సహా నేను నిరూపిస్తాను.

తెలుగుపోస్ట్ : చంద్ర‌బాబుపై మోడీ క‌సి తీర్చుకుంటున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. మీరే మంటారు ?
గ‌న్ని : చంద్రబాబుపై మోడీ కసి తీర్చుకుంటున్నాడన్న మాటలో కొంత వాస్త‌వం ఉంది. చంద్రబాబులాంటి అనుభవ‌జ్ఞడైన రాజకీయ వేత్త ఎదిగితే రేపు జాతీయ స్థాయిలో త‌న‌కు పోటీ వస్తాడని అక్కసుతోనే మోడీ ప్రభుత్వం అడుగడుగునా చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అణ‌గ‌దొక్కుతూ కక్ష తీర్చుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో మోడీ ఏపీలో చంద్రబాబును అధికారంలోకి రాకుండా చెయ్యడం కాదు ముందు మోడీ అధికారంలోకి రాడన్న విషయం ఆయనకు త్వరలోనే అర్థమౌతుంది. రేపు వచ్చే ఎన్నికల్లో 2019లో ఎన్‌డీఏ చిత్తుగా ఓడడం… మోడీ పీఎం కుర్చీ నుంచి దిగడం ఖాయం. ఇక తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు విషయానికి వస్తే అక్కడ కేసీఆర్ – బీజేపీకి మధ్య ఇప్పటికే చీకటి ఒప్పందం కుదిరింది. కేసీఆర్‌ ఆగడాలకు అడ్డు కట్టవేసి కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేందుకే అక్కడ కాంగ్రెస్‌తో పొత్తుకు వెళ్లేందుకు సైతం ఒకే చెప్పిన వ్యక్తి చంద్రబాబు. కేసీఆర్‌ ప్రజల అయిష్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్న కేసీఆర్‌ను గద్ది దింపాలన్న లక్ష్యంతోనే అక్కడ ప్రజల మనోభావాలు గౌరవిస్తూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి.

తెలుగుపోస్ట్ : వచ్చే ఎన్నికల్లో గెలుపు మీకు సాధ్యమేనా?
గ‌న్ని : గత ఎన్నికల్లోనే సుమారుగా 9వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను. ఈ నాలుగున్నర ఏళ్లలో 36 వేల మంది రైతులకు నా నియోజకవర్గంలో రుణమాఫీ జరిగింది. 32,500 మందికి ప్రతీ నెల పెన్షన్లు అందుతున్నాయి. 60వేల మంది డ్వాక్రా సోదరీమణులకు ఇప్పటికే ఒక్కొక్కరికీ 8 వేల‌ చొప్పున వాళ్ల ఎకౌంట్లలో జమ చేశాం. 20 వేల‌ మరుగుదొడ్లు, 12 వేల రేషన్‌ కార్డులు ఇచ్చాం. నియోజకవర్గంలో 1,90,000 ఓటర్లు ఉంటే… వ్య‌క్తిగ‌తంగా ప్ర‌తి ఒక్క‌రి ఎకౌంట్‌కి అనేక పథకాల్లో ల‌బ్ధి క‌లిగిన వారి సంఖ్య 2.25 ల‌క్ష‌లు. ఏపీలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ లబ్ధి జరిగేలా చేసిన ఘ‌న‌త చంద్రబాబు ప్రభుత్వానిదే. నియోజ‌క‌వ‌ర్గంలో నేను చేస్తున్న‌ సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉందో నేను ఒక్క పిలుపు ఇస్తే తరలి వచ్చే జన ప్రభంజనమే ఉదాహరణ. తాజాగా ధర్మపోరాట దీక్షకు ఒక్క పిలుపు ఇస్తే నియోజకవర్గ వ్యాప్తంగా 7 వేల మోటర్ సైకిళ్లు, 300 ఆటోలు, 100 బ‌స్సులు, 200 కార్ల‌తో జ‌రిగిన భారీ ర్యాలీయే నియోజకవర్గంలో ప్రజలు ఇక్కడ ప్రభుత్వ పథకాల వల్ల ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి, సంక్షేమ సేవా కార్యక్రమాల‌ను… ప్రజల్లో నాకున్న ఆదరణ బట్టీ చూస్తే నేను వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 25వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘ‌న‌ విజయం సాధిస్తాన‌న్న న‌మ్మ‌కం ఉంది.

తెలుగుపోస్ట్ : రాష్ట్రంలో ఎమ్మెల్యేల అవినీతిపై మీ కామెంట్లు?
గ‌న్ని : అవినీతికి చంద్రబాబు గారి ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని విపక్ష రాజకీయ నాయకులు సైతం ముక్తకంఠంతో అంగీకరిస్తారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడూ కొంత అవినీతి పెరిగిన మాట వాస్తవం. దీనిని చంద్రబాబుగారు ఏ మాత్రం అంగీకరించరు. అవినీతి చేసేవారు ఎవరైనా సరే చంద్రబాబు ఉక్కుపాదంతో అవినీతి అణిచివేసే చర్యలు తీసుకుంటారు.

తెలుగుపోస్ట్ : ఎన్నిక‌ల్లో డ‌బ్బులు ఇవ్వ‌నిదే.. ఓట్లు ప‌డ‌డం లేద‌ని అంద‌రూ అంటున్నారు. దీనిపై మీరేమంటారు ?
గ‌న్ని : ఎన్నికల్లో అభ్యర్థుల ఖ‌ర్చు బాగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే అంత ఖ‌ర్చు పెట్టినప్పుడు సంపాదించడంలో తప్పేముంది అనే భావన చాలా మందిలో ఉంది. అయితే ప్రజలు అభ్యర్థికి ఓటు వేసి గెలిపించే ముందు ఓ మంచి నాయుకుడిని ఎన్నుకుంటే డబ్బులతో పనేముంటుంది అన్నది నా అభిప్రాయం. మంచి అభ్యర్థులను మనం ఎన్నుకున్నప్పుడు డబ్బులు అవసరం లేదు, అవినీతికి ఆస్కారం ఉండదు. ఇకపై భవిష్యత్తులో జరిగే ఎన్నికల ఖ‌ర్చును తగ్గించేందుకు ప్రజా ప్రతినిధుల కన్నా ప్రజలే ఎక్కువ భాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నదే నా అభిప్రాయం.

తెలుగుపోస్ట్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం మీరు ఎన్ని కోట్లు సిద్ధం చేసుకున్నారు ?
గ‌న్ని : ఎన్నికల్లో డబ్బులు పంచి విజయం సాధించడం అనేది చట్ట విరుద్ధం. అన్ని కోట్లు ప్రజలకు పంచడానికి నా దగ్గర అన్ని కోట్లు లేవు. నేనైతే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను, వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా స్పందిస్తాను, 24 గంటలు ప్రజల్లోనే ఉంటాను. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందేలా చెయ్యడంలో జాగ్రత్తలు తీసుకుంటాను. ఎన్నికల వేళ‌ అయ్యే సాధారణ ఖ‌ర్చులు, పార్టీ కార్యకర్తలకు పెట్టే ఖ‌ర్చులు మినహా కోట్లు ఖ‌ర్చుపెట్టి గెలిచే స్థోమత నా దగ్గర లేదు. ప్రజా సేవ ద్వారా నిత్యం ప్రజల్లో ఉండి వారి అవసరాలు తీర్చినప్పుడు డబ్బులు పంచాల్సిన అవసరం ఏం ఉంటుంది.

తెలుగుపోస్ట్ : ప్ర‌స్తుతం వైసీపీ స‌రైన పాత్ర పోషిస్తోంద‌ని భావిస్తున్నారా?
గ‌న్ని : వైసీపీ ప్రతిపక్షంగా ఫెయిల్‌ అయ్యిందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి చిన్న పిల్లావాడు కూడా చెబుతున్నాడు. పార్టీ సింబల్‌పై గెలిచిన 67 మంది శాసనసభ్యుల్లో జ‌గ‌న్‌ సమర్థతపై నమ్మకం లేక చంద్రబాబుని నమ్మి 22 మంది టీడీపీలోకి వచ్చారు. ప్రజాసామ్యంలో ప్ర‌జ‌ల‌ సమస్యల పట్ల బాధ్యతాయుతంగా చర్చించాల్సిన అసెంబ్లీని వదిలేసి ఈ రోజు నువ్వు పాదయాత్ర పేరుతో కపట నాటకం ఆడుతున్నావు. ఇంకా నీకు ప్రజాసామ్యం విలువల పట్ల గౌరవం ఎక్కడ ఉంది. ప్ర‌జా సమస్యలపై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరూ ప్రతిపక్షనేతగా జగన్‌ మోహన్‌ రెడ్డి ఘోరంగా విఫలం అయ్యారని అంగీకరిస్తున్నారు.

తెలుగుపోస్ట్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రిపోరుతో గెలుస్తుందా?
గ‌న్ని : నూటికి నూరు శాతం విజయం సాధిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధిదారుల నుంచి జరుగుతున్న సర్వేలో ఈ రోజు 70 నుంచి 80 శాతం సంతృప్తిగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. లబ్ధిదారులు అసంతృప్తితో ఉంటే అది సర్వేలోనే తేలిపోతుంది. 70 నుంచి 80 శాతం ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతున్నప్పుడు… ఈ రోజు టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా 130 నుంచి 140 సీట్లలో ఘ‌న‌విజయం సాధిస్తుంది.

తెలుగుపోస్ట్ : ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన వ్య‌వ‌హారంపై మీ కామెంట్. గెలిచే స‌త్తా ఉందంటారా ?
గ‌న్ని : ఒక సాధారణ పౌరుడిగా పవన్‌ కళ్యాణ్‌కు నేను రెండే ప్రశ్నలు సంధిస్తున్నాను. రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది అన్నదాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్‌ కమిటీ పవన్‌ కళ్యాణ్‌ వేశారు. జ‌య‌ప్ర‌కాష్ నారాయణ, తోట చంద్రశేఖర్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లాంటి మేథావులతో పవన్‌ స్వయంగా వేసిన కమిటీయే 75 వేల కోట్లు కేంద్ర ప్రభుత్యం నుంచి రాష్ట్రానికి రావాలని లెక్కలు తేల్చింది. ఇది పవన్‌ సైతం ప్రెస్‌మీట్‌లో చెప్పారు. పవన్‌ తన పోరాట యాత్రలో ఇదే అంశాన్ని ఎందుకు ప్రస్థావించడంలేదు ? బీజేపీనే మోడి ఎందుకు నిలదీయడం లేదు ? బీజేపీ చేతిలో ఒక కీలు బొమ్మలాగా పవన్‌ ఈ రోజు చంద్రబాబును గద్ది దించేందుకు రాజకీయాలు చేస్తున్నాడే తప్పా పవన్‌కు నిజంగా ఆంధ్రా ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదని తెలుస్తోంది. ఆయ‌న ఒక మంచి పరిణితి చెందిన సినిమా నటుడు. ఒక సినిమా హీరోగా ఆయనను అభిమానించేందుకు, ఆయనను చూసేందుకు ఆయన సభల‌కు జనాలు రావచ్చు. అయితే వీళ్లంతా రేపు ఓట్లు వేస్తారనుకుంటే అంతకంటే హాస్యాస్ప‌దం మరొకటి ఉండదు.

తెలుగుపోస్ట్ : మీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన ప్ర‌భావం గ‌ట్టిగా ఉంద‌ంటున్నారు…?
గ‌న్ని : ఉంగుటూరు నియోజకవర్గంలో పవన్‌ కళ్యాణ్‌ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఇక్కడ జనసేన ప్రభావం ఉంటుందని… జనసేన గెలుస్తుందని అనుకోవడం పొరపాటే. ఈ రోజు నియోజకవర్గంలో ఎంతో మంది కాపు సోదరులకు కాపు కార్పొరేషన్‌ రుణాల ద్వారా లబ్ధి చేకూరింది. అటు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇటు నేను వ్యక్తిగతంగా చేసిన పనులే కాకుంగా… కాపు సోదరులు ఎంతో మందికి కీలక పదవులు ఇచ్చాను. ఈ రోజు వీరంతా టీడీపీ వెంటే ఉన్నారు. కులమాతాలను వేరు చేసుకుంటూ రాజకీయాల్లో నెగ్గుకురావచ్చు అన్న మాట అవాస్తవం.

తెలుగుపోస్ట్ : మీకు, రాజ‌మండ్రి ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్‌ కు మధ్య విభేదాలు నిజ‌మేనా ? అస‌లేం జ‌రిగింది ?
గ‌న్ని : ఇది అవాస్తవం. భీమడోలు, ఉంగుటూరు ఏఎంసీ చైర్మ‌న్లు భీమడోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో గోపాలపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కూడా మార్కెట్‌ కమిటీ చైర్మ‌న్‌ ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు. మురళీ మోహన్‌తో ఈ విషయంలో ఏమాత్రం వ్యతిరేకించలేదు. ఫైన‌ల్‌గా ఈ రెండు మార్కెట్‌ కమిటీ చైర్మ‌న్లు ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన వారికే ఇస్తామని మేము వారికి చెప్పాం.

తెలుగుపోస్ట్ : తెలంగాణ‌లో టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ఖ‌రార‌వుతోంది ? ఏపీలో మీరు దీనిని స‌మ‌ర్థిస్తారా ?
గ‌న్ని : ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించి నడిరోడ్డు మీద అనాథ‌లా వదిలేసిన పార్టీ కాంగ్రెస్‌. అలాంటి కాంగ్రెస్‌ను ఇప్పుడు ఏపీ ప్రజలు ఏ మాత్రం విశ్వసించడం లేదు. ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు అవసరం లేదన్నది నా అభిప్రాయం. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల టీడీపీకి ఒరిగేది ఏమి లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఇక్కడ ఆ పార్టీతో శ‌తృత్వం ఏంటన్న ప్రశ్న సహజంగానే చాలా మంది లేవనెత్తుతున్నారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే అక్కడ నియంతృత విధానాలతో ప్రజల హక్కులను కాలరాస్తున్న కేసీఆర్‌ను ఎదుర్కునేందుకు మహాకూటమిలో భాగంగానే మూడు, నాలుగు పార్టీలతో భాగంగా కాంగ్రెస్‌తో కలవడం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*