వీరిద్దరూ వేస్టేనా….? అందుకే….?

వారిద్ద‌రూ రాజ‌కీయంగా దురంధ‌రులే.. కానీ.. ప్ర‌యోజ‌నం ఏంటి? వారిద్దరూ ప్ర‌స్తుత టీడీపీ ప్ర‌భుత్వంలో కీల‌క శాఖ‌ల‌నే చూస్తున్నారు.. కానీ, కూర్చున్న కొమ్మ‌నే న‌రుకుతున్నారు! వారిద్ద‌రూ మేధావులే.. కానీ, వారి ఆలోచ‌న‌లు ఎప్పుడూ ఉప‌యోగ‌ప‌డింలే లేదు. ఒక‌రు సంపాద‌న పై దృష్టి పెడితే.. మ‌రొక‌రు సొంత పార్టీకే ఎస‌రు పెట్టే ప‌నిలో ఉన్నారు!! ఇంత‌కీ ఆ ఇద్ద‌రు మంత్రులు ఎవ‌రంటే.. విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాస‌రావు, చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు. వీరిద్ద‌రికీ రాజ‌కీయాలు కొత్త‌కాదు! కానీ.. వీరు చేస్తున్న ప‌నులు మాత్రం జూనియ‌ర్ల క‌న్నా దిగువ స్థాయిలో ఉంటున్నాయి. పార్టీ అధినేత చంద్ర‌బాబు ముందు ఏవిష‌యంపైనైనా త‌లాడించ‌డం వ‌ర‌కే వీరు చేస్తున్న ప‌ని.

బాబుకు తలనొప్పిగా……

త‌ర్వాత మాత్రం త‌మ ఇష్టానుసారంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీలో జూనియ‌ర్లు త‌న్నుకుంటే స‌ర్ది చెప్పి. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సిన స్థాయిలో ఉన్న ఈ ఇద్ద‌రు ఇప్పుడు పార్టీకి కొర‌క‌రాని కొయ్య‌ల్లా మారిపోయార‌ని తెలుస్తోంది. దీంతో ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారం చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌నే వ్యాఖ్య‌లు అమ‌రావ‌తిలో జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. మంత్రి గంటా శ్రీనివాస‌రావు కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకుని టీడీపీలో చేరారు. దీనికి ముందు ప్ర‌జారాజ్యం.. ఇలా ఆయ‌న నిల‌క‌డ‌లేని రాజ‌కీయాలు చేస్తూనే ఉన్నారు.

రెవెన్యూలో వేలెడుతూ…..

అయితే, భీమిలి నుంచి గెలిచిన ఆయ‌న‌కు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అయితే, మంత్రిగా ఆయ‌న త‌న శాఖ వ్య‌వ‌హారాల‌ను చూడ‌డం మానేసి రెవెన్యూలో వేలు పెట్ట‌డం, విశాఖ‌లో భూక‌బ్జాల‌కు పాల్ప‌డ‌డం వంటివి చేస్తుండ‌డ‌తో మ‌రో మంత్రిగా ఉన్న అయ్య‌న్న పాత్రుడు ఈ విష‌యాన్ని ర‌హ‌స్యంగా చంద్ర‌బాబు చెవిలో వేయాల్సి ఉండ‌గా.. ప్రెస్ మీట్ పెట్టి ప‌బ్లిక్ చేశారు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం డిఫెన్స్‌లో ప‌డింది. ఆ వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు మంత్రి గంటాను పిలిచి దీనిపై క్లారిటీ తీసుకోవ‌డం, దీనిపై సిట్‌ను వేయ‌డం జ‌రిగిపోయాయి.

ఎన్టీఆర్ పై అభిమానంతో…..

అంటే.. మంత్రి గంటా వ‌ల్ల అటు జిల్లాకు కానీ, ఇటు రాష్ట్రానికి ఒన‌గూరిన ప్ర‌త్యేక ల‌బ్ధి అంటూ ఏమీ లేకుండానే పోయింది. ఇక‌, భూ క‌బ్జాలు వ‌ద్ద‌న్నార‌ని ఆయ‌న ఏకంగా త‌న శాఖ‌కు చెందిన నిధుల‌ను స్వాహా చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటివి ప‌ట్టించుకుంటే పార్టీకి ఇబ్బంది క‌ర ప‌రిణామ‌మ‌ని గుర్తించిన చంద్ర‌బాబు వీటిపై మౌనం వ‌హించారు. ఇక‌, మ‌రో మంత్రి అయ్య‌న్న పాత్రుడు వైఖ‌రి ఏకంగా పార్టీకి చేటు తెచ్చేలా క‌నిపిస్తోంది. ఆయ‌న పార్టీలో చాలా సీనియ‌ర్ మోస్ట్‌. పార్టీ పెట్టిన ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీనే అంటిపెట్టుకుని కాలం గ‌డిపారు. ఎన్నో అవ‌కాశాలు(అప్ప‌ట్లో వైఎస్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించార‌ని ప్ర‌చారం జ‌రిగింది) వ‌చ్చినా కూడా అన్న‌గారు ఎన్టీఆర్‌పై అభిమానంతో ఆయన పార్టీలోనే ఉండిపోయారు.

జూనియర్లపై అసహనం……

దీంతో మిగిలిన వారంతా జూనియ‌ర్లుగానే ఆయ‌న భావిస్తారు. అంతేకాకుండా.. తానే ఏదైనా విష‌యాన్ని చెప్పాల‌ని అనుకున్న‌ప్పుడు అది ర‌హ‌స్య‌మా? వివాదాస్ప‌ద అంశ‌మా? అనేది కూడా చూడ‌కుండా.. ప్రెస్‌మీట్ పెట్టి ప‌బ్లిక్ చేసేయ‌డం సహ‌జంగా మారిపోయింది. ఈ ప‌రిణామం అటు పార్టీకి, పార్టీ అధినేత‌కు కూడా తీవ్ర ఇబ్బందిగా మారిపోయింది. ఇటీవ‌ల టీడీపీ-కాంగ్రెస్ పొత్తుల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేప‌డం దీనిలో భాగ‌మే! దీంతో విశాఖ ప్ర‌జ‌లు త‌మ‌కు ఇద్ద‌రు మంత్రులు ఉండీ ఏం టి ప్ర‌యోజ‌నం అని ప్ర‌శ్నిస్తున్నారు! మ‌రి దీనికి ఆ మంత్రులు ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*