గంటా వార్నింగ్ బెల్స్….టీడీపీలో కలకలం…!

ఎన్నికలు సమీపించే కొద్దీ అలకలు, అసహనాలు కామన్. అది ఏ పార్టీలోనైనా సహజం. కాకుంటే అధికార తెలుగుదేశం పార్టీలో అవి కొంత ఎక్కవగా కన్పిస్తున్నాయి. టిక్కెట్ కోసం పోరాడేది కొందరైతే…. ఐదేళ్లు అధికారంలో ఉన్న తమను పట్టించుకోలేదన్నది మరికొందరు. ఇలా ఎవరికి వారు తమ అసహనాన్ని అధిష్టానంపై అవకాశం వచ్చినప్పుడు వెళ్లగక్కడం మనం చూస్తున్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు సయితం అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్ కు డుమ్మా…..

ఏస్థాయిలో అంటే ఆయన మంత్రి వర్గ సమావేశానికి గైర్హాజరయ్యేంతగా. సాధారణంగా మంత్రివర్గ సమావేశానికి ఏ మంత్రి గైర్హాజరయ్యే అవకాశం ఉండదు. ఇవ్వరు. ఒకవేళ విదేశీ పర్యటనల్లో ఉంటే ముందుగా ముఖ్యమంత్రికి చెప్పి వెళతారు. ఆ శాఖకు సంబంధించిన అంశాలు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంటే సంబంధిత అధికారులతో ఇతర మంత్రులు చర్చిస్తారు. కాని నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశానికి గంటా శ్రీనివాసరావు హాజరుకాలేదు. తాను గైర్హాజరవుతున్నట్లు కనీస సమాచారాన్ని కూడా ఇవ్వలేదు.

సర్వే ఫలితాల వెనక…..

నిజానికి గంటాశ్రీనివాసరావు నిన్న విశాఖ పట్నంలోనే ఉన్నారు. ఆయన మంత్రివర్గ సమావేశానికి హాజరుకాకపోవడానికి అధిష్టానం తీరే కారణమని చెబుతున్నారు. ఇటీవల ఒక పత్రిక చేసిన సర్వే కూడా అధిష్టానం కనుసన్నల్లోనే చేసిందని, తనను కించపరుస్తూ, తాను ఓటమి పాలవుతానని చెప్పడం వెనక హైకమాండ్ హస్తం ఉందని గంటా భావిస్తున్నారు. గంటా గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అయితే ఆయన వియ్యంకుడు మరో మంత్రి నారాయణ ఇప్పటి వరకూ సర్దిచెబుతూ వచ్చారు.

అంతటా ఉత్కంఠ……

కాని మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశానికి గంటా హాజరుకాకపోవడాన్ని అధిష్టానం కూడా తీవ్రంగా తప్పుపడుతున్నట్లు తెలిసింది. మంత్రి నారాయణ ఫోన్లో మాట్లాడినా తాను రాదచలుకోలేదని గంటా స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో పాటు విశాఖ భూ కుంభకోణం విషయంలో మంత్రి అయ్యనపాత్రుడు తనపై ఆరోపణలు చేయడం, ఎంపీ అవంతీ శ్రీనివాస్ కూడా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం అధిష్టానం ఆలోచనలేనని గంటా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో రేపు జరగనున్న ముఖ్యమంత్రి విశాఖ పర్యటనలో మంత్రి గంటా పాల్గొంటారా? లేదా? అన్న ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొని ఉంది. మొత్తం మీద గంటా హైకమాండ్ పై వార్నింగ్ బెల్స్ మోగించారన్న మాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*