గంటాకు గెలుపు గ్యారంటీనా?

గంటా శ్రీనివాసరావు సాధారణంగా ఒక పార్టీలో కుదురుగా ఉండరన్న పేరుంది. మరోసారి ఆయన పార్టీ మారతారన్న ఊహాగానాలు రాష్ట్రంలో చెలరేగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో పూర్తిస్థాయిలో అసంతృప్తిగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు అధికార టీడీపీలో ఇమడలేకపోతున్నారు. ఆయన మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోవడానికి తన అసంతృప్తిని అధిష్టానానికి తెలియజేయడానికేనన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఆయనకు పార్టీ మారే అలవాటుందనేది అందరికీ తెలిసిందే. తాజా పరిణామాలతో ఆయన జనసేనలోకి వెళ్తారా? లేక వైసీపీలోకి వెళ్తారా? తెలుగుదేశంలోనే కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

పార్టీలు మారినా…నియోజకవర్గాలు మారినా….

గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించడంతో అందులో చేరిపోయారు. ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఆపార్టీని కాంగ్రెస్ లో కలిపేయడంతో మంత్రి పదవిని దక్కించుకున్నారు. చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఆయన 2014 ఎన్నికలకు ముందు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. భీమిలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది మళ్లీ మంత్రి పదవిని అధిష్టించారు. ఇలా గంటా తీసుకున్న నిర్ణయాలు ఒకరకంగా వర్క్ అవుట్ అవుతున్నట్లే కన్పిస్తున్నాయి. పార్టీ మారినా, నియోజకవర్గం మారినా ఆయన గెలుపు మాత్రం గ్యారంటీ అనేది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

టీడీపీలో ఇమడలేక….

ఈ నేపథ్యంలో మరోసారి పార్టీ మారాలని గంటా గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మంత్రిపదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారని సమాచారం. ముఖ్య సన్నిహితులతో నిన్నంతా సమావేశమైన గంటా చివరి సారిగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి తన భవిష్యత్ ను తేల్చుకోవాలని భావిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు అధికార పార్టీలో ఉన్నా…అమాత్యుడిగా ఉన్నా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సొంతపార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తుండటం, అధిష్టానం వాటిని చూసీ చూడనట్లు వ్యవహరించడం, సీఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో గంటా పార్టీని వీడేందుకు డిసైడ్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి.

వైసీపీకా? జనసేనకా?

అయితే గంటా వైసీపీలోకి వెళతారని ఆయన సన్నిహితులు కొందరు బయటకు లీక్ చేశారు. వైసీపీ కూడా గంటా రాకను స్వాగతించింది. ఈ మేరకు బొత్స సత్యనారాయణ పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని, అయితే పదవులకు రాజీనామాలు చేసి రావాల్సిందేనని ఆయన అన్నారు. కాని గంటా మనస్సులో పవన్ కల్యాణ్ పార్టీపై ఉందంటున్నారు మరికొందరు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు మంచి స్పందన లభించడంతో పాటు వ్యక్తిగతంగా చిరు, పవన్ కల్యాణ్ కుటుంబాలతో ఉన్న పరిచయాలు కూడా ఆ పార్టీవైపు వెళ్లేందుకు దోహదపడతాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద గంటా శ్రీనివాసరావు రేపు విశాఖలో జరగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పాల్గొంటారా? లేదా? అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. రెండు రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని గంటా ఇంటికే పరిమిత మయ్యారు. గంటాను బుజ్జగించేందుకు కొందరు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*