గంటాపై ఆ…సీనియ‌ర్‌ గరంగరం…!!!

gantasrinivasarao nelimarla constiuency

ఒక‌సారి పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం ఆయ‌న‌కు అస్స‌లు నచ్చ‌దు. త‌న‌కు అనుకూల‌మైన స్థానం నుంచి బ‌రిలోకి దిగడం.. విజ‌యం ఖాతాలో వేసుకోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌! అంతేకాదు.. ఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా ఆయ‌నకు మాత్రం `మంత్రి` ప‌ద‌వి ఖాయం!! ఇప్ప‌టికే ఆయ‌న ఎవ‌రో అంచ‌నా వేసేసే ఉంటారు. అవును ఆయ‌నే మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు. ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌తిసారి నియోజ‌క‌వ‌ర్గం మార్చే ఆయ‌న‌.. ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచే బ‌రిలోకి దిగుతారా? లేక త‌న‌కు అనుకూల‌మైన‌ నియో జక‌వర్గం వెతుక్కున్నారా? అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ వినిపిస్తోంది. ప్రస్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న గంటా.. ఆ జిల్లాలోనే ఒక నియోజ‌క‌వ‌ర్గాన్ని వెతుక్కున్నార‌ని తెలుస్తోంది. ఈసారి ఆయ‌న‌ `నెలిమ‌ర్ల`పై దృష్టిసారించా ర‌ని పార్టీ వ‌ర్గాలు గ‌ట్టిగా చెబుతున్నాయి. ఆయ‌న నిర్ణ‌యం.. నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నేతకు గుబులు పుట్టిస్తోంది.

అగ్గి మీద గుగ్గిలం….

భీమునిప‌ట్నం ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు పేరు చెబితే నెల్లిమ‌ర్ల నియోజ‌వ‌క‌ర్గంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గ సీనియ‌ర్ నేత నారాయ‌ణ స్వామి నాయుడు వ‌ర్గం కారాలు మిరియాలు నూరుతోంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఒక‌సారి ఓడిపోయిన ఆయ‌న‌.. గంటాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేదని చెబుతున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌గంటా శ్రీ‌నివాస‌రావు.. పూర్తిగా నెలిమ‌ర్ల‌పైనే దృష్టిసారిస్తున్నారు. అక్క‌డ నాయ‌కుల‌తో మంత‌నాలు కొన‌సాగిస్తున్నారు. దీంతో ఇక్క‌డి నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్న‌ నారాయ‌ణ‌స్వామి వ‌ర్గం గంటాపై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతోంది. ఈ విష‌యంపై ఇప్ప‌టికే కేంద్ర మాజీ మంత్రి, జిల్లా సీనియ‌ర్ నేత అశోక్ గ‌జ‌ప‌తి రాజుతో నారాయ‌ణ స్వామి మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.

భీమిలీని కొడుకు కోసం….

1999లో అన‌కాప‌ల్లి నుంచి ఎంపీగా గెలిచి రాజ‌కీయ అరంగేట్రం చేశారు గంటా శ్రీ‌నివాస‌రావు. తొలుత టీడీపీ నుంచి బ‌రిలోకి దిగిన ఆయ‌న.. త‌ర్వాత అన్ని పార్టీల్లోనూ అడుగు వేశారు. త‌ర్వాత చోడ‌వ‌రం, అన‌కాప‌ల్లి, భీమునిప‌ట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక‌సారి టీడీపీ, మ‌రోసారి కాంగ్రెస్‌, మ‌ళ్లీ ప్ర‌జారాజ్యం.. అన్నీ ముగిసిన త‌ర్వాత మ‌ళ్లీ సొంత గూటికి చేరారు. అన్ని పార్టీల్లో మంత్రి ప‌దవులు అనుభ‌వించిన ఆయ‌న‌.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌ళ్లీ టీడీపీలో చేరారు. భీమునిప‌ట్నం నుంచి నెగ్గి.. మ‌ళ్లీ విజ‌యం సాధించారు. మ‌రి 2019 ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే ఎత్తుగ‌డ‌లు సిద్ధం చేస్తున్నారు. త‌న కొడుకును రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని భావిస్తున్న గంటా శ్రీ‌నివాస‌రావు.. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని కొడుకు కోసం త్యాగం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు.

నారాయణస్వామి మాత్రం…

భీముని ప‌ట్నం కొడుక్కి ఇచ్చి.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని నెలిమ‌ర్ల నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది బ‌య‌టికి చెప్ప‌క‌పోయినా.. ఆయ‌న అడుగులు మాత్రం ఇటువైపే ఉన్నాయ‌ని నారాయ‌ణ‌స్వామి నాయుడు వ‌ర్గీయులు మ‌డిప‌డుతున్నారు. అయితే గంటా మాత్రం అధిష్టానం ఎక్క‌డి నుంచి పోటీ చేయ‌మంటే అక్క‌డి నుంచి బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతాన‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా గంటా వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ప్ర‌కంప‌న‌లు సృషిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*