గంటాకు పట్టు దొరికేసిందా..!

విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ భీమునిపట్నం నుంచి పోటీ చేస్తానని ప్రకటించేశారు. అయిదేళ్ళు అభివృధ్ధి చేసిన తరువాత అక్కడే నిలబడి ఓటు అడుగుతానని మంత్రి అంటున్నారు. వందల కోట్ల రూపాయలను తెచ్చి భీమిలీలో అనేక కార్యక్రమాలు చేశామని, ఆ ప్రగతే తనను గెలిపిస్తుందని కూడా ఆయన ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ తనకు లభిస్తుందన్న నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ మైనస్

భీమిలీ నియోజకవర్గం, అదీ మంత్రి ఏరియా. అధినేత జగన్ కి అయితే గంటాను ఓడించాలని కసి ఉంది. అటువంటి చోట వైసీపీకి సరైన అభ్యర్ధి లేకుండా పోయారు. ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న విజయనిర్మల ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదని పార్టీ వారే అంటున్నారు. ఆమెను ముందుంచి పార్టీ కార్యక్రమాలు జరిపిస్తున్నా ఎక్కడా బలం మాత్రం పెరగలేదు. ఇక మూడు మండలాల పరిధిలో ఉన్న భీమిలీలో మండలానికి ఒక్కరుగా చెప్పుకోదగిన బలమైన నాయకుడు వైసీపీకి లేరు. దాంతో ఇక్కడ వైసీపీ పూర్తిగా డీలా పడిందనే చెప్పాలి.

ఎదురులేని మంత్రి

చంద్రబాబు మంత్రివర్గంలోనే బలమైన నేతగా పేరున్న గంటాకు భీమిలీలో ప్రత్యర్ధి లేకపోవడంతో ఆయన దూకుడు మామూలుగా లేదు. గెలుపు కాదు మెజారిటీ రెట్టింపు కావాలని ఇప్పుడు గంటా క్యాడర్ కి కొత్త టార్గెట్లు పెడుతున్నారంటే ఇక్కడ వైసీపీ కోరి మరీ విజయాన్ని బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తున్నట్లుగా ఉందంటున్నారు. మంత్రి గత ఆరు నెలలుగా భీమిలీనే అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. తన పరిధిలోని సమస్యలను ఒక్కోటి పరిష్కరించుకుంటూ జనానికి చేరువ అవుతున్నారు. దాంతోనే అయన గెలుపుపై గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

క్లీన్ ఇమేజ్

గంటాపై ప్రతిపక్షాలు ఇన్నాళ్ళూ విమర్శ చేయడానికి భూ కబ్జాలు ఆసరాగా ఉండేవి. ఇటీవల మంత్రివర్గం ఆమోదించిన సిట్ నివేదిక గంటాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. దాంతో గంటా ఇపుడు పూర్తిగా సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. తాను కడిగిన ముత్యాన్ని అని, తన జీవితం తెరచిన పుస్తకమని, దమ్ముంటే అవినీతి బయట పెట్టాలంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. గంటా దూకుడు చూస్తూంటే ఈమారు కూడా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతారని అంటున్నారు. బాబు సైతం గంటానే నమ్ముకుని జిల్లా బాధ్యతలు పూర్తిగా అప్పగించేశారు. ఎలాగూ భీమిలి గెలిచే సీటు కాబట్టి విశాఖలో, వీలైతే ఉత్తరాంధ్రలో కూడా మెజారిటీ సీట్లు తెచ్చేందుకు గంటా రెడీ అయిపోతున్నారు. మొత్తానికి రాజకీయంగా ఇది గంటాకు కలసి వచ్చిన కాలంగా ఆయన అనుచరులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*