గిడ్డి ఈశ్వరి పార్టీ మారినా?

వైసీపీ గుర్తు మీద గెలిచి ఇటీవలే టీడీపీలోకి జంప్ చేసిన గిడ్డి ఈశ్వరి పరిస్థితి అయోమయంగా తయారైంది. ఆమె పార్టీ మారేందుకు వచ్చే ఎన్నికల కంటే ముందే తనకు నామినేటెడ్ పదవి ఇస్తారని హామీ లభించడమేనన్నది అందరికీ తెలిసిందే. అయితే గిడ్డి ఈశ్వరి ఊహించినట్లుగా తెలుగుదేశం పార్టీలో జరగడం లేదు. ఆమె కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఆశించారు. తనకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తుందని, కేబినెట్ హోదా ఉన్న పదవి ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చారని గిడ్డి ఈశ్వరి కార్యకర్తలతో చెప్పిన వీడియో అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

మూడు నెలలు గడుస్తున్నా…..

అయితే పార్టీ మారి మూడు నెలలు గడుస్తున్నా గిడ్డి ఈశ్వరికి పదవి దక్కలేదు. కనీసం అగ్రనేతల అపాయింట్ మెంట్లు కూడా లభించడం లేదు. దీంతో ఆమె వైసీపీని ఎందుకు వీడి వచ్చానా? అని మదనపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. గిడ్డి ఈశ్వరి వైసీపీలో ఉన్నప్పుడు బలమైన నేత. రోజా తర్వాత ఈశ్వరి వాయిస్ ఎక్కువగా విన్పించేది. జగన్ కూడా ఆమెకు తగినంత గౌరవం ఇచ్చేవారు. పాడేరు నియోజకవర్గంతో పాటు అరకు నియోజకవర్గ బాధ్యతలను కూడా జగన్ ఆమెకు అప్పగించారు.

హామీలు చూసే….

అయితే అధికార పార్టీ నేతల హామీలకు లొంగిపోయిన ఈశ్వరి పార్టీ మారారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల పందేరం కూడా జరిగింది. అయితే అందులో ఎక్కడా ఆమె పేరు కన్పించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తన ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీ నేతలు అవలంబిస్తున్న తీరును తప్పుపట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరేంతవరకూ తన ప్రాణం తీశారని, చేరిన తరువాత పట్టించుకోవడమే మానేశారని ఆమె ఆవేదన చెందారని చెబుతున్నారు.

పనులు కూడా కావడం లేదని…..

పాడేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నేతల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదట. నిధులు ఎక్కడున్నాయని ఎదురు ప్రశ్నలు మంత్రుల నుంచి వస్తుండటంతో గిడ్డి ఈశ్వరి తలపట్టుకుంటున్నారని చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉంటే ప్రభుత్వం సహకరించడం లేదని ప్రజలకు నచ్చజెప్పుకునే దానినని, అధికార పార్టీలో ఉండి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆమె ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద గిడ్డి ఈశ్వరికి పార్టీ మారినా ఫలితం దక్కలేదన్న టాక్ పాడేరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*