గిడ్డి ఈశ్వ‌రి గిల‌గిల‌.. రీజ‌నేంటంటే..!

గిడ్డి ఈశ్వ‌రి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు! చంద్ర‌బాబు నాయుడిని త‌ల‌న‌రుకుతా! అంటూ సంచ‌లన ప్ర‌క‌ట‌న‌లు చేసిన ఆమె.. త‌ర్వాత అదే చంద్ర‌బాబు జ‌ట్టులోకి చేరి ఆయ‌న‌కు జై కొడుతున్నారు. గ‌త 2014 ఎన్నిక‌ల‌కు ముందు.. టీచ‌ర్‌గా ఉన్న ఆమెను వైసీపీ అధినేత జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి తెచ్చారు.(వాస్త‌వానికి గిడ్డి ఈశ్వ‌రి తండ్రి కూడా రాజ‌కీయాలు చేశారు) ఆ ఎన్నిక‌ల్లో గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం పాడేరు టికెట్‌ను ఆమెకే ఇచ్చారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో భారీ స్థాయి మెజారిటీతో గెలుపొందారు ఈ టీచ‌ర‌మ్మ‌. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలోని ఏజెన్సీలో ఉన్న పోల‌వ‌రం మిన‌హా మిగిలిన అన్ని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ గాలులు బ‌లంగా వీచాయి. దీంతో ఏజెన్సీలో ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ అభ్య‌ర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎఫెక్ట్ నేప‌థ్యంలోనే ఈశ్వ‌రి కూడా తిరుగులేని విజ‌యం సాధించారు.

జగన్ అంటే ఇష్టమంటూ….

ఇక ఈశ్వ‌రి విష‌యానికి వ‌స్తే త‌న‌ను రాజ‌కీయంగా ఎదిగేలా చేసిన జ‌గ‌న్ అంటే ఈమెకు వీరాభిమానం. ఎక్క‌డాలేని ఆనందం. ఆయ‌న‌ను ఎంతో స‌పోర్టు చేశారు. అటు అసెంబ్లీలోనూ.. ఇటు బ‌య‌ట కూడా టీడీపీని విమ‌ర్శించ‌డంలో ముందున్నారు. మ‌రి అలాంటి నేత ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నారు. జ‌గ‌న్‌ను కాద‌ని టీడీపీలోకి చేరిపోయారు. పార్టీ మారే రోజున కూడా త‌న‌కు జ‌గ‌నే ఇష్టం అని ఆమె మీడియా ముందు చెప్ప‌డం కూడా ఓ సంచ‌ల‌న‌మే. గిరిజ‌న కార్పొరేష‌న్ ఏర్పాటు అవుతుంద‌ని, త‌న‌ను చైర్మ‌న్‌ను చేస్తార‌ని ఆమె అన్న‌ట్టుగా ఓ లీకైన ఆడియో ఆమె పార్టీ మారిన స‌మ‌యంలో హ‌ల్ చ‌ల్ కూడా చేయ‌డం ఆమె పార్టీ మార్పు వెనుక ఉన్న నిజాన్ని బ‌య‌ట పెట్టింద‌ని వైసీపీ అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ఆరోపించింది కూడా.

సెంటిమెంట్ తో భయం…..

స‌రే.. ఏదేమైనా.. ఇప్పుడు ఈశ్వ‌రి టీడీపీలో కొన‌సాగుతున్నారు. మ‌రో ప‌దిమాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఆమె మ‌ళ్లీ పాడేరు స్థానం నుంచే పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అది కూడాటీడీపీ టికెట్‌పైనే! అయితే, ఆమెను ఓ సెంటిమెంట్ వెంటాడుతున్న‌ట్టు తాజా స‌మాచారం. ఆ సెంటిమెంట్ మ‌ళ్లీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పున‌రావృత‌మైతే.. తాను ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వాలా? అని గిడ్డి తెగ ఫీల‌వుతున్నార‌ట‌. సో.. దీంతో ఆ సెంటిమెంట్‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చ సాగుతోంది. పాడేరు శాసనసభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేసిన వారెవరైనా ఒక్కసారికే పరిమితం. రెండో సారి గెలుపొందడం అసాధ్యమని అంటు న్నారు.

ఆమె పార్టీ మారినా….

అయితే దివంగత తమర్భ చిట్టినాయుడు, దివంగత కొట్టగుళ్లి చిట్టినాయుడు మాత్ర‌మే వ‌రుస‌గా రెండుసార్లు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. వారిద్దరు మినహా ఇప్పటివరకు ఇక్క‌డి నుంచి పోటీ చేసిన వారిలో మరెవరూ రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దాఖలాలు లేవు. దీంతో పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి ప్ర‌స్తుతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గిడ్డి ఈశ్వ‌రి.. మ‌రోసారి తాను పోటీచేస్తే.. గెలుస్తానా? లేదా? అని దిగులు పెట్టుకున్న‌ట్టు స‌మాచారం. దీనికి తోడు పాడేరు నియోజ‌క‌వ‌ర్గంలో ఈశ్వ‌రి పార్టీ మారినా ఆమెతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ఇత‌ర ముఖ్య నాయ‌కులు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ్వ‌రూ టీడీపీలోకి రాలేదు. ఈశ్వ‌రి పార్టీ మారినా అక్క‌డ వైసీసీ సంస్థాగ‌తంగా టీడీపీ కంటే బ‌లంగా ఉంది. దీనికి తోడు టీడీపీలో ఏకంగా నాలుగు గ్రూపులు ఉన్నాయి. మ‌రి ప్ర‌జ‌లు ఏ విధంగా తీర్పు చెబుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*