ప్రాణాలు తేలిగ్గా మింగేస్తున్నారే…!

అనుభవాలు పాఠాలు నేర్పుతున్నా నేర్చుకొని నిర్లక్ష్యమే తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక లో విద్యార్థులు ఆరుగురు గల్లంతు కావడానికి కారణమైంది. సెలవురోజుల్లో ఇంట్లో వుండాలిసిన వారు వనం మనం కోసం కార్యక్రమానికి వెళ్లి కన్నవారికి కడుపు శోకాన్ని మిగిల్చారు. గోదావరి జిల్లాల్లో దశాబ్దాలు గడుస్తున్నా నదీ పాయలపై వంతెనలు నిర్మించుకోలేని దౌర్భాగ్యం ఏదో సందర్భంలో నిండు ప్రాణాలను పడవ ప్రమాదాల రూపంలో మింగేస్తుంది. గోదావరి, కృష్ణా నదులపై ఇటీవల అనేక ప్రమాదాల నేపథ్యంలో ఆలస్యంగా కళ్ళు తెరిచిన సర్కార్ కొన్ని కఠినతర నిబంధనలు పర్యాటకులకు సంబంధించి అమల్లోకి తెచ్చింది. ఫలితంగా కొంతవరకు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా పర్యాటక బోట్లలో రక్షణకు సంబంధించి నిబంధనలు అమలయ్యేలా చేస్తున్నాయి. లైఫ్ జాకెట్లు వున్న వాటినే పాపికొండల పర్యాటకానికి అనుమతి ఇస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సైతం చేస్తున్నాయి. ఈ తరహా పర్యవేక్షణ నదీ తీరం అంతా ఏర్పాటు చేయడం కష్టసాధ్యం అయినప్పటికీ నాటు పడవలు ప్రయాణించే ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు పాటించేలా నిబంధనలు రూపొందించి అమలు చేయడం అసాధ్యం కాదు.

సరిగ్గా ఈరోజే 29 మంది …

2014 జులై 14 నాడే గోదావరి పుష్కరాల సందర్భంగా పవిత్ర స్నానాలు కోసం రాజమండ్రి పుష్కరఘాట్ లో తొక్కిసలాటకు గురయ్యి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు సంఘటనలు ఒకే తేదీ కావడం యాదృచ్ఛికమే. నాటి సంఘటన తొక్కిసలాట సందర్భంగా జరిగింది. ఆ తరువాత ఇటీవల గిరిజనులు ప్రయాణిస్తున్న లాంచీ సుడిగాలిలో చిక్కుకుని కొండమొదలు దగ్గర బోల్తా పడి 22 మంది మృత్యువాత పడ్డారు. అంతకుముందు జరిగిన అనేక పడవ ప్రమాదాల్లో పలువురు విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఇలా ప్రమాదాలపై ప్రమాదాలు జరుగుతున్నా స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా లంక గ్రామాల ప్రజలకు వంతెనల కొరత వెంటాడుతుండటం నేతల నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం.

పరిహారంతో సరి పటిష్ట చర్యలు శూన్యం …

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గోదావరి, కృష్ణా లంక గ్రామాల వాసుల సాహస యాత్రలకు చెక్ పడటం లేదు. ప్రమాదం జరిగాకా సహాయ చర్యలు నష్టపరిహారం తో ప్రభుత్వాలు సరిపెట్టేస్తున్నాయే తప్ప భవిష్యత్తులో అలాంటివి జరక్కుండా మాత్రం చర్యలు చేపట్టకపోవడం దారుణం. తాజాగా జరిగిన పడవ ప్రమాదం ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తుంది. తక్షణం యుద్ధప్రాతిపదికన గోదావరి, కృష్ణ నదీ తీరాలు లంక ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం చేస్తే నాటు పడవలపై నిత్యం ప్రయాణించే వారి సంఖ్యా తగ్గుతుంది. దిన దినగండం నూరేళ్ళ ఆయుష్షు అన్న చందంగా మారిన ప్రజల ప్రాణాలకు కొంతైనా భరోసా లభిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*