గోరంట్ల పాత గూటికేనా?

2019 ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు జరిపిన అంతర్గత సర్వేల్లో 30 నుంచి 40 మంది సిట్టింగులను పక్కన పెట్టేస్తారన్న వార్త‌లు తెలిసిందే. రాజకీయాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కొంతమంది సీనియర్‌ నాయకులు ఇప్పటికే తప్పుకుంటామని స్వచ్ఛందంగా ప్రకటించారు. మరి కొంతమంది వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొందరు సీనియర్లు మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ తమ అదృష్టాన్ని పరిక్షించుకుని ఈ సారైనా బాబు కేబినెట్‌లో చోటు దక్కించుకోవాలని ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సైతం వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో…….

వాస్తవంగా చూస్తే ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి ఐదు సార్లు గెలిచి పార్టీలో ఎంతో సీనియర్‌గా ఉన్నా ఆయన నిత్య అసంతృప్తవాదిగా పేరొందారు. గతంలో మంత్రిగా పని చేసిన బుచ్చయ్య చౌదరి 2014 ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితిల్లో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఘ‌న‌ విజయం సాధించిన బుచ్చయ్య బాబు కేబినేట్‌లో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. బాబు కేబినేట్‌లో మంత్రి పదవి రాకపోవడంతో ఓపెన్‌గానే తన అసంతృప్తి గళాన్ని వినిపించారు. చివరకు తన పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా పార్టీ అధిష్టానం నుంచి ఆయనను పెద్దగా పట్టించుకున్నట్టు కనబడలేదు. అప్పట్నించి బుచ్చయ్య కాస్త మౌనంగానే ఉంటూ సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్నారు.

సిటీకి మార్పు….

వచ్చే ఎన్నికల్లో బొచ్చయ్యచౌదరికి సీటు వస్తుందా రాదా అన్నదానిపై ఇప్పటికే రకరకాల చర్చలు పార్టీలో కూడా సాగుతున్నాయి. అయితే అసంతృప్తి వాదిగా పేరున్న బుచ్చయ్య నానా రచ్చరచ్చ చేసే ఛాన్స్‌ ఉందన్ని భావించిన పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనను తిరిగి కొనసాగించాలని భావిస్తుంది. వార‌సులు లేక‌పోవ‌డంతో కూడా ఆయ‌న‌కు మ‌రోసారి ఛాన్స్ ఇచ్చే అంశం ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ క్రమంలోనే బుచ్చయ్య చౌదరికి ఈ సారి సీటు మార్పు ఉండే ఛాన్సులు ఉన్నాయి. 1983 నుంచి రాజమహేంద్రవరం సిటీలో మంచి పట్టున్న ఆయన అక్కడే నాలుగు సార్లు విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన అక్కడ స్వ‌ల్ప మెజార్టీతోనే ఓటమి చెందాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో రూరల్‌ నుంచి పోటీ చేసి గెలిచిన‌ ఆయన పదే పదే సిటీ నియోజకవర్గంమీద ఆధిపత్యం కోసం బీజేపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో ఫైటుకు దిగేవారు.

కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని…..

ఈసారి రూరల్‌ నుంచి కొత్తవారికి అవకాశం కల్పించాలని భావిస్తున్న పార్టీ అధిష్టానం బుచ్చయ్యను సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచన చేస్తోంది. అలాగే రాజమహేంద్రవరం లోక్‌సభా నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీగా మాగంటి మురళీమోహన్‌ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనే బ‌రిలోకి దిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేని పక్షంలో ఇక్కడ కూడా బలమైన అభ్యర్థి కోసం ఆ పార్టీ పెద్ద కసరత్తే చేస్తుంది. ఇక బుచ్చ‌య్య సిటీకి మారితే రూర‌ల్ నుంచి ఆదిరెడ్డి ఫ్యామిలీకి సీటు వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడ‌లు అయిన ఆదిరెడ్డి భ‌వానీ (దివంగ‌త మాజీ కేంద్రం మంత్రి ఎర్ర‌న్నాయుడు కుమార్తె ) ఇక్క‌డ పోటీ చేసే ఛాన్సులు ఎక్కువుగా ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*