బుచ్చన్న ఇక భగ్గుమంటాడా?

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ.. రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన పార్టీల్లోనూ టికెట్ రాజ‌కీయాలు పెరుగు తున్నాయి. ఎవ‌రికివారే వ‌చ్చే ఎన్నిక‌ల‌పై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని టీడీ పీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టుగానే పార్టీలోని నాయ‌కులు సైతం టికెట్లు తెచ్చుకుని గెలుపు గుర్రాలెక్కాల‌ని నిర్ణ యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రికివారు టికెట్ ప్ర‌య‌త్నాల్లో మునిగిపోయారు. ప్ర‌తి ఒక్క‌రూ చంద్ర‌బాబు వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. తాజాగా రాష్ట్రంలో కీల‌క నాయ‌కుడిగా గుర్తింపు పొందిన దివంగత మాజీ ఎంపీ కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు కుమార్తె, టీడీపీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు కోడ‌లు భ‌వానీ కూడా రంగంలోకి దిగాల‌ని భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

బుచ్చయ్యతో విభేదించి…..

ఆదిరెడ్డి కోడ‌లు భ‌వానీ సోద‌రుడు కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌స్తుతం శ్రీకాకుళం ఎంపీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పార్ల‌మెంటులో త‌న బ‌ల‌మైన వాగ్దాటితో యంగ్ పొలిటిషీయ‌న్ల‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆదిరెడ్డి అప్పారావు ముందు టీడీపీలో ఉన్నారు. ఆయ‌న భార్య వీర‌రాఘ‌వ‌మ్మ రాజ‌మండ్రి న‌గ‌ర్ మేయ‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న బుచ్చ‌య్య చౌద‌రితో విబేధించి వైసీపీలోకి వెళ్లారు. అక్క‌డ ఎమ్మెల్సీ అయ్యారు. తిరిగి ఆయ‌న చంద్ర‌బాబు పిలుపుతో సైకిల్ ఎక్కారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు చెబుతున్నారు. దీనికి చంద్ర‌బాబు సైతం త‌లాడించార‌ని టాక్‌.

భవానీకే టిక్కెట్ అని……

ఈ నేప‌థ్యంలోనే తాను పార్టీ మారి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాన‌ని చెబుతున్నారు. అంటే ఆదిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఉంది. అదేస‌మ‌యంలో టీడీపీ అధినేతకు అత్యంత స‌న్నిహిత వ‌ర్గాలు చెబుత‌ున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఆదిరెడ్డి ఫ్యామిలీకి టికెట్ ఖాయ‌మేన‌ని, అయితే, ఆదిరెడ్డికి కాకుండా ఆయ‌న కోడలుగా ఉన్న భ‌వానీకి టికెట్ ఇస్తార‌ని అంటున్నా రు. ఈమెకు ఇవ్వ‌డం ద్వారా అటు మ‌హిళ‌కు టికెట్ ఇచ్చామ‌నే భావ‌న‌తో పాటు.. ఇటు ఎర్ర‌న్నాయుడు ఫ్యామిలీకి కూడా మ‌రింత గుర్తింపు ఇచ్చామ‌నే భావ‌న కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఇక ప్ర‌స్తుతం ఆదిరెడ్డి ఎలాగూ ఎమ్మెల్సీగా ఉన్నారు.

రెండింటిలో ఏదో ఒకటి…..

తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజ‌మండ్రి న‌గ‌రం, రాజ‌మండ్రి రూర‌ల్ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ రెండు సీట్ల‌లో ఏదో ఒక సీటు భ‌వానీకి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వీటిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. రాజ‌మండ్రి సిటీ సీటును ఆమెకు కేటాయించే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. సిటీ సీటులో ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న ప‌ట్టుతో పాటు కుల స‌మీక‌ర‌ణ‌లు వాళ్ల‌కు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక రూర‌ల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియ‌ర్ లీడ‌ర్ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు కంటిన్యూ చేస్తారా ? ఆయ‌న్ను త‌ప్పిస్తారా ? అన్న‌ది చూడాలి. ఇక గ‌న్ని కృష్ణ లాంటి సీనియ‌ర్లు కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*