గవర్నర్ కుట్ర పన్నేసినట్లేనా?

ధర్మయుద్ధం పేరిట ప్రత్యేక హోదా కోసం టిడిపి చేస్తున్న ఆందోళన సంగతి ఏమో కానీ గవర్నర్ నరసింహన్ పై ఆ పార్టీ సాగిస్తున్న యుద్ధం చర్చనీయాంశం అయ్యింది. రాజ్యాంగ విధుల్లో వుండే గవర్నర్ పై నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు విశ్వాసం లేదని ప్రకటించడం ఆయన రాజకీయాలు చేస్తూ కేంద్రం ఏజెంట్ గా తొత్తుగా మారారంటూ బాహాటంగా ఆరోపించడం సంచలనమే అయ్యింది. వాస్తవానికి ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ అందరిపై గవర్నర్ కి విశ్వాసం ఉన్నంత వరకే వారు పదవుల్లో కొనసాగుతారు. గవర్నర్ కి వారిపై విశ్వాసం సన్నగిల్లితే ఏ చర్య అయినా తీసుకునే అధికారం గవర్నర్ కు ఉంటుంది. ప్రభుత్వాన్ని అవసరం అనుకుంటే రద్దు చేసే ప్రక్రియను కూడా రాజ్యాంగం కల్పించింది. అంతటి పవర్ ఫుల్ పోస్ట్ పై కామెంట్ చేయడానికి ఎవరు అంత తొందరగా సాహసించారు. కానీ టిడిపి ఇప్పుడు తమ ఆరోపణలు విమర్శలను గవర్నర్ నరసింహన్ లక్ష్యం గా చేయడం తమపై కుట్ర కుట్ర అంటూ రోజు పెడుతున్న గగ్గోలు అసలు రాష్ట్ర ప్రజలనే అయోమయానికి గురిచేసేలా వుంది.

వెంటాడుతున్న తమిళనాడు భయం …

దేశంలో బిజెపియేతర ప్రభుత్వాలు నడుపుతున్న వారంతా గవర్నర్ లను చూసి కలవరపడుతున్నారు. వారికి కొందరైతే భయపడుతున్నారు. వారంతా అంతలా ఉండటానికి తమిళనాడులో మోడీ సర్కార్ నడిపిన రాజకీయం కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శశికళను జైలుకి పంపడం రెండు భిన్న ధృవాలను ఒక్కటి చేసి పాలన సాగించడం, అప్పటి ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ సంక్షోభ సమయంలో నడిపిన పాత్ర అన్ని వివాదాస్పదమే. ముఖ్యమంత్రి హోదా లో జయలలిత కన్నుమూశాక తమిళ రాజకీయాలను కేంద్రం పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడంపై ఇప్పటికి ప్రతి చోటా చర్చనీయాంశమే. అదే తరహా తమ తమ రాష్ట్రాల్లో గవర్నర్ లు అనుసరిస్తారనే ఆందోళన బిజెపియేతర రాష్ట్రాల పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రులకు గుబులు పుట్టిస్తుంది. అందరికన్నా ఎక్కువగా ఎపి లో వున్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా చంద్రబాబు సర్కార్ కి ఈ భయం మరింత పట్టుకుందని చెబుతున్నారు పరిశీలకులు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు చేస్తున్న ప్రకటనలు వారి భయానికి అద్దం పడుతున్నాయని చెబుతున్నారు. దానికి తోడు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలంగాణ సీఎం కు ఇచ్చే ప్రాధాన్యత ఎపి సీఎం కు ఇవ్వడం లేదన్నది కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి తమ్ముళ్లలో వుంది. టిడిపి ఎన్డీయే నుంచి బయటకు వచ్చాకా ఇది పెరిగి పెద్దదై గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలిపై విరుచుకుపడే స్థాయికి చేరుకుందంటున్నారు.

ఢిల్లీ పర్యటన కుదించుకున్న గవర్నర్ …

ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తన ఢిల్లీ పర్యటన కుదించుకున్నారు. వాస్తవానికి రెండురోజులపాటు గవర్నర్ ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. ఆయన షెడ్యూల్ లో భాగంగా కేంద్ర హోం మంత్రి రాజనాధ్, ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ లు సైతం ఫిక్స్ అయ్యాయి. కానీ ఆ రెండు కూడా రద్దు చేసుకుని నరసింహన్ హైదరాబాద్ చేరుకోవడం ఆసక్తికరం అయ్యింది. మరో వైపు ఆయనపై విమర్శలు, ఆరోపణలు రెండు రోజులనుంచి తీవ్రత పెరుగుతూ పోతుంది. టిడిపి మంత్రులు నేరుగా విమర్శనాస్త్రాలతో నరసింహన్ తీరును బాహాటంగా తప్పుపడుతున్నారు. గవర్నర్ మాత్రం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు తో ఉత్తరాంధ్ర లో రాబోయే అల్పపీడనం, వాతావరణం పై చర్చించడం విశేషం.

చీకటి ఒప్పందాలు బయట పెట్టాలని వైసిపి …

టిడిపి గవర్నర్ పై సాగిస్తున్న యుద్ధాన్ని బిజెపి తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. గవర్నర్ పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలోకి వైసిపి ఎంటర్ అయ్యింది. గవర్నర్ చంద్రబాబు మధ్య ఎదో చీకటి ఒప్పందం జరిగిందని తెలుస్తుందని అదేమిటో బయట పెట్టాలని జగన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బహుశా కొన్ని కేసుల అంశాలకు సంబంధించి గవర్నర్ బెదిరిస్తున్నారేమోననే అనుమానం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి , గవర్నర్ వంటి ఉన్నత స్థాయిలో వున్నవారు వాస్తవాలు ప్రజలకు తెలపాలని వైసిపి డిమాండ్ చేసింది. మొత్తానికి గవర్నర్ నరసింహన్ పై మొదలైన రాజకీయ దుమారం ఇప్పట్లో చల్లారేలా మాత్రం కనిపించడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*