వారు టీఆర్ఎస్ ని టెన్షన్ పెడుతున్నారా..?

తెలంగాణలో సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు చాలా కీలకమయ్యాయి. ఈ విషయాన్ని టీఆర్ఎస్ గత ఎన్నికల ఫలితాల రోజే గుర్తించింది. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. టీఆర్ఎస్ గెలిస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయంతో వారు టీఆర్ఎస్ కు ఓటేయలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లలంతా టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సెటిలర్లను తమవైపే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇటీవల కేసీఆర్ చంద్రబాబును విమర్శించే క్రమంలో ఆంధ్రోళ్లు, ఆంధ్ర అనే పదాలు వాడారు. దీంతో సీమాంధ్రులు ఎక్కడ నోచ్చుకుంటారో అనే ఉద్దేశ్యంతో కేటీఆర్ వెంటనే వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు. టీడీపీ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుండటంతో వీరి ఓట్లు ఎటువైపనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సుమారు 10 నియోజకవర్గంలో గెలుపొటములు ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్న 26 కులాలను మచ్చిక చేసుకునే పనిలో పార్టీలు పడ్డాయి.

ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చి…

పొట్ట చేత పట్టుకుని వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఒరిస్సాలోని పలు ప్రాంతాల నుంచి 30- 40 ఏళ్లుగా ప్రజలు హైదరాబాద్ కి వచ్చి స్థిరపడ్డారు. వీరిలో అత్యధికులు భవన నిర్మాణ కార్మికులుగా, ఇక్కడి పరిశ్రమల్లో కార్మికులుగా, కూలీలుగా పనిచేసుకుంటూ బతుకుతున్నారు. చాలా ఏళ్ల క్రితం వచ్చిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా పనిచేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో అధికంగా ఉన్న బీసీ కేటగిరిలోని 26 కులాల వారే ఇలా వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది ఉంటారు. కళింగ, శెట్టి బలిజ, కొప్పుల వెలమ, పొలినాటి వెలమ, తూర్పు కాపులు, గవర, పొండార వంటి కులాలు ఈ 26 కులాల్లో ప్రధానమైనవి. వీరంతా మొదటి నుంచి బీసీ కేటగిరిలో ఉన్నారు. అయితే, తెలంగాణ ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం జీఓ నెం 3 విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన స్థిరపడ్డ 26 కులాలను బీసీ కేటగిరి నుంచి తొలగించారు. దీంతో వీరంతా బీసీ రిజర్వేషన్లు, ఇతర ఫలాలను కోల్పోయారు.

రిజర్వేషన్లు కోల్పోవడంతో…

ధనికులకు పెద్ద ఇబ్బందేమీ లేదు గానీ ఈ 26 కులాల్లో అధికంగా ఉన్న పేదలు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నష్టపోయారు. అనేక ఏళ్ల క్రితమే తెలంగాణకు వచ్చిన వీరంతా ఇక్కడే స్థిరపడిపోయారు. వారి పిల్లల చదువులు కూడా ఇక్కడే కొనసాగాయి. దీంతో వీరి ఒక్కసారిగా ఓసీలుగా మారిపోయారు. ప్రభుత్వ నిర్ణయం వీరిని ఒక్కటి చేసింది. అంతా కలిసి హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో వీరి సమస్యలు అలానే మిగిలిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ వీరి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా పరిష్కారం కాలేదు. దీంతో ఇప్పుడు వీరు ఎటువైపు ఉంటారని పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి.

టీఆర్ఎస్ అలెర్ట్ అవుతుందా..?

జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, పటాన్ చేరు, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్ వంటి నియోజకవర్గాల్లో వీరి ప్రబావం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఒక్కో నియోజకవర్గంలో వీరి ఓట్లు 20 వేల నుంచి 40 వేల వరకు ఉన్నాయి. ఇక్కడ వీరు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాల్లోనూ వీరి ఓట్లు కొంతమేర ఉన్నాయి. దీంతో పార్టీలు వీరిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ 26 కులాల వారు నియోజకవర్గాల వారీగా ఒక్కటై అన్ని పార్టీల అభ్యర్థులనూ కలుస్తున్నారు. తమను తిరిగి బీసీల్లో చేరుస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ – ప్రజాకూటమి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో వీరిని మచ్చిక చేసుకునే పనిల్లో పార్టీలు ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*