పని అయిపోయిందా? అందుకనేనా? ఇలా?

హార్థిక్ పటేల్ యువకుడు. ఎన్నికల్లో పోటీ చేయకుండా గుజరాత్ లో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. పాటీదార్ ఉద్యమనేతగా ఎదిగిన హార్థిక్ పటేల్ గత గుజరాత్ ఎన్నికల్లో కమలం పార్టీకి ముచ్చెమటలు పట్టించిన విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. పాటీదార్ల ప్రభావం ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో బీజేపీ గెలిచినప్పటికీ బీజేపీ మాత్రం హార్థిక్ పటేల్ దెబ్బకు కొంత భయపడిపోయిందనే చెప్పాలి. అయితే ఈ యువనేత ఎప్పుడూ కొంత దూకుడుగానే వ్యవహరిస్తారన్న పేరుంది. గుజరాత్ ఎన్నికల్లో హార్థిక్ రాసలీలల వీడియోలతో పాటు రాహుల్ గాంధీని హోటల్ లో సీక్రెట్ గా కలుసకున్నారన్న ఫొటోలు కూడా ఈ యువనేత ఇమేజ్ ను భారీగానే డ్యామేజ్ చేశాయి.

ప్రాభవం తగ్గుతుందా?

హార్థిక్ పటేల్ కు గుజరాత్ ఎన్నికలకు ముందు మంచి ఫాలోయింగ్ ఉంది. పాటీదార్ల సభ పెట్టారంటే లక్షలాది మంది జనం వచ్చి వాలిపోతారు. ఆయన పిలుపునిస్తే చాలు వేలసంఖ్యలో పాటీదార్లు వచ్చి నిలబడతారు. కాని గుజరాత్ ఎన్నికల తర్వాత హార్థిక్ పటేల్ ప్రాభవం కొంత తగ్గిందనే చెబుతున్నారు. పటీదార్ అనామత్ ఆందోళన్ నేత హార్థిక్ పటేల్ కు పట్టున్న సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ల లోనే ఆయనకు కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నాయి. యువ పాటీదార్లు హార్థిక్ వెంట ఉన్నప్పటికీ, మధ్యవయస్కులు, వృద్ధులు మాత్రం హార్థిక్ ను నమ్మలేకపోతున్నారని చెబుతున్నారు. అనామత్ ఆందోళన్ లో కూడా విభేదాలు హార్థిక్ బలాన్ని తగ్గించేయనే చెబుతున్నారు.

సీఎం రాజీనామా చేశారంటూ…..

ఈ నేపథ్యంలో హర్థిక్ పటేల్ మరోసారి గుజరాత్ లో హాట్ టాపిక్ గా మారారు. హార్థిక్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని చెబుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేసినట్లు హార్థిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ కలసి ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని కోరినట్లు హార్థిక్ పటేల్ బయటకు చెప్పేశారు. సాధారణంగా ముఖ్మమంత్రి రాజీనామా చేయాలంటే ఆయన వ్యక్తిగతంగానైనా నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే పార్టీ అధిష్టానం నిర్ణయించాల్సి ఉంటుంది. మంత్రివర్గ సభ్యులు రాజీనామా కోరితే ఆయన రాజీనామా చేసే పరిస్థితి ఉండదన్నది అందరికీ తెలిసిందే.

పిల్ల చేష్టలంటున్న బీజేపీ…..

అంతేకాకుండా గుజరాత్ ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సొంత రాష్ట్రం. వారికి తెలియకుండా గుజరాత్ లో ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తి లేదన్న సంగతి ఎవరికీ తెలియంది కాదు. కాని హార్థిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలను పిల్ల చేష్టలుగా కొట్టిపారేస్తున్నారు బీజేపీ నేతలు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి విజయరూపానీయే తాను రాజీనామా చేయాలేదని, చేసే అవసరం కూడా లేదని చెప్పారు. మీడియాలో కన్పించడానికే హార్థిక్ ఇలా అప్పడప్పుడూ హడావిడి చేస్తుంటారని రూపానీ అన్నారు. మంత్రి వర్గ సమావేశంలో రాజీనామా చేయరని, ఎవరైనా రాజీనామా చేయదలచుకుంటే రాజ్ భవన్ కు వెళ్లి ఇస్తారన్న కనీస అవగాహన కూడా హర్థిక్ కు లేదని ఆయన దుయ్యబట్టారు. హార్థిక్ పోగొట్టుకున్న పాపులారిటీ కోసమే ఇలా అప్పడప్పుడూ వార్తల్లోకెక్కేందుకు ప్రయత్నిస్తుంటారన్నది బీజేపీ నేతల వాదన. మొత్తం మీద హార్థిక్ పటేల్ మరీ పలుచనవ్వకుండా ఉండాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన సన్నిహితులు కూడా కొందరు సూచిస్తుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*