వీలైతే ఒక పార్టీ… లేకుంటే జంప్…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే వాతావరణం ఏర్పడుతోంది. ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండటంతో పార్టీల్లో అసంత్రుప్త వాదులు, రాజకీయ ఆకాంక్షలు ఉన్నవారు వేదికలు వెదుక్కుంటున్నారు. పెద్దపార్టీలను వెదుక్కునేవారు కొందరైతే, ఒక పార్టీ నుంచి మరొకపార్టీలోకి మారేవారు మరికొందరు. అలాకాకుండా తమకంటూ ఒక ప్రత్యేక స్థాయి ఉందని భావించేవారు కొత్తపార్టీలు పెట్టేందుకు పూనుకుంటున్నారు. ఇప్పటికే నామమాత్రంగా ఉండి పెద్దగా ప్రాచుర్యంలో లేని పార్టీలను దత్తత తీసుకునేందుకూ వెనకాడటం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తాను చాటుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సామాజిక వెనకబాటు తనం, ప్రాంతీయ అస్తిత్వం, ప్రగతిదాయక విధానాల వంటి అంశాల ప్రాతిపదికపైనా కొత్త పార్టీలు పురుడు పోసుకుంటున్నాయి. ఎన్నిపార్టీలు నిలదొక్కుకుంటాయి? ఎన్ని పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో మాయమవుతాయన్న సందేహాలను పక్కనపెడితే సరికొత్త ఉత్సాహం రాజకీయ తెరపై చిందులు వేస్తోంది.

జేడీ ‘జై’ కొడతారా?…

మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రాజకీయ రంగప్రవేశం ఆసక్తి రేపుతోంది. మార్చి నెలలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పట్నుంచీ ఆయన ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రైతు సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. నిరుద్యోగం, విద్య,వైద్యం వంటి అంశాలపైనా ప్రాంతాలవారీగా పరిస్థితులను తెలుసుకుంటున్నారు. సేవాభావాన్నికనబరిచే లక్ష్మీనారాయణ విద్యారంగంలో సేవాకార్యక్రమాలకే పరిమితమవుతారనే వాదన తొలుత వినవచ్చింది. బీజేపీ, టీడీపీ, జనసేనల్లో ఏదో ఒక పార్టీలో చేరతారనే ప్రచారం సైతం కొంతకాలం పాటు వ్యాపించింది. ఆయా రాజకీయ పార్టీలకు కొన్ని అడ్వాంటేజీలతోపాటు నెగటివ్ మార్కులు ఉన్నాయి. వీటన్నిటినీ భరించడం కంటే కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళితే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. యువతలో ఆదరణ ఉన్న లక్ష్మీనారాయణ ఏ పార్టీలో ప్రవేశించినా దానికి కొంత ఆదరణ వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ తెలుగుదేశం నేత ఒకరు ప్రారంభించిన పార్టీని తన రాజకీయ అరంగేట్రానికి ప్లాట్ ఫారమ్ గా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.

కృష్ణయ్య కొత్త గానం…

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలంగాణలో కొత్త పార్టీ స్థాపన దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీసీల నేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కృష్ణయ్య రాష్ట్రవిభజన తర్వాత జాక్ పాట్ కొట్టారు. తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం పొందారు. ఎమ్మెల్యే అయిపోయారు. బీసీ అభ్యర్థి అయితే ఓట్ల పోలరైజేషన్ కు ఉపయోగపడతాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను చాలా చాకచక్యంగా వినియోగించుకున్నారు. అటు పార్టీ, ఇటు క్రుష్ణయ్య ఇద్దరూ ప్రయోజనం పొందారు. ఇప్పుడు టీడీపీ హవా పోయింది. తిరిగి తాను ఎమ్మెల్యేగా ఎన్నికవుతాననే నమ్మకమూ క్రుష్ణయ్యకు లోపించింది. ఈ పరిస్థితుల్లో బీసీ హక్కుల కోసం పోరాడే ఒక ప్రత్యేక పార్టీని స్థాపిస్తే బాగుంటుందని ఆయన యోచిస్తున్నారు. తనకు వెనకబడిన తరగతుల్లో ఉన్న ఆదరణ ద్రుష్ట్యా అనతికాలంలోనే పార్టీ మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో బీసీల జనాభా చాలా ఎక్కువ. అందువల్ల రాజకీయంగా వివిధ పార్టీలను నియంత్రించేంత శక్తి,సామర్థ్యాలకు తాను పెట్టబోయే పార్టీ వేదికగా మారుతుందనుకుంటున్నారు.

కోదండం గురి కొట్టేనా?..

తెలంగాణ ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్. దూరదృష్టో, దురద్రుష్టమో కేసీఆర్ తో సంబంధాలు చెడిపోయాయి. తెలంగాణ జనసమితిని స్థాపించి రాజకీయంగా ముందుకు వెళుతున్నారు. ప్రజలతో వివిధ అంశాలపై పనిచేస్తున్నారు. అయితే ఉద్యమం వేరు, ప్రజలను ఆకర్షించి ఓట్లను రాబట్టడం వేరు. కోదండ రామ్ కు వ్యక్తిగా ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ పార్టీ అధినేతగా ఆ స్థాయి నిలబెట్టుకోగలుగుతారా? అన్నది వేచి చూడాల్సిన అంశమే. అలాగే అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్తపార్టీ స్థాపిస్తానంటూ ముందుకు వస్తున్నారు. ఇంకా చిన్నాచితక పార్టీలు అనేకం రంగంలోకి వస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగానూ పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. వీటిలో కొన్ని పెద్దపార్టీలతో బేరసారాలకు పెడుతున్నట్టుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సంఖ్యాపరంగా పార్టీలు భారీగానే కనిపించే సూచనలు ఉన్నాయి. వాటిలో డిపాజిట్లు తెచ్చుకోగల పార్టీలు ఎన్ని ఉంటాయో తెలియదు. ఎన్నికల సంఘానికి మాత్రం భారీ ఖర్చు తప్పకపోవచ్చు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*