సీనియర్లు సీన్ మార్చేస్తారనేనా…?

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి.. ఇన్నాళ్లూ కొంత స్త‌బ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కాస్త క‌ద‌లిక మొద‌లైంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కోలుకోలేని స్థాయిలో దెబ్బ‌తిన్న పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం తీసుకొచ్చేందుకు పార్టీ అధికష్టానం దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. గ‌త ఎన్నిక‌లకు ముందు, ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీని వీడిన ప‌లువురు అగ్ర‌నేత‌ల్ని మ‌ళ్లీ సొంత‌గూటికి ర‌ప్పించేందుకు పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ ఓ టీమ్‌ను కూడా రెడీ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణ‌లోనూ పార్టీ హ‌డావుడి చేస్తోంది.

నల్లారి చేరిక ఖాయం…..

తెలంగాణ‌లో డీఎస్‌, ఏపీలో న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ నేత‌లిద్ద‌రూ వేర్వేరుగా పార్టీ పెద్ద‌ల‌తో భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఉమ్మ‌డి రాష్ట్రానికి ఆఖ‌రి ముఖ్య‌మంత్రి నల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న సొంత పార్టీ ఏర్పాటు చేశారు. ఏపీలో 2014 ఎన్నిక‌ల్లో స‌త్తాచాట‌లేక‌పోయారు. ఆయ‌న స్థాపించిన జై స‌మైక్యాంధ్ర పార్టీ ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన పీలేరులో మిన‌హా ఎక్క‌డా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. మ‌ళ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌నే ప్ర‌చారం జ‌ర‌గుతోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌లువురు కాంగ్రెస్ పెద్ద‌ల‌తో కూడా భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్లో చేరితే పార్టీకి పూర్వ‌వైభ‌వం వ‌స్తుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఈ విష‌యంలో మాజీ మంత్రులు ప‌ల్లంరాజు, సుబ్బిరామిరెడ్డి కూడా కిర‌ణ్‌కుమార్‌రెడ్డి రీ ఎంట్రీకి గ‌ట్టి ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఏపీలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు పార్టీలో ఉంటే… పూర్వ‌వైభ‌వం వ‌స్తుంద‌ని ప‌లువురు నేత‌లు భావిస్తున్నారు.

డీఎస్ కు లైన్ క్లియర్….

ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న పీసీపీ మాజీ చీఫ్, ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు చెందిన డీ శ్రీ‌నివాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌నే టాక్ వినిపిస్తోంది. రెండు రోజులుగా ఢిల్లీలో మ‌కాం వేసిన డీఎస్ అక్క‌డ కాంగ్రెస్ అగ్ర‌నేత గులాం న‌బీ ఆజాద్‌తో స‌మావేశం అయిన‌ట్లు తెలుస్తోంది. డీఎస్ క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో జిల్లా టీఆర్ఎస్ నేత‌లంద‌రూ ఎంపీ క‌విత నివాసంలో స‌మావేశ‌మై, డీఎస్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ గులాబీ బాస్‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.

ప్రాంతీయ పార్టీలో ఇమడ లేక…..

అయితే జిల్లా నేత‌ల ఫిర్యాదుపై స్పందించేందుకు డీఎస్ నిరాక‌రించారు. ఎందుకు ఫిర్యాదు చేశారో త‌న‌కు తెలియ‌ద‌నీ, తాను పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఏదేమైనా కాంగ్రెస్‌లో జాతీయ స్థాయి నాయ‌కులుగా ఓ వెలుగు వెలిగి లోక‌ల్‌లో తిరుగులేని కింగ్‌లుగా ఉన్న వారు అంద‌రూ ఇప్పుడు ఇత‌ర ప్రాంతీయ పార్టీల్లో ఇమిడే ప‌రిస్థితి లేదు. దీంతో ఇప్పుడు వాళ్ల‌కు మ‌ళ్లీ కాంగ్రెస్సే బెట‌ర్ ఆప్ష‌న్‌గా క‌న‌ప‌డుతోంది. ఏదేమైనా.. పార్టీని వీడిన కీల‌క నేత‌లంద‌రినీ మ‌ళ్లీ సొంత గూటికి తీసుకురావాల‌ని కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ప్ర‌య‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి మ‌రి. ఒకవేళ వీళ్లు పార్టీలో చేరినా వారివల్ల పార్టీకి ఎంతమేర లాభం అన్నది కూడా చూడాలి.