వీరిద్దరూ కాంగ్రెస్ కు టోపీ పెట్టేస్తారా?

ఉత్తరప్రదేశ్ లో విపక్ష రాజకీయాలు సంఘటితంగా ఉంటాయా? బీఎస్పీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయా? లేదు. డౌటే అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ తర్వాత సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కు అక్కడ పెద్దగా ఓటు బ్యాంకు లేదు. గత రెండు ఎన్నికల్లో అది స్పష్టమయింది. ఉత్తరప్రదేశ్ నుంచే కాంగ్రెస్ అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ కాలుమోపే పరిస్థితి లేదన్నది విశ్లేషకుల అంచనా.

అతి పెద్ద రాష్ట్రంలో…..

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కలసి పోటీ చేసినా కమలం పార్టీకి సరైన పోటీ ఇవ్వలేకపోయాయి. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గల్లంతయిందన్నది ఆ ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టడానికి సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ అయిష్టత చూపుతున్నాయి.

కాంగ్రెస్ కు తక్కువ సీట్లు…..

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను కలుపుకోకుండా బీఎస్పీ, ఎస్సీలే కలసి వెళ్లాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్ వత్తడి తెస్తే రెండు, మూడు సీట్లకు మించి ఇచ్చేది లేదన్న అభిప్రాయంలో అఖిలేష్ యాదవ్, మాయావతి ఉన్నారు. కాంగ్రెస్ కు పెద్దగా ఓటు బ్యాంకు లేదన్నది వారి అభిప్రాయం. దీంతో అతి పెద్ద రాష్ట్రంలో అతి పెద్ద చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కష్టాలు తప్పేట్లు లేవు.

ఒప్పందం అమలయ్యేనా?

ఇదిలా ఉండగా బీఎస్పీ, ఎస్పీ మధ్య ఒప్పందం కుదిరినట్లు కూడా వార్తలొస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి అత్యధిక సీట్లు, నాలుగేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీకి ఎక్కువ సీట్లు కేటాయించుకునేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు అఖిలేష్ యాదవ్, మాయావతిలు ఒక అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి హ్యాండ్ ఇవ్వరని గ్యారంటీ ఏదన్న ప్రశ్నలు కూడా ఎస్పీ నేతల నుంచి వస్తున్నాయి. అయితే బీఎస్పీ, ఎస్సీ అధినేతల మధ్య జరిగే ఒప్పందానికి విలువ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు తక్కువ సీట్లు ఇస్తే అంగీకరిస్తుందా? అన్నది సందేహమే. చూడాలి ఏం జరుగుతుందో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*