అయ్యెయ్యో…‘‘చేతిలో’’ డబ్బులు..?

ఆర్థిక ఇబ్బందులు ఆ పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్నాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు నిధుల కోసం చేతులు చాస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారైంది. జాతీయ స్థాయిలో కూడా హస్తం పార్టీని నిధుల సమస్య వేధిస్తుండటంతో ఏపీని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఏపీలో ఏ చిన్న పాటి కార్యక్రమం చేపట్టాలన్నా చేతులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ పరిచయాలతో హైదరాబాద్ నుంచే ఎక్కువగా నిధులను సమీకరిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో నిధుల సమీకరణ జరగడం లేదు. కాంగ్రెస్ కు విరాళాలిచ్చేందుకు పారిశ్రామిక వేత్తలు కూడా ఏపీలో మొహం చాటేస్తున్నారు.

ప్రణాళికలు రచించినా…..

ఏపీలో కాంగ్రెస్ మరో దశాబ్దం పాటు కోలుకోలేదన్నది అధిష్టానానికి తెలుసు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలో తమ పార్టీ పరిస్థితి గురించి చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం హోప్స్ అంతా తెలంగాణపైనే పెట్టుకున్నారు. దీంతో ఏపీని దాదాపుగా గాలికి వదిలేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని నియమించారు. చాందీ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక ప్రణాళికలు రచించారు. ఉమెన్ చాందీ స్వయంగా అనేక జిల్లాల్లో పర్యటించారు. ఈ పర్యటనలకు అయిన ఖర్చుకూడా అతి కష్టం మీద సమకూర్చుకోవాల్సి వచ్చిందన్నది పార్టీలో టాక్.

రాహుల్ టూర్ ఖర్చు…..

ఇక రాహుల్ గాంధీ టూర్ ఈ నెల 18న కర్నూలు జిల్లాలో ఉంది. సభను సక్సెస్ చేయాలని ఉమెన్ చాందీ, రఘువీరారెడ్డి భావిస్తున్నారు. కానీ నేతల నుంచి పెద్దగా స్పందన కన్పిచడం లేదు. జనసమీకరణ చేయాలంటే డబ్బులెక్కడున్నాయని, డబ్బులు పంపిస్తే జనాలను తీసుకొస్తామని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు చెందిన నేతలు కొందరు వారి మొహం మీదనే చెప్పడంతో అవాక్కయ్యారట. రాహుల్ సభకు కనీసం రెండుకోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు ఏపీసీసీకి ఇది పెద్దమొత్తమే. కానీ సభ సక్సెస్ కాకుంటే అధినేత చేతుల్లో చీవాట్లు తప్పవు. దీంతో రఘువీరా కాళ్లరిగేలా కాంగ్రెస్ నేతలు చుట్టూ తిరుగుతున్నారన్నది ఆ పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న మాట.

చేరికలు కూడా లేక……

రాష్ట్ర విభజనతో మొదలయిన కష్టాలు కాంగ్రెస్ ను ఇప్పట్లో వదిలిపెట్టేలా లేవు. ఉమెన్ చాందీ ఇన్ చార్జిగా వచ్చిన తర్వాత సీనియర్ నేతలు పార్టీలోకి వస్తారని భావించారు. పాతనేతలందరినీ పార్టీలోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాకతో పార్టీ కొంత పుంజుకుంటుందని భావించారు. కానీ మాజీ మంత్రి కొండ్రుమురళి పార్టీని వీడుతున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా త్వరలోనే టీడీపీలో చేరే ఛాన్స్ ఉంది. పార్టీని నమ్ముకుని డబ్బులు పెట్టుకోవడానికి నేతలెవ్వరూ సిద్ధంగా లేకపోవడంతో రఘువీరాకు భవిష్యత్ అయోమయంగా కన్పిస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద ఏపీ కాంగ్రెస్ కు నేతల కొరతతో పాటు కరెన్సీ కష్టాలు కూడా తోడయ్యాయన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*