దసరా ధమాకా ఎవరికి?

వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండటంతో కర్ణాటకలో రాజకీయాలు ఊపందుకున్నాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ లో మంత్రి పదవుల కోసం వింత పోకడలు నేతలు అవలంబించడం చర్చనీయాంశంగా మారింది. ఇక బీజేపీ మంత్రి వర్గ విస్తరణ జరగనున్న అనంతర పరిణామాలపై ఒక కన్ను వేసి ఉంచింది. మంత్రి వర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా అసమ్మతి తీవ్రంగా తలెత్తుతందని బీజేపీ ఆశతో ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇదే ఆఖరి అవకాశమని భావిస్తున్న నేతలు ఖచ్చితంగా తమవైపునకు మొగ్గు చూపుతారన్న విశ్వాసాన్ని బీజేపీ నేత యడ్యూరప్ప వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన బెంగళూరు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కోల్పోవడంలో సరైన వ్యూహం పాటించకపోవడమేనని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కొద్దిగా గట్టిగా దృష్టి పెట్టి ఉంటే మేయర్ పదవని కైవసం చేసుకుని ఉండేవారమంటున్నారు.

వచ్చే నెల 10న……

కర్ణాటక రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ వచ్చే నెల 10వ తేదీన జరగాల్సి ఉంది. ఈ మేరకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, జనతాదళ్ (ఎస్) నుంచి ఇద్దరు కొత్తగా కుమారస్వామి కేబినెట్ లోకి చేరబోతున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మంత్రి వర్గ సభ్యుల జాబితా కర్ణాటక కాంగ్రెస్ నేతలు అందించారు. ఆయన కర్ణాటక ఇన్ ఛార్జి వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో చర్చించిన తర్వాత జాబితాను ముఖ్యమంత్రి కుమారస్వామికి పంపనున్నారని చెబుతున్నారు.

కేబినెట్ లో చోటు కోసమేనా?

మంత్రివర్గ విస్తరణ జరగుతుందని పక్కా సమాచారం ఉండటంతో కాంగ్రెస్ నేతలు తమ టాక్టీస్ లను ఉపయోగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీ హెబ్బాళ్కర్ తనకు భారతీయ జనతా పార్టీ 30 కోట్ల మేరకు ఎర చూపిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ హెబ్బాళ్కర్ బెళగావి రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆమెను కొందరు బీజేపీ నేతలు పార్టీ ఫిరాయించాలని ప్రోత్సహించారట. అందుకు 30 కోట్లు ఇస్తామని కూడా హెబ్బాళ్కర్ చెబుతున్నారు. బీజేపీ నేతలు తనతో జరిపిన సంభాషణలను కూడా తాను రికార్డు చేశానని చెప్పారు. దీనిపై ఉపముఖ్యమంత్రి పరమేశ్వరకు కూడా తెలిపానన్నారు.

అనుమానాలంటున్న…..

అయితే ఇందులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. లక్ష్మీ హెబ్బాళ్కర్ కు, అదే బెళగావి ప్రాంతానికి చెందిన రమేష్ జార్ఖిహోళి, సతీష్ జార్ఖిహోళి సోదరులకు మాధ్య విభేదాలు తలెత్తాయి. ఈమె కారణంగానే వారు పార్టీని వీడిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే సిద్ధరామయ్య జోక్యంతో వారు పార్టీలోనే కొనసాగుతున్నారు. మంత్రి వర్గ విస్తరణ లో చోటు సంపాదించుకోవడం కోసమే లక్ష్మీ హెబ్బాళ్కర్ ఈ డ్రామాలు ఆడుతున్నారని సొంత పార్టీనేతల్లోనే అనుమానం తలెత్తింది. తనను సంప్రదించిన బీజేపీ నేతల పేర్లు బయటకు చెప్పకపోవడం, 30 కోట్ల అనడాన్ని నమ్మలేకపోతున్నామంటున్నారు. మరోవైపు బీజేపీ నేతలు విస్తరణ తర్వాత ఖచ్చితంగా పది నుంచి పదిహేను మంది వరకూ తమవైపు వస్తారని నమ్మకంగా ఉన్నారు. దసరాకు ముందే కర్నాటకలో సీన్ మారుతుందా? మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*