శభాష్ సిద్ధూ..భేష్ కుమార….!!

కర్ణాటకలో కొద్దికాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలతో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడింది. అప్పటి కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఎన్నికల తర్వాతే మహాకూటమికి బీజం పడింది కూడా. దేశంలోని అన్ని పార్టీలూ మోదీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలని నినదించింది కూడా కన్నడ గడ్డమీద నుంచే. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, నారా చంద్రబాబునాయుడు వంటి నేతలు హాజరై బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పారు. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్, జనతాదళ్ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్నిఏర్పాటు చేయగలిగాయి.

ఆరు నెలల నుంచి….

అయితే సంకీర్ణ సర్కార్ గత ఆరు నెలల నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ముఖ్యంగా బీజేపీ ఆపరేషన్ కమలకు తమ ప్రభుత్వం కుప్పకూలుతుందేమోన్న ఆందోళన కాంగ్రెస్, జేడీఎస్ లలో లేకపోలేదు. ఒక దశలో కాంగ్రెస్ కు చెందిన 20 మంది శాసనసభ్యులు రిసార్ట్స్ లో చేరి రాజకీయం కూడా నడిపారు. అసంతృప్త నేతలు వెళ్లి పోతారేమోనన్న బెంగ ఇరు పార్టీలకూ పట్టుకుంది. మంత్రివర్గంలో చోటు లేదన్న కారణంగా అసంతృప్తితో ఉన్న నేతలకు బీజేపీ నేతలు బిస్కెట్లు వేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అధికారానికి కేవలం ఎనిమిది సీట్లు దూరంలో ఉన్న బీజేపీ ఏదైనా చేయగలదన్న భయం ఇటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, అటు ముఖ్యమంత్రి కుమారస్వామిని నిద్రపోనివ్వలేదు. అయితే ఈ ఫలితాలు వారికి మనోనిబ్బరాన్ని కల్గిస్తున్నాయి.

ఐక్యతగా నిలబడి…

అసంతృప్త నేతలు ఎంతమంది ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం కొంత కరకుగానే వ్యవహరించింది. ఉప ఎన్నికల తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తేల్చింది. అంతేకాకుండా ఈ ఉప ఎన్నికలలో సమన్వయంతో కలసి వెళితేనే గెలుపు సాధ్యమని నేతలకు నూరిపోసింది. ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి. కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ ల కూటమికి ఇంత భారీ విజయం లభించడానికి కారణం రెండు పార్టీల నేతల సమిష్టి కృషి కారణం. సిద్ధరామయ్య, దేవెగౌడ, కుమారస్వామి లు ఒకే వేదికను పంచుకుని ఇటు క్యాడర్ కు, అటు ఓటర్లకు స్పష్టమైన సంకేతాలను పంపగలిగారు. సిద్ధరామయ్య ప్రధానంగా జమఖండి అసెంబ్లీ నియోజకవర్గం, బళ్లారి పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి పెట్టగా మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం శివమొగ్గ, మాండ్య పార్లమెంటు స్థానాల్లోనే ఎక్కువగా ప్రచారం నిర్వహించాచారు.

దేశవ్యాప్తంగా ఈ ఫలితాలు…

మొత్తం మూడు పార్లమెంటు స్థానాలు, రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగితే నాల్గింటిలో కూటమి ఘన విజయం సాధించడం ఐక్యతకు నిదర్శనమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. క్యాడర్ సహకరించదేమోనన్న అనుమానం ఈ ఫలితాలు పటాపంచలు చేసింది. ఇక బళ్లారిలో విజయం సాధించడం కాంగ్రెస్ కు ఆక్సిజన్ అందినట్లే. ఈ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటం కలసి వచ్చింది. బళ్లారి, మాండ్య పార్లమెంటు స్థానాలు కూటమి ఖాతాలో పడటం వచ్చే లోక్ సభ ఎన్నికలకు శుభ సూచకమని అంటున్నారు. మొత్తం మీద కర్ణాటక ఉప ఎన్నికలు మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నేతల మధ్య ఐక్యత ఉంటే గెలుపు సునాయాసమని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. మరి ఈ ఐక్యత వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ చూపించగలిగితే మోదీని ఓడించడం సులువు కాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*