షేక్ చేస్తున్న బెళగావి….బళ్లారి…..!

ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో బెళగావి, బళ్లారి పేర్లు వింటేనే రాజకీయ పార్టీలు ఉలిక్కి పడుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (ఎస్)లు ఈ పేర్లు వింటేనే షేక్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉన్నారని, వారి నుంచి అడ్వాన్స్ కూడా పొందారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. అనుమానమే కాదు తమ వద్ద పక్కా సమాచారం ఉందని కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో బెళగావి జిల్లాలో ముఖ్యమంత్రి కుమారస్వామి జనతాదర్శన్ కార్యక్రమాన్ని పెట్టడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు సాయంత్రం బెళగావిలోని సువర్ణ సౌధలో రెండు గంటల పాటు ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు.

బ్రదర్స్ హెచ్చరికలతో……

బెళగావి ప్రాంతంలో రమేష్ జార్ఖిహోళి, సతీష్ జార్ఖిహోళి బ్రదర్స్ రాజకీయంగా ప్రముఖులు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ తో విభేదాలు రావడంతో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే మంత్రి డీకే శివకుమార్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కూడా లక్ష్మీ హెబ్బాళ్కర్ కు వత్తాసు పలకడంతో వీరు కాంగ్రెస్ ను వీడనున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు మరో పథ్నాలుగు మంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళతారని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమై ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలుచేస్తున్నారు.

వారి మధ్య…..

అయితే బెళగావి బ్రదర్స్ తీరుపట్ల కాంగ్రెస్ హైకమాండ్ అసహనంతో ఉందని తెలుస్తోంది. అయితే ఈ బెళగావి బ్రదర్స్ ను విడదీయాన్న వ్యూహంతో కాంగ్రెస్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక కేబినెట్ లో రమేష్ జార్ఖిహోళి ఉన్నారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించి ఆయన సోదరుడు సతీష్ జార్ఖిహోళికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇలా చేస్తే బ్రదర్స్ మధ్య విభేదాలు తలెత్తి కొంత పరిస్థితి సర్దుబాటు అవుతుందన్న అంచనాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కానీ ఇది ఎంతవరకూ సాధ్యం అని పిస్తున్నా….ఈ ఎత్తుగడతో రమేష్ జార్ఖిహోళి వెంట ఎక్కువ మంది పార్టీ వీడే అవకాశముండదని భావిస్తున్నారు.

బళ్లారిలో స్టార్ట్ అయిందా?

మరోవైపు బీజేపీపై ఇటు కాంగ్రెస్, అటు జేడీఎస్ విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా బళ్లారి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు బీజేపీ ఇరవై నుంచి 30 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర తెలిపారు. బళ్లారి జిల్లాలో బీజేపీ నేత శ్రీరాములుకు మంచి పట్టుంది. గాలి జనార్థన్ రెడ్డి సోదరులకు కూడా హవా ఉండటంతో ఇక్కడ కూడా ఆపరేషన్ కమలం స్టార్టయిందంటున్నారు. కోట్లాదిరూపాయలను సంకీర్ణ సర్కార్ ను కూల్చేందుకు సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రి కుమారస్వామి సయితం నిఘాసంస్థలు అందించిన నివేదికల ప్రకారం సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇలా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ముందుగానే ఎదురుదాడికి దిగుతూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. మరోవైపు బీజేపీ మాత్రం తాము ప్రభుత్వాన్ని పడగొట్టనవసరం లేదని, దానంతట అదే కూలిపోతుందని జోస్యం చెబుతుండటం విశేషం.

సి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*