‘‘ఐ’’క్యత కనపడదే….!

ఆ పార్టీలో ఐక్యత అన్నది ఏ కోశానా కనపడదు. అధికారంలో ఉన్నా సరే…విపక్షంలో ఉన్నా సరే… ఎవరి దారి వారిదే. ఎవరికి వారే తాము లేకుంటే పార్టీయే లేదనే స్థాయికి వచ్చేస్తారు. ఒకవైపు సంకీర్ణ సర్కార్ కు గండం పొంచి ముందన్న సంకేతాలు వెలువడుతున్నా వారి పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుండటంతో గ్రూపుల గోల ఎక్కువయిందంటున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే మరోసారి అసంతృప్తి చెలరేగే అవకాశముందని, సీనియర్ నేతలంతా కలసి కట్టుగా నడవాలని హైకమాండ్ చిలక్కి చెప్పినట్లు చెప్పినా నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు.

ఢిల్లీలో కుమారస్వామి…..

ఈ నెల రెండో వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉండనుంది. మొత్తం ఆరు స్థానాలను భర్తీ చేస్తారా? లేక నాలుగింటితో సరిపెడతారా? అన్న సందిగ్దం ఇంకా వీడలేదు. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సమయం దొరికితే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తారు. ఈ సందర్భంగా రాహుల్ తో ఒకేసారి ఆరు పదవులను భర్తీ చేస్తే మంచిదని చెప్పటానికి కుమారస్వామి నిశ్చయించుకున్నారు. రెండింటినిఆపితే మళ్లీ అక్కడడక్కడ అసంతృప్తులు పెరుగుతాయని, రోజువారీ పాలనకు అది ఆటంకంగా మారుతుందని కుమారస్వామి రాహుల్ కు వివరించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయాలంటూ…..

అయితే కాంగ్రెస్ లోని ఒక వర్గం ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ చేపట్టకుండా ఉంటే మేలని పార్టీ హైకమాండ్ కు ఇప్పటికే సూచించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన వెంటనే సంకీర్ణ సర్కార్ కు నూకలు చెల్లుతాయనికూడా కొందరు హైకమాండ్ కు తెలిపారు. అయితే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ , మరో మంత్రి డీకే శివకుమార్, పీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావులు మాత్రం మంత్రి వర్గ విస్తరణను తక్షణమే చేపట్టాలని సూచించారు. మరి హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ప్రత్యేకసమావేశాలతో……

ఇక మంత్రివర్గ విస్తరణపై ప్రస్తుతమున్న మంత్రులతో డీకే శివకుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందరికీ విందుపేరిట జరిగిన ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్ హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సమావేశానికి దూరంగా ఉండటం విశేషం. అలాగే పీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావు కూడా రాలేదు. డీకే తన పట్టును నిరూపించుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. డీకే, పరమేశ్వర్ లు కుమారస్వామితో కలిసి తనను దూరం పెడుతున్నారని సిద్ధరామయ్య ఇప్పటికే అధిష్టానం వద్ద వాపోయిన సంగతి తెలిసిందే. అయినా సిద్ధరామయ్య తో అయ్యేదేమీ లేదని అధిష్టానానికి చెప్పేందుకే డీకే ఈ ప్రయివేటు సమావేశాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ లో చర్చించుకుంటున్నారు. ఈ సమావేశానికి మంత్రి రమేష్ జార్ఖిహోళి కూడా హాజరుకాలేదు. ఇలా సంకీర్ణ సర్కార్ నడుస్తున్నా కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఐక్యత లేకుండా తలోదారి నడుస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*