కాంగ్రెసు చేతులెత్తేసిందా?

తెలుగు రాష్ట్రాల్లో అధికారంపై కాంగ్రెసు పార్టీ ఆశలు వదిలేసుకుంటోందన్న వాదన బలం పుంజుకొంటోంది. 2019 ఎన్నికలకు సమాయత్తం చేసే కీలక కమిటీల్లో ఏపీ, తెలంగాణలకు మొండిచేయి చూపడంతో ఈ విషయం రూఢి అవుతోంది. రాహుల్ గాంధీ పునర్వ్యవస్థీకరించిన కాంగ్రెసు వర్కింగు కమిటీలో గతంలోనే తెలుగువారిని పక్కనపెట్టేశారు. పోనీలే విధానపరమైన విషయాలకే పరిమితమయ్యే సీడబ్ల్యుసీ కి ఉన్నపరిమితులను ద్రుష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోవచ్చునని భావించారు. నాయకులు తమకు తాము సర్ది చెప్పుకున్నారు. కానీ తాజాగా నియమించిన ఎన్నికల కీలక కమిటీల్లో పక్కనపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కోర్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మేనిఫెస్టో కమిటీ మూడింట్లో ఒక్కదానిలోనూ తెలుగు నేతలకు చోటు దక్కలేదు. దీనిపై పార్టీలో అంతర్గతంగా తీవ్రస్థాయి అసంత్రుప్తి వ్యక్తమవుతోంది. జంబో సైజులో ఉండే కాంగ్రెసు కమిటీలను కుదించే ప్రక్రియలో భాగంగా పక్కనపెట్టేశారా? లేక వీరికంత ప్రాధాన్యం ఇవ్వనక్కర్లేదనే ఉద్దేశంతో దూరం చేశారా? అన్నదే ఇప్పుడు చర్చ.

చిన్నచూపు..చివరి ఆశ…

రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ నేతలు తమ మాట నెగ్గించుకోగలిగారు. సీమాంధ్రకు చెందిన వారు రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించినా వారిని పట్టించుకోలేదు. పూర్తిగా రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పాటైతే కచ్చితంగా తెలంగాణపీఠం తమదేననే ఆశతో కాంగ్రెసు ధృఢమైన నిర్ణయాన్ని తీసుకుంది. టీఆర్ఎస్ కలిసివచ్చేందుకు ముందుకు వచ్చినా కాలదన్నుకున్నారు. స్థానిక కాంగ్రెసు నాయకుల మాటలు నమ్మి టీఆర్ఎస్ తో కనీస సంప్రతింపులు చేయలేదు. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అధికారం సంగతి పక్కనపెట్టినా టీఆర్ఎస్ బలంలో మూడోవంతుకే కాంగ్రెసు పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ హస్తం పార్టీ బలం క్షీణిస్తూ వచ్చింది తప్ప పెరిగిందేమీ లేదు. నాయకుల ప్రగల్భాలను మినహాయిస్తే నానాటికీ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. దీంతో తెలంగాణ నాయకత్వంపై అధిష్టానానికి చిన్న చూపు ఏర్పడింది. వీరు సాధించేదేమీ లేదనే అంచనాకు వచ్చేశారు. అధిష్టానం చేయించుకున్న సొంత సర్వేల్లో కాంగ్రెసు ప్రస్తుత బలం నిలుపుకోగలగడమే గొప్ప అన్న తీరులో ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెసు పార్టీ ఇప్పట్లో పుంజుకోదు. ఇది అధిష్టానం స్వయంక్రుతాపరాధం. తెలంగాణలో నాయకులు సరైన సమయంలో, సరైన రీతిలో పొలిటికల్ అడ్వాంటేజీ తీసుకోలేకపోవడం వల్ల కాంగ్రెసు నష్టపోయింది. అధిష్ఠానం వ్యూహాత్మక తప్పిదాలతో ఆంధ్రాలో అస్తిత్వాన్ని కోల్పోయింది.

కలుపుకోవడంలో కష్టాలు…

తెలంగాణలో కాంగ్రెసు అధికార టీఆర్ఎస్ ను తీవ్రంగా ప్రతిఘటించాలంటే అన్ని శక్తియుక్తులను సమకూర్చుకోవాలి. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తేవాలి. పొలిటికల్ ట్రెండ్ అధికారపార్టీకి అనుకూలంగా ఉంది. వివిధ వర్గాల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో లేదు. సార్వత్రిక మైన అసంతృప్తి ఇంకా నెలకొనలేదు. విద్యార్థి, నిరుద్యోగ వర్గాల్లో చెల్లాచెదురుగా అసంత్రుప్తి ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే స్థాయికి అది సంఘటితం కాలేదు. రైతు, ఉద్యోగ, వ్యాపార, వృత్తిపరమైన వర్గాల్లో ఇంకా టీఆర్ఎస్ కు బలమైన మద్దతు లభిస్తోంది. టీడీపీ, సీపీఎం వంటివాటిని కలుపుకుని పోవడంలో కాంగ్రెసుకు ఇంకా స్పష్టత లేదు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వంటివి ప్రతిపక్ష ఐక్యతకు విఘాతంగా కనిపిస్తున్నాయి. పైపెచ్చు తెలుగుదేశం భారీగానే సీట్లు కోరవచ్చు. అలాగే కోదండరామ్ నేత్రుత్వంలోని తెలంగాణ జనసమితి కూడా. టీడీపీ కనీసం 20 సీట్లు , జనసమితి 15 సీట్లు అడుగుతున్నట్లుగా సమాచారం. హైదరాబాదు పాతబస్తీలోని ఏడుసీట్లు ఎలాగూ ఎంఐఎంకే వస్తాయి. మొత్తం 42 సీట్లు పోతే మిగిలిన స్థానాలు 77 మాత్రమే. అధికారానికి కనీసం సొంతంగా 60 సీట్లు కావాలి. ఈ గణాంకాలు చూస్తే పొత్తులు అసాధ్యంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెసు గ్రూపు నాయకులు తమ స్థానాలు టీడీపీ, టీజేఎస్ లకు ఇవ్వడానికి ససేమిరా అంగీకరించరు.

గైడెన్స్ కరవు…

అధిష్టానం నుంచి తెలుగు రాష్ట్రాల పీసీసీలకు గైడెన్స్ కూడా కరవైంది. అప్పుడప్పుడు ఇన్ ఛార్జిల పర్యటనలు మినహా స్ట్రాటజీ కరవైంది. ఎలాగూ ఆశలు లేవు కాబట్టి వాళ్లలో వాళ్లే పడతారులే అన్నట్లు ఉదాసీనంగా తయారైంది హైకమాండ్. మూడు ప్రధాన కమిటీల్లో తెలుగు నాయకులెవరికీ కనీస స్థానం లభించలేదు. అంటే అధిష్టానం తమ ఆలోచనలు సైతం వీరితో పంచుకునే అవకాశాలు కరవు అయ్యాయి. వీరిచ్చే సూచనలు , సలహాలను పట్టించుకునే వారు లేరు. 2019 ఎన్నికలకు ఎత్తుగడలు, వ్యూహాలు, పొత్తుల వంటి విషయాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కోర్ కమిటీకి అప్పగించారు. ఇందులో కీలకమైన తొమ్మిది మంది నేతలున్నారు. ప్రజలను ఆకర్షించే ప్రధాన బాధ్యతను మేనిఫెస్టో కమిటీపై ఉంచారు. ఇక అధిష్టానం ఆలోచనలు, ప్రణాళికలకు విస్త్రుత ప్రచారంతో ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పబ్లిసిటీ కమిటీకి అప్పగించారు. వీటిలో ఎక్కడా తెలుగుదనం లేదు. ఈ నియామకాలను బట్టి చూస్తే కాంగ్రెసు పార్టీ ఏపీ, తెలంగాణలపై ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తోందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*