కుడితిలో పడ్డ కాంగ్రెస్ ….!

ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారంటే ఇదేనేమో. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తే ఏపీకి ప్రత్యేక హోదా అంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానం ఇప్పుడు తెలంగాణాలో ఆ పార్టీకి తెలియకుండానే డ్యామేజ్ చేసేలా వుంది. ఆంధ్ర ప్రదేశ్ విభజనతో రాజకీయ లబ్ది పొందాలన్న ఎత్తుగడతో 2014 ఎన్నికల ముందు హడావిడి విభజన చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ. దశాబ్దాల తెలంగాణ వాసుల కోరిక తీర్చామన్న సెంటిమెంట్ తో పాగా వేయాలన్న కాంగ్రెస్ కలలు కల్లలు అయ్యాయి. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తా సోనియా కాళ్ళముందు పడివుంటానన్న కేసీఆర్ మాటలు నమ్మి మరింత మోసపోయింది హస్తం పార్టీ. ఆంధ్రా లో వైఎస్సాఆర్ మరణం తరువాత ఆ సెంటిమెంట్ తో వైసిపి అధికారంలోకి రాకుండా ఉంటే చాలన్న కాంగ్రెస్ ఎత్తుగడ పన్నింది. కాంగ్రెస్ అనుకున్న స్కెచ్ తెలంగాణ లో కేసీఆర్ మాట మార్చడంతో ఉల్టా అయ్యింది. ఏపీలో కాంగ్రెస్ ఎత్తుగడలకన్నా టిడిపి, వ్యూహాత్మకంగా బిజెపి, జనసేన పొత్తు ఫలించి వైసిపి అధికారానికి దగ్గరగా వచ్చి దెబ్బతిని మరో రకంగా సోనియా కోరిక నెరవేరింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని …

ఇప్పుడు ఎపి విషయంలో తప్పు చేశామని గుర్తించిన కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సిడబ్ల్యుసి లో తీర్మానం చేసింది. అదే ఇప్పుడు టీఆర్ఎస్ కి రాజకీయ అస్త్రంగా మారింది. తెలంగాణ లో తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టడానికి టీఆర్ఎస్ హోదా అంశాన్ని చక్కగా మలిచింది. ఏపీకి ఇస్తే తెలంగాణకు హోదా ఇచ్చి తీరాలంటుంది టీఆర్ఎస్. అదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తలపోటు అంశంగా మారింది.

రెండు రాష్ట్రాల్లోనూ…..

ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలానూ జీరోకి పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో కొద్దొగొప్పో లేస్తుంది అనుకున్నా అదేమీ సీట్లు సాధించే దాకా పోతుందో లేదో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చిక్కుల్లో పడే పరిస్థితి ప్రస్ఫుటం అవుతుంది. ఏపీకి హోదా ప్రధాన అంశం అయ్యే పక్షంలో కాస్తో కూస్తో సీమాంధ్ర ప్రజలు అధికంగా వుండే హైదరాబాద్ లోనే ఉంటుంది. కానీ మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు అదే ఇప్పుడు ఆ పార్టీని భయపెడుతుంది. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకి కోపం అన్న చందంగా వుంది ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హస్తం పార్టీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*