నేను చెప్పలా…అదే జరుగుతుంది…!

కన్నడ నాట స్థానిక సంస్థల ఎన్నికలు ఒక నిజాన్ని మాత్రం చెప్పాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పినట్లుగానే జరుగుతుంది. కానీ అవసరం కాంగ్రెస్ ది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని నిలువరించాలన్న లక్ష్యం ముందు కాంగ్రెస్ పార్టీ కన్నడనాట పట్టుకోల్పోయే ప్రమాదముందన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. నిన్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు తెచ్చినా లోలోపల మాత్రం భవిష్యత్ పై బెంగ తప్పడం లేదు. జేడీఎస్ తో కలుపుకుని వెళితే కాంగ్రెస్ కొన్ని ప్రాంతాల్లో నిర్వీర్యమవుతుందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలినుంచి చెబుతూనే వస్తున్నారు. కాని కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయన మాటలను పెడచెవిన పెడుతోంది.

జేడీఎస్ తో కలిస్తే……

లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా వెళదామన్నది సిద్ధరామయ్య ఉద్దేశ్యం. అయితే అధిష్టానం మాత్రం జేడీఎస్ తో కలసి వెళ్లాలనే నిర్ణయించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని రెండు పార్టీలూ అనుకున్నాయి. ఆ మేరకే ఎన్నికలకు వెళ్లాయి. జిల్లా నాయకత్వామే అభ్యర్థులఎంపిక, ప్రచార బాధ్యతను తీసుకుంది. అయితే కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలే వచ్చినప్పటికీ చాలా చోట్ల జేడీఎస్ మీద ఆధారపడాల్సి వచ్చింది.

కంచుకోటల్లో ఎదురుదెబ్బ…..

సిద్ధరామయ్య తొలినుంచి అంటున్నట్లుగానే మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తన సొంత ప్రాంతం,కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టున్న మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ కు అతి తక్కువ స్థానాలు దక్కాయి. మైసూరు నగరపాలక సంస్థలో అధికారం దక్కించుకోవాలంటే జేడీఎస్ తో చేతులు కలపాల్సి ఉంటుది. అలాగే ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్ సొంత ప్రాంతమైన తుముకూరులో కూడా కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు40 శాతం ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో రెండు శాతం తగ్గి 38 శాతం మాత్రమే రావడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన బయలుదేరింది. జేడీఎస్ అంటే పడని సిద్ధరామయ్య అలా వ్యాఖ్యానించి ఉంటారని భావించిన రాష్ట్ర నేతలు కొందరు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.

జేడీఎస్ బలం పెరిగిందా?

స్థానిక సంస్థల ఎన్నికల్లో జేడీఎస్ కూడా మంచి ఫలితాలే రావడంతో లోక్ సభ ఎన్నికలపైనా మాజీ ప్రధాని దేవెగౌడ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన జేడీఎస్, కాంగ్రెస్ మైత్రిని ప్రజలు ఆదరించారని చెప్పడం లోక్ సభలో కూడా ఇదే మైత్రి కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు. దీన్ని బట్టి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ అధిక స్థానాలను ఆశించే అవకాశముంది. ఇది కాంగ్రెస్ కు మింగుడుపడని అంశం కాగా, జేడీఎస్ కు స్థానిక సంస్థల ఎన్నికలు కలసి వచ్చాయనే చెప్పాలి. ఉత్తర, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో జేడీఎస్ పుంజుకోవడంతో కాంగ్రెస్ జేడీఎస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చుకోక తప్పేలా లేదు. అయితే సీట్లకు, సీఎం పదవికి కాంగ్రెస్ ముడిపెట్టే అవకాశముందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే కాంగ్రెస్, జేడీఎస్ లు కలిస్తే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*