హ్యాండిస్తామని షేక్ చేస్తున్నారు…..!

కర్ణాటక సంకీర్ణ సర్కార్ లో ముసలం పుట్టేలా ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. అతిపెద్ద పార్టీగా రెండోసారి అధికారంలోకి వచ్చినా తమకు మంత్రి పదవులు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ జరపి, తమకు కేబినెట్ లో చోటు ఇవ్వాలంటూ గట్టిగా కోరుతున్నారు. అయితే ఆషాఢం బూచి చూపి ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రివర్గ విస్తరణ జరపడం లేదు. ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తే తప్ప తాను విస్తరణ చేపట్టలేనని కుమారస్వామి చెబుతూనే ఉన్నారు.

పట్టించుకోక పోవడంతో……

ఢిల్లీ పెద్దలు రానన్న లోక్ సభ ఎన్నికలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్ినకలపై ఉన్న దృష్టి కర్ణాటక మీద లేదు. సంకీర్ణ ప్రభుత్వం సజావుగా నడుస్తుందన్న ధోరణిలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోక్ సభ ఎన్నికల బాధ్యతను అప్పగించారు. మరోవైపు స్థానికసంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంకా కాంగ్రెస్, జేడీఎస్ ల పొత్తు విషయంపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు గుప్పు మంటున్నాయి.

బీజేపీతో టచ్ లో……

బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాతనే పార్టీలోకి తీసుకునే విషయం ఆలోచించాలన్న ధోరణిలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకుని ప్రభుత్వాన్ని కూలిస్తే రానున్న లోక్ సభ ఎన్నికలపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని భావించడం వల్లే కమలనాధులు వెనకడుగు వేస్తున్నారు. కాని కాంగ్రెస్ లోని కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తమకు మంత్రి పదవి కావాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు.

రాజీనామాలు చేసైనా…?

ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని సంకటంలో పడేయాలని కూడా కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు హెచ్చరికలు కూడా అధిష్టానానికి పంపారు. కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా ఢిల్లీలో తిష్ట వేశారు. మొత్తం పది మంది సభ్యులున్న ఈ బృందం పార్టీ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేస్తుంది. ఈ బృందాన్ని మంత్రి రమేష్ జార్ఖి హోళి ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. వీరిలో కొందరికైనా వచ్చే మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరనుంది. కొందరు ఎంపీలు కూడా ఈ అసంతృప్త నేతలకు మద్దతిస్తున్నారు. ఎంబీ పాటిల్ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇలా అధిష్టానంపై వత్తిడి తెచ్చి వీలు కాకుంటే కమలం పార్టీలోకి అయినా దూకెయ్యాలని, దీర్ఘకాలం వేచి ఉండలేమని బహిరంగంగానే చెబుతుండటం విశేషం. మంత్రివర్గ విస్తరణ జరిగితే కేవలం ఆరుగురికి మాత్రమే కేబినెట్ లో చోటు దక్కుతుంది. కానీ పోటీ మాత్రం పదుల సంఖ్యలో ఉంది. మరి దీన్నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా బయటపడుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*