సంక్షోభం తప్పేట్లు లేదు…..!

జనతాదళ్ ఎస్ చేతిలో కాంగ్రెస్ ఇరుక్కుందా? కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ అనేక ప్రాంతాల్లో పట్టు కోల్పోనుందా? చేజేతులా హస్తం పార్టీ జేడీఎస్ కు జవసత్వాలు తెచ్చి పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు. కర్ణాటక రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కొద్దోగోప్పో స్థానాలు గెలుచుకున్నా కొన్ని పురపాలికల్లో అధికారంలోకి రావాలంటే జేడీఎస్ తో చేతులు కలపని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కూడా 927 వార్డులు గెలుచుకుంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సొంత ప్రాంతమైన శివమొగ్గలో మాత్రం కమలం పార్టీ అధికారం దక్కించుకుంది.

స్థానికంగా కూడా సంకీర్ణమే…..

మిగిలిన ప్రాంతాల్లో గణనీయమైన స్థానాలను సాధించినప్పటికీ కమలం పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక్కడ కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి పురపాలిక అధికారాలను చేపట్టాల్సి ఉంది. నిజానికి కాంగ్రెస్ కు మధ్య కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు విడివిడిగానే పోటీ చేశాయి. స్థానికంగా ఆ యా పార్టీల నేతలే అభ్యర్థులను ఖారారు చేసి ప్రచారం నిర్వహించుకున్నారు. కేవలం ప్రచార నిధులనే పార్టీలు సమకూర్చాయి. అంతే తప్పరాష్ట్ర స్థాయి నేతలెవ్వరూ ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదనే చెప్పాలి.

హెచ్చరిస్తూనే ఉన్నా…..

అయితే తొలినుంచి సిద్ధరామయ్య వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ పెద్దలను హెచ్చిరిస్తూనే ఉన్నారు. జేడీఎస్ తో కలసి వెళ్లడం ప్రమాదకరమని చెబుతున్నారు. జనతాదల్ ఎస్ నుంచి వచ్చిన సిద్ధరామయ్య తొలినుంచి సంకీర్ణ సర్కార్ ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. లోక్ సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని సిద్ధరామయ్య నుంచి ఎక్కువ మంది సీనియర్ నేతలు భావిస్తున్నారు. కర్ణాటక మంత్రివర్గంలో ఉన్న వారు తప్పించి అధికభాగం కాంగ్రెస్ నేతలు జేడీఎస్ తో పొత్తును సమర్థించడం లేదు. ఆ విషయాన్ని ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాల్ ఎదుట చెప్పారు. కాని అధిష్టానం నిర్ణయం మేరకే పొత్తులు ఉంటాయని, హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకున్నా సర్దుకుపోవాలని చెబుతూ వస్తున్నారు.

లోక్ సభ పొత్తులతో……

మరోవైపు కాంగ్రెస్ లో అసంతృప్తుల వేడి ఇంకా తగ్గలేదు. మంత్రి వర్గ విస్తరణకు ఇంకా ముహూర్తం ఖరారు కాకపోవడంతో ఆశావహులు ఏక్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు. ఇప్పటికే కొందరు అసమ్మతి వాదులు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. తాజాగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఆయన త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం లభిస్తుందన్న కారణంతోనే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయనున్నారు. అలాగే మరో సీనియర్ ఎమ్మెల్యే ఆనందసింగ్ కూడా తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ రాష్ట్ర నేతల్లో ఆందోళన ప్రారంభమైంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లడం చర్చనీయాంశమైంది. లోక్ సభ ఎన్నికల్లో పొత్తులతో మరెంత సంక్షోభం కాంగ్రెస్ లో తలెత్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*