త్యాగయ్యలూ…తయారుగా ఉండండి…!!

తెలంగాణలో ఎన్నికలకు జట్టు కడుతున్న మహాకూటమిలో ఇప్పుడు త్యాగయ్యల వేట మొదలైంది. ప్రధానపార్టీ అయిన కాంగ్రెసు సహా అందరూ త్యాగాలు చేయాల్సిందేనని నాయకులు తేల్చేస్తున్నారు. అనుబంధ పార్టీలుగా మారనున్న టీడీపీ, టీజేఎస్, సీపీఐ ల నూ ఈ త్యాగాల బెడద ఎక్కువగానే వెన్నాడనుంది. ‘ముందుగా మీరు మార్గం చూపండి. మిమ్మల్ని మేము అనుసరిస్తాం’ అంటున్నారు నియోజకవర్గ స్థాయి ఆశావహులు. పెద్దలెవరూ తమసీట్లు కోల్పోవడానికి సుముఖంగా లేరు. ద్వితీయశ్రేణి నాయకులను మాత్రం ఒప్పించే యత్నాల్లో తలమునకలవుతున్నారు. నాయకత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తే తిరుగుబాట్లు తప్పవని నియోజకవర్గ నాయకులు హెచ్చరిస్తున్నారు. త్యాగాలు ఏరకంగా ఉండాలి? ఎవరికోసం ఎవరి సీట్లను పణంగా పెట్టాలి? పార్టీలో అంతర్గతంగా చేయాల్సిన త్యాగాలు ఏమిటి? కూటమిలో మిత్రుల కోసం వదులకోవాల్సిన స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్న అంశాలపై ప్రస్తుతం భారీగానే చర్చసాగుతోంది. దీనికి అనుసరించాల్సిన ప్రమాణాలు, ప్రాతిపదిక విషయంలో కసరత్తు మొదలైంది.

వారసులుంటే ఒప్పుకోం….

కాంగ్రెసు పార్టీ టిక్కెట్ల కేటాయింపునకు సంబంధించి జాతీయ స్థాయిలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్టు కేటాయించాలి. 70 సంవత్సరాలు దాటిన వారిని సాధ్యమైనంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలి. పార్టీ పదవులు ఇవ్వాలి. అవసరమైతే నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ టిక్కెట్ల వంటివాటితో సంత్రుప్తి పరచాలి. ఇవన్నీ హస్తం జాబితాలోని పద్దులు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసు నాయకులు ఆయా నిబంధనలపై గుర్రుగా ఉన్నారు. ఏదో రకంగా తమ వారసులను ఈసారి బరిలోకి దింపాలనుకుంటున్న సీనియర్ నేతలకు అధిష్ఠానం నిబంధనలు గొంతులో పచ్చివెలగ్గాయ పడేలా చేస్తున్నాయి. ఎటూపాలుపోని స్థితి. పార్టీలో సీనియర్లు కచ్చితంగా ఏఐసీసీ పెట్టిన నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు డిమాండు చేస్తున్నారు. మహాకూటమి కారణంగా సీట్ల సంఖ్య కుదించుకుపోతోంది. అందువల్ల యువనాయకత్వానికి, కొత్తగా రంగంలోకి వస్తున్నవారికి టిక్కెట్లు దక్కాలంటే వారసులను పక్కనపెట్టాలనే డిమాండు ఊపందుకుంటోంది. అదే సమయంలో ఏడుపదుల వయసు దాటినవారికీ స్వస్తి పలకాలంటున్నారు.

చిత్తశుద్ధి ప్రశ్నార్థకం….

పార్టీ చేస్తున్న సూచనలపై సీనియర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. తరతరాలుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమకు నిబంధనలు పెట్టడం సరికాదని అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నారు. అందులోనూ ఈసారి ఎన్నికలు కాంగ్రెసు పార్టీకి జీవన్మరణ సమస్య . అందువల్ల గెలుపే ప్రాతిపదికగా సీట్లు కేటాయించాలని సీనియర్లు కోరుతున్నారు. తమ వయసును పరిగణనలోకి తీసుకోకూడదని పార్టీకి నచ్చ చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీని ఈసారి అధికారంలోకి తెచ్చిన తర్వాత తాము బరిలోంచి తప్పుకుంటామంటున్నారు. ముందుగానే నియోజకవర్గాల్లో తమ వారసులకు అవకాశమివ్వాలని డిమాండు చేస్తున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు కావాలనుకుంటున్నారు. రెండు సీట్లూ గెలిపిస్తామని అధిష్టానానికి హామీ ఇస్తున్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే గెలుపు గుర్రాలు కావాలి. తాము ప్రజలకు చేసిన సర్వీసు, తమకు జిల్లాలో ఉన్న పలుకుబడి కారణంగా తమతోపాటు వారసులూ సులభంగా నెగ్గుతారని పార్టీకి భరోసా నిస్తున్నారు. ఒక రకంగా చూస్తే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి రావాలంటే మాకు టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని తేల్చేస్తున్నారు. ఇక్కడే పార్టీ పట్ల నేతల చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవుతోంది.

మిత్రులకు మహదవకాశం…

కాంగ్రెసు పార్టీలో పన్నెండుమంది వరకూ సీనియర్ నేతలు తమకు, వారసులకు టిక్కెట్లు కోరుకుంటున్నారు. జానా,ఉత్తమ్,కోమటిరెడ్డి,డీకేఅరుణ, దామోదర రాజనర్సింహ వంటి వారంతా ఈ వరసలో ఉన్నారు. తాము 95 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెసు ఇప్పటికే ప్రకటించింది. తెలుగుదేశం, టీజేఎస్, సీపీలకు మొత్తంగా 24 స్థానాలకు మించి పోటీ చేయడానికి అవకాశం లేదు. సీట్ల సర్దుబాటు అంత సులభంగా తెమిలే పంచాయతీ కాదు. టీడీపీ,టీజేఎస్,సీపీఐ లు పెద్దన్న పాత్రలో కాంగ్రెసు అన్యాయం చేస్తోందని గుర్రుగా ఉన్నాయి. తాము కోరిన సీట్లను దాదాపు సగానికి కుదించివేస్తున్నారనే భావన ఆయా పార్టీల్లో నెలకొంది. మిత్రులకు కోత విధించి కాంగ్రెసులోనే కుటుంబాల వారీగా టిక్కెట్లు పంచుకుంటే చెడు సంకేతాలు పంపినట్లవుతుంది. దీనిని సాకుగా చేసుకుంటూ అసమ్మతి వాదులు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగే ప్రమాదమూ తొంగి చూస్తోంది. ఒకవేళ కాంగ్రెసు పార్టీ తన నిబంధనలు తానే తుంగలో తొక్కితే మిత్రపక్షాలకు చెందిన వారికి పంట పండినట్లే. ఒకవైపు ఒప్పందమూ ఉంటుంది. మరోవైపు తమకు బలముందని భావించిన చోట్ల పోటీకి దిగే చాన్సులూ పెరుగుతాయి. ఈరకమైన వాతావరణం తలెత్తకుండా బ్యాలెన్సు చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెసు పైనే ఉంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*