సిద్ధూ తిప్పేశాడే….!

నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ. నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి. అయితే మరోసారి ఆయన పాక్ ఆర్మీచీఫ్ ను ఆలింగనం చేసుకున్న విషయం వివాదాస్పదమయింది. వారం రోజుల క్రితం పాక్ ప్రధానిగా మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అధ్కక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాణస్వీకారానికి సిద్ధూకు ఇమ్రాన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. క్రికెట్ లో తనకు స్నేహితుడు కావడంతో సిద్ధూ కూడా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఆ సమయంలో సిద్దూకు ఇమ్రాన్ తగిన గౌరవమే ఇచ్చారు. ముందు వరుసలోసీటు కేటాయించి సిద్ధూపై తనకు ఎంత ప్రేమ ఉందో ఇమ్రాన్ చెప్పకనే చెప్పారు.

హగ్ ఎంతపని చేసిందీ…..

అయితే ఇదే సందర్భంలో పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వాకు హగ్ ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్ పక్కనే కూర్చోవడాన్ని కూడా కొందరు తప్పుపట్టారు. ముఖ్యంగా బీజేపీ, శివసేన పార్టీలు సిద్ధూ వ్యవహరించిన తీరును ఎండగడుతూ ప్రకటనలు గుప్పించాయి. సొంత పార్టీ నేతలే సిద్ధూకు అండగా నిలవలేదు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సయితం సిద్ధూ చేసిన పని సరికాదని స్టేట్ మెంట్ ఇచ్చే శారు. కాని సిద్ధూ ఏ మాత్రం జంకడం లేదు. తాను తప్పుడు పని ఏమీ చేయలేదని, దేశద్రోహానికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు.

సమర్థించుకున్న సిద్ధూ….

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ తనతో మాట్లాడరని, తనతో శాంతి కోరుకుంటున్నట్లు ఆయన అన్నారని, అంతేకాకుండా కర్తారాపూర్ సాహిబ్ కారిడార్ తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తనతో చెప్పారన్నారు. దీనివల్ల సిక్కులు పర్యటన సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భావోద్వేగాన్నితట్టుకోలేకనే తాను ఆలింగనం చేసుకున్నానని చెప్పారు. మాజీ ప్రధాని వాజ్ పేయి లాహోర్ పర్యటన చేసినప్పుడు, ప్రధాని మోదీ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు హగ్ ఇచ్చినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ఆయనప్రశ్నించారు. తాను ఎటువంటి తప్పుచేయలేదని ఆయన ప్రకటించుకున్నారు.

కాంగ్రెస్ సతమతం…..

సిద్ధూ చేసిన పనిని సొంత పార్టీ నేతలే విమర్శిస్తుంటే బీజేపీకి చెందిన ఎంపీ శత్రుఘ్న సిన్హా మాత్రం సిద్ధూను సమర్థించడం విశేషం. పాక్ లో పర్యటించినప్పుడు గతంలో ప్రధానులు పాక్ ప్రధానులను ఆలింగనం చేసుకోలేదా? అని శత్రుఘ్న సిన్హా ప్రశ్నించారు. సిద్ధూ చేసిన పనిలో ఎలాంటి వివాదం తనకు కన్పించడం లేదని శత్రుఘ్నసిన్హా అన్నారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం సిద్ధూ పర్యటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సిద్ధూ నిర్వాకం కారణంగా హిందూ ఓటు బ్యాంకుకు గండిపడే ప్రమాదముందన్న ఆందోళన హస్తం పార్టీలో వ్యక్తమవుతోంది. మొత్తం మీద సిద్ధూ తాను చేసిన పనిని సమర్థించుకున్నా….భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలలో దీని ప్రభావం ఎలా ఉంటుందోనని హస్తం పార్టీ సతమతమవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*