కింగ్ కాదట…మేకర్ అవుదామని…?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యుద్ధం చేయకుండానే తెల్ల జండా ఊపేస్తున్నారా..? ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని అలాగే మిస్ ఫైర్ అవుతున్నాయి. తాను రాబోయే ఎన్నికల్లో ప్రధాని అవుతానో లేదో అన్నది ముఖ్యం కాదని మోడీని గద్దె దింపడమే లక్ష్యమని తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుత సంకీర్ణ యుగంలో కాంగ్రెస్ బలహీనంగా వున్న దశలో ప్రధాని పదవి ఆశించడం అత్యాశే అవుతుందని రాహుల్ ఈ కామెంట్స్ చేసి ఉంటారని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పుకొస్తున్నారు. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తాను కింగ్ కావడం కన్నా కింగ్ మేకర్ రోల్ చేపట్టాలన్న అభిలాష ఆయన నుంచి వ్యక్తం కావడం విశేషం.

సోనియా బాటలోనే…

గత యుపిఎ హయాంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కనుసన్నలలో మాజీ ప్రధాని మన్మోహన్ 10 ఏళ్ళు నెట్టుకొచ్చారు. ప్రధాని పదవిలో లేకపోయినా యుపిఎ ఛైర్ పర్సన్ గా సోనియా మాటను వేదవాక్కుగా 2004 నుంచి 2014 వరకు సర్కార్ నడుచుకునేది. అదే తరహాలో ఎవరో ఒకర్ని ప్రధాని పదవిలో కుర్చోపెట్టాలని రాహుల్ వ్యూహంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజారిటీ తో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఇప్పటివరకు వస్తున్న సర్వేలు తేటతెల్లం చేస్తుండటంతో మోడీ తో ముఖా ముఖీ ఫైట్ కి రాహుల్ సిద్ధంగా లేరంటున్నారు.

ఎందుకొచ్చిన తంటా…..

కలగూరగంప పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్నది రాహుల్ లెక్క గా విశ్లేషకుల అంచనా. దేశంలోని 12 రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో దాదాపు ప్రాంతీయ పార్టీలతోనే కమలం పార్టీ కుస్తీకి దిగుతుంది. దీంతో ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్లాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ది. ప్రస్తుతానికి ప్రధాని పదవిలో తాను రేసులో లేనని ప్రకటించి మోడీకి వ్యతిరేక మహాకూటమి ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధినేత అడుగులు స్పష్టంగా పడుతున్నాయి మరి ఆ వ్యూహాలు ఈమేరకు విజయవంతం అవుతాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*