రాహుల్ సమక్షంలోనే తాడో పేడో…!

తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలతోనూ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావును ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ తో నేతల మధ్య విభేదాలను తొలగించుకుని ఐక్యంగా ముందుకు వెళ్లాలని, అప్పుడే గెలుపు సాధ్యమవుతుందని రాహుల్ కాంగ్రెస్ నేతలకు క్లాస్ పీకనున్నారు.

ఎవరికి ఎన్ని సీట్లు?

అలాగే మహాకూటమి ఏర్పడుతున్నందున మిత్రపక్షాలకు ఎన్ని స్థానాలు? ఎక్కడెక్కడ కేటాయించాలన్న దానిపై కూడా ఈ రోజు అగ్రనేతలతో చర్చల సందర్భంగా ఒక స్పష్టత వచ్చే అవకాశముందంటున్నారు. దీంతో పాటు 40 అభ్యర్థుల తొలి జాబితాను కూడా ఈరోజు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. రాహుల్ తోనూ, కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీకి తెలంగాణ నుంచి దాదాపు యాభై మంది నేతలు హస్తినకు వెళ్లారు.

టీడీపీతో పొత్తు……

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి సోదరులు, డీకే అరుణతో పాటు మరికొందరు ముఖ్యనేతలు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కొందరు పొత్తులతో కొందరు నేతలకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పార్టీలో సమన్వయం లేదని, దీనికారణంగా పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు కూడా నేతలు హాజరు కావడం లేదని రాహుల్ కు చెప్పనున్నారు.

కొందరు కాంగ్రెస్ లో చేరిక……

ఇక ఈరోజు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు చేరనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఈరోజు పార్టీలో చేరే అవకాశముంది. భూపతి రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ, ఆయన వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ను ఓడించే లక్ష్యంతోనే పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ చర్చల్లో టీడీపీతో పొత్తు పై కొందరు వ్యతిరేకించే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*