సిగపట్లు ఇంకా తేలడం లేదు …!!

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అదిగో ఇదిగో అంటూ కాలం నెట్టుకొస్తున్నారు. మహాకూటమి గా అన్ని పక్షాలను కూడగట్టి పోటీ చేయడం ఒక ఎత్తయితే వారికి సీట్లు కేటాయించడం అంతకు మించిన తలపోటు అని కాంగ్రెస్ భావిస్తూ ఎడతెగని కసరత్తు సాగిస్తూ వస్తుంది. కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలు  తెలుగుదేశం సీపీఐ, తెలంగాణ జన సమితులు తమ డిమాండ్లను ఇప్పటికే ఆ పార్టీ ముందు ఉంచాయి. వారు ఆశిస్తున్న సీట్లు లెక్కల చిట్టా విప్పేశాయి.

ఫుల్లుగా సందడి……

అయినప్పటికీ కమిటీ భేటీలు వార్ రూమ్ లో పలు సమావేశాలను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్వహించినా వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆశావహులు ఢిల్లీలోనే మకాం వేశారు. ముఖ్యనేతలకు వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కిక్కిరిసి పోయి ఉంది. నేతలు బయటకు వస్తే చాలు తమ నేతకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ తో పాటు కూటమి లిస్ట్ కోసం అన్ని పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

11 న బిఫారాలు …

ఒక పక్క మహాకూటమి అభ్యర్థుల ప్రకటన వాయిదా పడుతూ వస్తుంది. ఇంకో పక్క టిఆర్ఎస్ మాత్రం ఈనెల 11 న ఒకేసారి అభ్యర్థులందరికీ బి ఫారాలు ఇచ్చే కార్యక్రమానికి ముహర్తం పెట్టేసింది. ఆ లోపు కూటమి అభ్యర్థులు ఫైనల్ లిస్ట్ రాకతప్పని నేపథ్యంలో ప్రత్యర్థుల బలం బలహీనతలను అభ్యర్థుల వారీగా లెక్కేసి ఇంకా టిఆర్ఎస్ ప్రకటించాలిసిన 12 స్థానాలను వెల్లడించాలని గులాబీ దళపతి వ్యూహంగా కనిపిస్తుంది. బిఫారాలు ఒకేసారి ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు స్క్రూటినీ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా న్యాయవాదులను సైతం ఏర్పాటు చేసింది టిఆర్ఎస్. అభ్యర్థుల ప్రకటనే కాకుండా అన్నింటా తామే ముందు ఉండాలనే ఆలోచనతో మిగిలిన అంశాల్లో స్పీడ్ పెంచింది గులాబీ దళం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*