వ్యూహాత్మక ఆలస్యమా ..? తేల్చలేని తనమా …?

తెలంగాణ తెచ్చింది ఇచ్చింది తామే అని రొమ్ము విరుచుకుని ప్రకటించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో వాయిదాలపై వాయిదాలు వేయడం చర్చనీయాంశం గా మారింది. టి ఎన్నికల్లో 119 స్థానాలు ఉంటే అభ్యర్థిత్వం ఆశించినవారు 5 వేలమంది పైనే. దీనికి తోడు మహాకూటమి పొత్తులు సర్దుబాట్లు ఇవన్నీ టికెట్ల ప్రకటనకు అవాంతరాలు సృష్టిస్తున్నాయి అనడానికి లేదు. ఎందుకంటే శతాబ్దానికి పైగా భారత రాజకీయాలను శాసిస్తూ వచ్చిన పార్టీకి ఒక రాష్ట్ర ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు పెద్ద విషయమే కాదు. కానీ అనివార్య ఆలస్యాన్ని వ్యూహాత్మకంగా నడిపిస్తూ వస్తుంది కాంగ్రెస్ హై కమాండ్.

కాంగ్రెస్ అంచనా ఇదే ….

పార్టీ టికెట్లు ప్రకటిస్తే ఒక్కసారిగా ఆశావహుల్లో టికెట్ దక్కనివారు తమ అసంతృప్తి రోడ్డెక్కిస్తారు. నానా అల్లరి కార్యక్రమాలు మొదలైపోతాయి. పేరున్న నేతలు పార్టీకి గుడ్ బై కొట్టడం షరా మాములుగా జరుగుతుంది. వీరంతా ప్రత్యర్థి పార్టీల్లో చేరడం లేదా రెబల్స్ గా బరిలోకి దిగి ఎకులు మేకుగా మారతారు. అలా కాకుండా నామినేషన్ ప్రక్రియ మొదలు అయ్యాకా ప్రకటిస్తే చాలా వరకు వత్తిడి నుంచి బయట పడొచ్చు. ప్రచారానికి నెలరోజుల సమయం చాలా ఎక్కువ. అధికార పార్టీ ప్రచార ఖర్చును ఎదుర్కోవడం కష్టంతో కూడుకున్న పని రోజులు తగ్గే కొద్ది ఎన్నికల వ్యయం ఎంతోకొంత తగ్గించుకోవొచ్చు. రెబెల్స్ గా బరిలోకి దిగే సమయం కూడా సొంత పార్టీ వారికి లేకుండా చేయొచ్చు. ఇవన్నీ వ్యూహంలో భాగంగానే అమలు చేయాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఆలస్యం అమృతం విషం …

అధిష్టానం ఆలోచన చాలామంది సీనియర్లకు సైతం నచ్చడం లేదు. ఒక పక్క ప్రత్యర్థి గులాబీ పార్టీ నెలముందే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులతో తలపడేందుకు తొడ కొడితే వారికి సమాధానం చెప్పేందుకు కనీసం నవంబర్ తొలి వారంలో అయినా అభ్యర్థులను ప్రకటించి ఉంటే బావుండేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల ప్రక్రియ దగ్గర చేసి హడావిడి గా బరిలోకి అభ్యర్థులను దింపితే నష్టాలు కూడా ఎక్కువని వారు లెక్కేస్తున్నారు. దసరా పండగ పోయే, దీపావళీ అయిపొయింది కానీ తమ టికెట్ల వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని వాపోతున్నారు. దీనివల్ల టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను దూకుడుగా తిప్పికొట్టలేకపోతున్నామన్న ఆందోళన కాంగీయుల బాధ. అయితే వీరి వేదన మాత్రం అధిష్టానం చెవినపడినా వారికి వినపడనట్లే తాము అనుకున్నదే చేస్తూ సాగడం అసలు విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*