క‌ల‌క‌లం.. అధిష్టానానికి సీనియ‌ర్లు షాకిస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. ఈసారి తెలంగాణ‌లో గెలుపు త‌మ‌ను వ‌రిస్తుంద‌నే ఎంతో ఆశ‌తో ఉన్న అధిష్టానానికి.. ఈసారి ఇబ్బందులు, తిప్ప‌లు తప్పేలా క‌నిపించడం లేదు. ఒక‌ప‌క్క టీఆర్ఎస్‌పై ఎలా పైచేయి సాధించాలో, ఆ పార్టీ వైఫ‌ల్యాల‌ను ఎలా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే అంశంపై సీనియ‌ర్ల‌తో అధిష్టాన పెద్ద‌లు క‌స‌ర‌త్తులు చేస్తుంటే.. నేత‌ల ఆలోచ‌న‌లు మాత్రం వేరేలా ఉన్నాయి. అంద‌రూ ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసేందుకే మొగ్గు చూప‌డంతో.. ఎంపీగా ఎవ‌రూ బ‌రిలోకి దిగేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం పెద్ద‌ల‌ను దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డేస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురి నుంచి నలుగురు పోటీకీ సిద్ధమవుతుండడంతో పార్లమెంట్‌కు పోటీ చేసే వారెవరో నేటికీ స్పష్టత రావడం లేదు. ఈ అంశంలో పార్టీ కార్యకర్తల్లోనూ అయోమయం నెలకొంది.

పోటీకి దిగేది వీరేనా?

నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతల చూపంతా అసెంబ్లీ పైనే ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో నిజామాబాద్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి ప్రస్తుతం ఎంపీలుగా టీఆర్‌ఎస్‌కు చెందిన కల్వకుంట్ల కవిత, బీబీపాటిల్ ఉన్నారు. వీరే మళ్లీ పోటీచేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక బీజేపీలోనూ నిజామాబాద్‌ పార్లమెంట్‌ పై స్పష్టత వచ్చింది. డీఎస్‌ తనయుడు ధర్మపురి అరవింద్‌ కార్యక్రమాలు చేస్తున్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఇప్పటివరకు బాణాల లక్ష్మారెడ్డి పోటీచేసే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చర్చిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ హయాంలో రెండు పర్యాయాలు నిజామాబాద్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నుంచి మధుయాష్కీగౌడ్‌, సురేష్‌ షెట్కార్‌లు ఎంపీలుగా పనిచేశారు. ప్రస్తుతం వారిద్దరే అభ్యర్థులుగా ఉండే అవకాశం ఉంది.

యాష్కీ ఒప్పుకోకుంటే…..

ఈ పార్లమెంట్‌ పరిధిలో పార్టీకి సీనియర్‌ నేతలు సురేష్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి ఉన్నా ఎమ్మెల్సీ ఆకుల లలిత, అసెంబ్లీ డిప్యూటి లీడర్‌ జీవన్‌రెడ్డి ఉన్నవారు తమ నియోజకవర్గాలపైనే కేంద్రీకరించి పనిచేస్తున్నారు. మ‌ధుయాష్కీ పోటీ చేయకుంటే బలమైన బీసీ వర్గానికి చెందిన నేతనే బరిలోకి దించితే ఉపయోగం ఉంటుందని నేతలు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు సంగారెడ్డి జిల్లాలో, నాలుగు నియోజకవర్గాలు కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. గతంలో సురేష్‌షెట్కార్‌ రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఈ దఫా నారాయణఖేడ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా అవకాశం ఉన్నా ఎమ్మెల్యేగా పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంటుకు అయితే…..

ఆయనతో పాటు ఈ మధ్యనే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో చేరిన మద‌న్‌మోహన్‌రావ్‌ కూడా ఈ దఫా పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి శాసనసభ నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లా పరిధిలో ముగ్గురు, నలుగురు పోటీపడుతుండగా పార్లమెంట్‌కు మాత్రం ఆసక్తి చూపడంలేదు. అసెంబ్లీ నియోజకవర్గం అయితే ఖర్చు తక్కువగా ఉండడం క్యాడర్‌ కూడా అందుబాటులో ఉంటారని పార్టీకి చెందిన ఒకనేత తెలిపారు. పార్లమెంట్‌ అయితే ఖర్చు తడిసిమోపెడవుతుందని ఆ పార్టీకి చెందిన మరొక నేత తెలిపారు. ఈ రెండు పార్లమెంట్‌ స్థానాలకు ఎవరు పోటీచేస్తారో మరికొన్ని రోజుల్లో తేలనుందని ఆ పార్టీకి చెందిన నేతలు తెలిపారు. ప్రస్తుతం మాత్రం అసెంబ్లీ నియోజకవర్గాలపైనే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారని వారు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*