కాంగ్రెస్ గీత మారేనా…?

గత రెండు పర్యాయాలుగా జహిరాబాద్ లో డా.గీతారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన ఇక్కడ ఆమె రెండు ఎన్నికల్లోనూ స్వల్ప మెజారిటీతో గట్టెకారు. అయితే, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా, గీతారెడ్డి మాత్రం నియోజకవర్గంలో తన పట్టును క్రమంగా కోల్పోతున్నారని తెలుస్తోంది. దీనికి తోడు ఆమెను ఈసారి కచ్చితంగా ఓడించాలని టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో గీతారెడ్డిపై టీఆర్ఎస్ నుంచి మాణిక్యరావు పోటీచేసి కేవలం 842 ఓట్ల స్వల్ప తేడా ఓటమి పాలయ్యారు. అయితే, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండటం, అభివృద్ధి జరగకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే అంశాలు గీతారెడ్డికి మైనస్ గా మారాయి. కానీ, వ్యక్తిగతంగా మంచి పేరు ఉండటం, పార్టీ బలం ఆమెకు కలిసి రానున్నాయి.

సంగారెడ్డిలో జగ్గారెడ్డి …?

సంగారెడ్డి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ సుమారు 30 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే, జగ్గారెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. చురుగ్గా దూసుకుపోయే స్వాభావం ఆయనది. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారన్న పేరు ఉంది. అయితే, సమైక్యవాదిగా ముద్రపడటం, టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకోవడంతో జగ్గారెడ్డి ఓటమి చవిచూశారు. తర్వాత జరిగిన మెదక్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరిపోయారు. అంగ, అర్థ బలంతో పాటు నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బలమైన పోటీ ఇవ్వనున్నారు. ఇప్పటి నుంచే ఆయన ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ కు అభివృద్ధి విషయంలో మంచి మార్కులే పడుతున్నా, వ్యక్తిగతంగా బలమైన ముద్ర వేసుకోలేకపోయారు. పార్టీ బలమే, ఆయన బలంగా కనపడుతోంది.

పటాన్ చెరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ?

గత ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గం నుంచి బరిలో దిగిన గూడెం మహిపాల్ రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి నిమిషంలో టీఆర్ఎస్ లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నందీశ్వర్ గౌడ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. అనంతరం ఆయన బీజేపీలో చేరిపోయారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లో ఒకస్థానం పటాన్ చెరు పరిధిలోనే ఉంది. అయితే, ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుపున ఎవరు బరిలో ఉంటారో స్పష్టత లేదు. మాజీ ఎమ్మల్యే నందీశ్వర్ గౌడ్ తిరిగి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతుండగా, మరో అరడజను మంది సైతం కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొననుంది.

దుబ్బాకలో ఈసారీ ఆయననేనా…

దుబ్బాక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై 37,925 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో రామలింగారెడ్డి మంచి పట్టు సంపాదించుకున్నారు. అయితే, ఇక్కడ కాంగ్రెస్ తరుపున సీనియర్ నేత, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి మరోసారి బరిలో ఉండనున్నారు. ఆయనకు కూడా నియోజకవర్గంలో సొంత ఇమేజ్ ఉంది. దీంతో వీరిద్దరి మధ్య రానున్న ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ నడుస్తుందనే అంచనాలు ఉన్నాయి. టీఆర్ఎస్ హయాంలో దుబ్బాక అభివృద్ధి విషయంలో ప్రజల వద్ద మంచి మార్కులే పడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*