కాపీ పేస్ట్ చేస్తే పోలా …..?

తెలంగాణ లో కారు ఎవరికి అందనంత వేగంగా ముందస్తు ఎన్నికల వైపు దూసుకు వెళ్ళిపోతుంది. ఆ స్పీడ్ కి తగ్గట్టుగా ఇప్పుడు ఏ పార్టీ సిద్ధంగా లేవు. దాంతో షార్ట్ కట్ మెథడ్ అనుసరిస్తుంది హస్తం పార్టీ. శతాబ్దానికి పైగా చరిత్ర వున్న కాంగ్రెస్ కి ఎన్నికల్లో ఎలా సాగాలో చెప్పక్కర్లేదు. అందులో రాజకీయాల్లో ఎవరు బెస్ట్ సిస్టం లో వెళుతున్నారో చూసుకుని ఆ వెనుకే వెళ్ళడం ఇటీవల కాలంలో అన్ని పార్టీలు చేస్తున్న పనే. ఇప్పుడు ముందస్తు వస్తే సమయం తక్కువ వుంది. గ్రూప్ లు గా వున్న పార్టీని ఒకతాటిపైకి తెచ్చి బలమైన శత్రువు పై యుద్ధం చేయాలి. దాంతో కాంగ్రెస్ సూక్ష్మంలో మోక్షం లభించే మార్గం అనుసరించాలని డిసైడ్ అయిపొయింది.

సెప్టెంబర్ లోనే కాంగ్రెస్ అభ్యర్థులు …

ప్రజా ఉద్యమాలు, ఇంటిటింకి తిరగడం, బస్సు యాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి ముందు అత్యవసరంగా చేయాలిసిన పనిపై టి కాంగ్రెస్ దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్లిష్టమైన యవ్వారం అభ్యర్థుల ఎంపిక. ఇప్పుడు దానిపైనే ఫోకస్ పెట్టింది ప్రధాన ప్రతిపక్షం. సెప్టెంబర్ చివరి వారానికి అభ్యర్థులను ప్రకటించేందుకు లిస్ట్ సిద్ధం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టేస్తోంది. టిఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ సైతం తన అభ్యర్థులను వెల్లడించాలని భావిస్తుంది. దాంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు చురుగ్గా ప్రజల్లోకి వెళతారని కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. చేసిన పనులతో టీఆర్ఎస్ జనంలోకి వెళ్లడానికి రెడీ అయితే, కాంగ్రెస్ ప్రభుత్వ అవకతవకలు తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను ఫ్లెక్సీల రూపంలో గ్రామాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తుంది. గులాబీ పార్టీ ప్రగతి నివేదన సభకు ధీటుగా సోనియా, రాహుల్ లలో ఎవరో ఒకరితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ సత్తా చాటాలని వ్యూహం రెడీ చేస్తుంది. ఇలా టిఆర్ఎస్ వేసే ప్రతి స్టెప్ కి కౌంటర్ స్టెప్ తో సమాధానం చెప్పేందుకు సన్నాహాలు చేస్తుంది.

జిల్లాల వారి కమిటీలు …

కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున ఇంచార్జ్ లను నియమించడానికి టి కాంగ్రెస్ నిర్ణయించింది. వీరిపై పర్యవేక్షణ ను టి పిసిసి చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి, టి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక లో సామాజిక వర్గాల సమీకరణ తో బాటు అంగ, అర్ధ బలాలు పరిశీలన చేయనున్నారు. అదేవిధంగా పార్టీలో బిసిలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ ను పరిగణలోనికి అధిష్టానం తీసుకోనుంది. ఏది ఏమైనప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల ప్రకటన వెల్లడయ్యేటప్పటికి లిస్ట్ ఫైనల్ చేసి సై అంటే సై అని సైరన్ మోగిస్తామంటుంది కాంగ్రెస్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*