కాంగ్రెస్ కంచుకోట బద్దలవుతుందా..?

ఎన్నికల ఏడాది ప్రారంభమైంది. దీంతో తెలంగాణలోనూ కొంత తక్కువే అయినా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సై అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ కూడా సవాల్ ను స్వీకరించింది. ఈ పాటికి పలు విడతల బస్సుయాత్రను పూర్తి చేసింది. ఇలా అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుచుకున్న రెండు ఎంపీ స్థానాల్లో నల్గొండ ఒకటి. దీని పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. మొత్తం 7 స్థానాల్లో సూర్యాపేట మినహా 6 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ విజయం సాధించాయి. మరి ఈ ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

కోమటిరెడ్డిని ఈసారి దెబ్బకొడతారా..?

నల్గొండ నియోజకవర్గం గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 10,547 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ మూడో స్థానంలో నిలిచారు. అయితే, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్థుతం టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. స్వతంత్ర అభ్యర్థిగానే కోమటిరెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన కంచర్లను టీఆర్ఎస్ లోకి చేర్చుకుని నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. రానున్న ఎన్నికల్లో ఆయనే కోమటిరెడ్డికి ప్రత్యర్థిగా నిలబడనున్నారు. మాస్ లీడర్ గా ఫాలోయింగ్ ఉండటం, అంగ, అర్థ బలాలు ఉండటం, గ్రామాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉండటం కోమటిరెడ్డికి ప్లస్ పాయింట్లుగా కనపడుతున్నాయి. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డిపై సహజంగా ఏర్పడే వ్యతిరేకత, గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరు కంచర్లకు బలాలుగా మారుతున్నాయి.

మంత్రి గారికి ముళ్ల బాటేనా..?

గత ఎన్నికల్లో సూర్యపేట నియోజకవర్గంలో విచిత్ర ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థి, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు మద్య ఓట్ల తేడా స్వల్పంగా ఉంది. ఇందులో టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత మంత్రి జగదీశ్ రెడ్డి 2219 స్వల్ప ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ సారి టీఆర్ఎస్ నుంచి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దామోదర్ రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వర్ రావు పోటీలో ఉండటం ఖాయంగా కనపడుతోంది. సూర్యాపేట జిల్లాగా ఏర్పడటం, మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ పథకాలు జగదీశ్ రెడ్డికి ప్లస్ కానుండగా, ఇటీవల కలెక్టరేట్ విషయంలో వచ్చిన అవినీతి ఆరోపణలు, ప్రత్యర్థులు బలంగా ఉండటం మైనస్ గా మారనున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి గ్రామాల్లో మంచి పట్టు ఉండటం కలిసి వస్తుంది. బీజేపీ తరుపున పోటీ చేయనున్న సంకినేని వెంకటేశ్వర్ రావుకు సౌమ్యుడిగా మంచి పేరు ఉంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే రెండో స్థానంలో నిలవగా ఇప్పుడు పార్టీ ఓట్లు కూడా కలిసివచ్చే అవకాశం ఉంది.

మిర్యాలగూడలో ఎవరి మంత్రం ?

మిర్యాలగూడ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున జానారెడ్డి కుడిభుజం లాంటి భాస్కర్ రావు విజయం సాధించారు. అయితే, ఆయన కాంగ్రెస్ ను వీడి గులాబీ గూటికి చేరారు. దీంతో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ తరుపున అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత లేదు. అయితే, జానారెడ్డికి బలం ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించాలని బావిస్తున్నారు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు, తండ్రి పేరు, యువ నాయకుడిగా ఇమేజ్ ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కర్ రావు పోటీలో ఉంటారా? ఉండరా అనేది డైలమాగా మారింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన అమరేందర్ రెడ్డితో పాటు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిపదవి చేపట్టాలనే భావిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఈ స్థానంపై కన్నేశారని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా టిక్కెట్టు దక్కని ఆశావహులు పార్టీకి సహకరిస్తారని నమ్మకం లేదు. సీపీఎంకి కూడా ఈ నియోజకవర్గంలో కొంత ఓటు బ్యాంకు ఉన్నా, ద్విముఖ పోటీనే ఉండనున్నట్లు కనపడుతోంది.

పెద్దాయనను ఓడించడం సాధ్యమేనా..?

2009లో ఏర్పడిన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రెండుసార్లూ కాంగ్రెస్ తరుపున ప్రస్థుత ప్రతిపక్ష నేత జానారెడ్డి విజయం సాధించారు. ఆయనకు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక జానారెడ్డికి చెక్ పెట్టేందుకు గత ఎన్నికల్లో కమ్యూనిస్టు నేత నోముల నర్సింహయ్యను టీఆర్ఎస్ లో చేర్చుకుని నిలబెట్టారు.ఈ ఎన్నికల్లోనూ ఆయన టిక్కెట్ ఆశిస్తున్నా, టీఆర్ఎస్ లోని ఇతర నేతలు కూడా టిక్కెట్ అడుగుతున్నారు. జానారెడ్డి వ్యక్తిగత ఇమేజ్, పార్టీ ఇమేజ్ కాంగ్రెస్ కి బలంగా ఉండగా, టీఆర్ఎస్ కి కూడా పార్టీ ఇమేజ్ మాత్రమే ఎక్కువగా పనిచేయనుంది. ప్రస్తుతానికైతే ఇక్కడా ద్విముఖ పోటీనే కనపడుతోంది.

హుజూర్ నగర్ టీఆర్ఎస్ లో ….

కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన నియోజకవర్గం హుజూర్ నగర్. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఆయనే బరిలో ఉండనున్నారు. నియోజకవర్గంలో బలమైన పట్టు ఆయన సొంతం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారనే పేరూ ఉంది. గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మపై ఉత్తమ్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ టిక్కెట్ ఆమె ఆశిస్తుండగా, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం ఓ ఎన్ఆర్ఐని రంగంలోకి దింపారనే ప్రచారం జరుగుతోంది. సదరు ఎన్ఆర్ఐ స్వచ్చంద సేవా కార్యక్రమాల ద్వారా చురుగ్గా ప్రజల్లోకి వెళుతున్నారు. దీంతో శంకరమ్మ సదరు ఎన్ఆర్ఐపై, మంత్రిపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో నియోజకవర్గ టీఆర్ఎస్ లో వర్గపోరు తీవ్రస్థాయిలోకి చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఉత్తమ్ కు మళ్లీ కలిసివచ్చే అవకాశం కనపడుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*