సెటిల‌ర్స్ కోట‌లో జెండా పాతేదెవరు?

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కూక‌ట్‌ప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ముఖ్యంగా ఆంధ్రా సెటిల‌ర్స్‌కు అడ్డాగా మారిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కారు పార్టీలో కుమ్ములాట‌లు మొద‌ల‌య్యాయి. కాంగ్రెస్ పార్టీ చురుగ్గా పావులు క‌దుపుతోంది. టీడీపీ ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కోస్తాంధ్రులు ఎక్కువ‌గా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అన్ని పార్టీల‌కు ప్ర‌త్యేక దృష్టి ఉంటోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ పార్టీల‌న్నీ బ‌ల‌మైన అభ్య‌ర్థుల కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న ప‌రిస్థితుల‌కు పూర్తి భిన్నంగా రాజ‌కీయ వాతావ‌ర‌ణం నెల‌కొంది. 2014ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున గెలిచిన‌ మాధ‌వ‌రం కృష్ణారావు అనంత‌రం అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ కావ‌డంతో రాజ‌కీయంగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీలు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

ఇద్దరూ ఒకే పార్టీలో…..

గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గొట్టిముక్క‌ల ప‌ద్మారావు కృష్ణారావు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు వీరిద్ద‌రూ ఒకే పార్టీలో ఉండ‌డంతో టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న‌ది ఉత్కంఠ రేపుతోంది. నిజానికి కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌. కానీ, అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యే కృష్ణారావు గులాబీ గూటికి చేర‌డంతో టీడీపీ శ్రేణులు కూడా కొంత గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్య‌మ గాలిలో టీఆర్ఎస్ విజ‌యం సాధించినా.. కూక‌ట్‌ప‌ల్లిలో మాత్రం టీడీపీనే నిలిచింది. దీంతో అర్థమ‌వుతోంది ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీకి ఉన్న ప‌ట్టు ఏమిటో. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున పార్టీ సీనియ‌ర్ నేత మాజీ మంత్రి అయిన ఇనుగాల పెద్ది రెడ్డిని రంగంలోకి దించే ఆలోచ‌న‌లో పార్టీ అధిష్టానం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కూక‌ట్‌ప‌ల్లి స్థానాన్ని ఎలాగైనా ద‌క్కించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు స‌మాచారం.

సర్వేల మీద సర్వేలు……

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ముందు పాత ఖైర‌తాబాద్‌లో అంత‌ర్భాగంగా ఉన్న కూక‌ట్‌ప‌ల్లి త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంగా మారింది. ఆ త‌ర్వాత 2009లో ఇక్క‌డ టీడీపీ పొత్తులో పోటీ చేయ‌కుండా టీఆర్ఎస్‌కు సీటు ఇచ్చింది. ఆ ఎన్నిక‌ల్లో లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్‌నారాయ‌ణ విజ‌యం సాధించారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన మాధ‌వ‌రం కృష్ణారావు ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఇక నిత్యం ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వేల‌మీద స‌ర్వేలు చేయించిన సీఎం కేసీఆర్ ఎవ‌రి పక్షాన నిలుస్తార‌న్న దానిపై పార్టీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీలో తీర్మానం చేసింది.

కాంగ్రెస్ ఎత్తుగడ…..

మ‌రోవైపు హైద‌రాబాద్‌లో ఉంటున్న ఆంధ్రుల‌కు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు కేటాయిస్తామ‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప్ర‌క‌టించారు. అంతేగాకుండా.. ఏపీకి ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్పిన కేసీఆర్ ఇటీవ‌ల యూట‌ర్న్ తీసుకున్నారు. అంతేగాకుండా.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండ‌డం.. టికెట్ కోసం కుమ్మ‌లాట‌లు మొద‌లు కావ‌డం ఆ పార్టీకి న‌ష్టం చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కూక‌ట్‌ప‌ల్లి ఓట‌ర్లు కాంగ్రెస్ పార్టీ వైపు నిలుస్తార‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక త‌మ‌కు కంచుకోటలో తిరిగి త‌మ పార్టీ జెండాయే ఎగురుతుంద‌న్న ధీమాతో టీడీపీ ఉంది. మ‌రి ఈ సెటిల‌ర్స్ అడ్డాలో ఎవ‌రి జెండా ఎగురుతుందో ? ఇప్ప‌ట‌కీ అయితే స్ప‌ష్టం కావ‌డం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*