టీడీపీ – కాంగ్రెస్ ఎఫెక్ట్..సిట్టింగ్ లకు ఫియర్….!!

ఏపీలో మ‌రో ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో సిట్టింగులు అంద‌రూ కూడా త‌మ త‌మ స్థానాల్లో అలెర్టుగా ఉన్నారు. త‌మ‌కే సీటు క‌న్ఫర్మ్ అని న‌మ్ముతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలిచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే, రాజ‌కీయాల్లో క్షణ క్షణ‌ముల్ నాయ‌కుల చిత్తముల్ అన్నట్టుగా వ్యవ‌హారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-టీడీపీ పొత్తుతో ముందుకు వెళ్లాల‌ని నిర్ణయించుకున్నాయి. వాస్తవానికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండ‌వల్లి అన్నట్టుగా ఈ రెండు పార్టీలు పాము-ముంగీస టైపు..! అయినాకూడా రాజ‌కీయాల్లో అద్భుతం జ‌రిగిన‌ట్టుగా చంద్రబాబు వెళ్లి నేరుగా ఆ పార్టీతో జ‌ట్టుక‌ట్టారు. ఇప్పుడు ఈ ప‌రిణామ‌మే.. రాష్ట్రంలో సిట్టింగుల‌కు ముఖ్యంగా వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలోకి చేరిన నాయ‌కుల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.

టిక్కెట్లు వస్తాయా..?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్లు ల‌భిస్తాయా? లేదా? అనే విష‌యంపై త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖ జిల్లా అధ్యక్షుడు – మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు – పీసీసీ కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాస్ లు గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ -టీడీపీ పోటీలో బాలరాజు పాడేరు – శ్రీనివాస్ విశాఖ దక్షిణం పై కన్నేశారు. కానీ ఇప్పటికే విశాఖ దక్షిణంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ పొత్తుల్లో తన సీటుకు ఎసరు వస్తుందని కంగారుగా ఉన్నారట.. ఈ స్థానంలో శ్రీనివాస్ 2014 కు ముందు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు భయం పట్టుకుంది.

కాంగ్రెస్ నేతలు….

కాంగ్రెస్ తో పొత్తుతో ఎమ్మెల్యే వాసుపల్లి పోస్టుకు ఎసరు వచ్చేలానే కనిపిస్తోంది. ఇక పాడేరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరిన గిడ్డీ ఈశ్వరి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ మారితే పదవులు ఇస్తానన్న బాబు హామీ నెరవేరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు వల్ల పాడేరులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి మణికుమారి బలంగా ఉన్నారు. ఆమెను కాదని గిడ్డికి టికెట్ ఇస్తారా లేదా అన్న టెన్షన్ ఆమెలో మొదలైంది. బాబు రాజకీయాల కోసం త్యాగం చేయాలన్న మాటను విని గిడ్డి ఈశ్వరీ ఆందోళనగా ఉన్నారట.. మాజీ మంత్రి బాలరాజు కూడా పాడేరుపై కన్నేయడంతో ఈ సీటు కాంగ్రెస్ కు వదిలేయాలని దాదాపు టీడీపీ డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి.

రాజకీయ భవిష్యత్తు…..

అదే జరిగితే ఎన్నో ఆశలతో పార్టీ మారిన గిడ్డి ఈశ్వరీ రాజకీయ భవిష్యత్ కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన రాజ్యసభ ఎంపీలు టి. సుబ్బిరామిరెడ్డి – కిశోర్ చంద్రదేవ్ లు ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. వారు గెలిచిన విశాఖ – అరకు ఎంపీ సీట్లను ఈసారి కాంగ్రెస్ కు వదిలేస్తే అక్కడ ఆశావహుల ఆశలు గల్లంతైనట్టే.. అయితే అరకు లో టీడీపీకి బలమైన నేత లేకపోవడంతో ఆ సీటు ఇచ్చి విశాఖ సీటును ఇచ్చే అవకాశాలు లేవని.. ఒకే జిల్లాలో రెండు సీట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా. తాజా ప‌రిణామాలు మాత్రం సిట్టింగుల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. మ‌రి బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*