రాహుల్…హు..హు..కాదు…ఉ..ఊ…నే…!

akhilesh yadav,mayavathi rahulgandhi

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీలోని అతి పెద్ద రాష్ట్రంలో పాగా వేయాల్సిందే. ఏ పార్టీకి అయినా ఉత్తరప్రదేశ్ కీలకం. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హవా మామూలుగా లేదు. 85 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 71 స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్ వాదీ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలకు కలసికట్టుగా పోటీ చేసి బీజేపీని కట్టడి చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కన్పిస్తోంది. అందుకోసం కూటమిని ఏర్పాటు చేసేందుకు చర్చలు ప్రారంభించింది. కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు కూటమిగా ఏర్పడనున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూటమి ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

సీట్ల పంపకం విషయంలో…..

అయితే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న క్లారిటీ మాత్రం ఇంకా రాలేదని తెలుస్తోంది. ఇందుకోసం అన్ని పార్టీలు కలసి ఉమ్మడి ఫార్ములాను రూపొందించుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పాటు ఓడిపోయిన నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచిన పార్టీకి ఆ సీటును కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ నేతలు కలసి చర్చించినట్లు చెబుతున్నారు. ఈ ఫార్ములా ప్రకారం సమాజ్ వాదీ పార్టీకి అత్యధిక సీట్లు, తర్వాత బీఎస్పీకి ఎక్కువ సీట్లు దక్కే అవకాశముంది.

బీజేపీకి ఎక్కువ సీట్లు రాకూడదనే…

ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కూడా కీలకం. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలను ఖచ్చితంగాచేస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు ఇప్పటికే యూపీలో పర్యటనలు ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్ అప్రమత్తమయింది. విపక్షాల మధ్య చీలిక రాకుండా చూడాలన్నది కాంగ్రెస్ తాపత్రయంగా కన్పిస్తుంది. తాజాగా రూపొందించుకున్న ఫార్ములా ప్రకారం కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు దక్కే అవకాశఆలు లేవు. అయినా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి, మోదీని దెబ్బతీయడానికి రాజీ పడాలని నిర్ణయించుకుంది.

రాజీ పడైనా…..

గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ యూపీలో క్షీణించిపోతుంది. అమేధీ, రాయబరేలీ నియోజకవర్గాల్లో పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ పోటీ చేస్తున్నా…. వారి ప్రభావం ఆ నియోజకవర్గాలకే పరిమితమయిందని చెప్పకతప్పదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అప్పట్లో అధికారంలో ఉన్న ఎస్పీతో పొత్తుపెట్టుకున్నా కాంగ్రెస్ సాధించింది శూన్యమేనని చెప్పకతప్పదు. అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విపక్షాల వరుస విజయాలు కాంగ్రెస్ పార్టీని ఊరిస్తున్నాయి. యూపీలో రాజీ పడితే ఢిల్లీలో పవర్ దక్కుతుందన్న ఆశతో టెన్ జన్ పథ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీట్ల పంపకంలో బీఎస్పీ కీలకం కానుంది. మాయావతి తమకు ఎక్కువ స్థానాలను కేటాయించకపోతే విడిగా పోటీ చేసే అవకాశముంది. అలాగే ఆర్ఎల్డీ కూడా తనకు తగినన్ని సీట్లు కేటాయించకుంటే బీజేపీతో కూడా వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. మొత్తం మీద యూపీలో విపక్షాల ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*