మంత్రి అల్లోల ఈసారి గ‌ల్లంతేనా…?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నూత‌నంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. ముఖ్యంగా నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డికి వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఈసారి గ‌ట్టి పోటీ త‌ప్పద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వర్‌రెడ్డి నుంచి తీవ్రమైన పోటీ నెల‌కొనే అవ‌కాశం ఉంద‌ని నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అదేవిధంగా మాజీ స్పీక‌ర్ కూతురైన ప్రముఖ వైద్యురాలు స్వర్ణారెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు స‌మాచారం. ప‌లు సేవా కార్యక్రమాల‌తో ప్రజ‌ల‌కు ద‌గ్గర‌య్యేందుకు ప్రయ‌త్నం చేస్తున్నారు.

మంత్రికి సవాళ్లు విసురుతూ…..

ఏ చిన్న అవ‌కాశం దొరికినా ఏలేటి మ‌హేశ్వర్‌రెడ్డి మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డిపై విమ‌ర్శలు, ఆరోప‌ణ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా, పార్టీ బ‌హిరంగ స‌భ‌ల్లో మంత్రిపై బ‌హిరంగంగానే ఆయ‌న స‌వాల్ విసురుతున్నారు. 2009 ఎన్నిక‌ల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన మ‌హేశ్వర్‌రెడ్డి అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీల‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న హోరాహోరీ పోరులో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో చురుగ్గా ప‌ర్యటిస్తున్నారు. ప్రభుత్వ విధానాల‌ను ఎండ‌గ‌డుతూ ముందుకు వెళ్తున్నారు.

మంచి పట్టున్న లీడర్….

ఇక్కడ మ‌హేశ్వర్‌రెడ్డికి మంచి ప‌ట్టుంది. ఆయ‌న 2009లో ప్రజారాజ్యం నుంచి తెలంగాణ‌లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక‌రు. ఆయ‌న సేవా కార్యక్రమాలు, వ్యక్తిగ‌త ఇమేజ్‌తోనే ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఇంద్రక‌రణ్‌కు గ‌ట్టి ఫైటే ఇచ్చారు. 2004లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి 2008లో ఆదిలాబాద్ నుంచి ఉప ఎన్నిక‌ల్లో ఎంపీగా కూడా గెలిచారు. 2009లో ఆయ‌న నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణాంత‌రం వైసీపీలో చేరారు.

బీఎస్పీ నుంచి గెలిచి…..

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌డం, తెలంగాణ‌లో వైసీపీకి సీన్ లేక‌పోవ‌డంతో ఆయ‌న తిరిగి కాంగ్రెస్‌లో చేరినా సీటు వ‌చ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో బీఫాం కోసం బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ త‌రుపున పోటీ చేసి గెలిచి వెంట‌నే టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో పాల‌క‌, ప్రతిప‌క్షాల నుంచి బ‌ల‌మైన అభ్యర్థులు ఉండ‌డంతో హోరాహోరీ పోరు త‌ప్పద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

కబ్జా ఆరోపణలతో……

ఇదిలా ఉండ‌గా… స్థానికంగా ఉన్న చెరువు భూములు క‌బ్జా అయ్యాయ‌ని, వాటికి మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి కుమారుడికి సంబంధం ఉంద‌నీ కాంగ్రెస్ నేత మ‌హేశ్వర్‌రెడ్డి మొద‌టి నుంచీ ఆరోపిస్తున్నారు. అయితే ఈ విష‌యంలో మంత్రి అల్లోల ఒక‌టిరెండు సార్లు విలేక‌రుల స‌మావేశంలో ఖండించి, సైలెంట్ అయ్యారు. మ‌రోవైపు స్వర్ణారెడ్డి మాత్రం ఇప్పటికైతే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తార‌న్న విష‌యంలో స్పష్టత లేదు. అయితే బీజేపీ లేదా, తెలంగాణ జ‌న స‌మితి నుంచి పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అల్లోల గెలుపు అంత ఈజీ కాద‌ని అక్కడ వాతావ‌ర‌ణం చెపుతోంది.