ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం జరుగుతోంది……?

internal war in andhrapradesh assembly

ఏపీ అసెంబ్లీలో పాలన గాడి తప్పింది….. ఉద్యోగుల మధ్య సిగపట్లతో శాసన సభ పరువు పోతోంది. శాసనసభకు శాశ్వత కార్యదర్శి లేకపోవడంతో ఉద్యోగులు వర్గాలుగా చీలిపోయారు. దీనికి మితిమీరిన రాజకీయ జోక్యంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాని పరిస్థితి…..రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వేర్వేరు శాసన సభలు ఏర్పడ్డాయి. ఉమ్మడి అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేసిన రాజా సదారామ్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిపోయారు.

వివాదాలు తలెత్తడంతో…..

విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎవరి కార్యదర్శి అనే విషయంలో స్పష్టత కొరవడింది. విభజనకు ముందు నుంచి అసెంబ్లీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించకుండా ప్రమోషన్ల ఫైల్ తొక్కి పెట్టడంతో డిప్యూటీ సెక్రటరీ స్థాయిలోనే సీనియర్లు నిలిచిపోయారు. ఎవరు పోటీకి రాకుండా ఉండేందుకు అప్పటి పాలక పెద్దల సాయంతో ఈ తంతు నడిచింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇదే ఏపీ అసెంబ్లీలో ఇదే తంతు నడుస్తోంది.కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇన్ ఛార్జి కార్యదర్శిగా సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ కార్యదర్శి పదవికి డిగ్రీతో పాటు న్యాయశాస్త్రంలో పట్టా ఉండాలి. సత్యనారాయణ నియామకంపై వివాదాలు తలెత్తడంతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆయన విద్యార్హతలపై ప్రశ్న లేవనెత్తారు. చాలా కాలం తర్వాత కోర్టు అక్షింతలతో ఆర్కే కోరిన సమాచారం విడుదల చేశారు. సత్యనారాయణ డిగ్రీ., న్యాయ పట్టాలు ఒకే సంవత్సరంలో పొందినట్లు నమోదవడంతో నిబంధనల ప్రకారం ఆయన అర్హత కోల్పోయారు. ఆయన తర్వాత సీనియారిటీలో ఉన్న విజయరాజుకు తాత్కలిక కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.

ఎవరు అసలైన కార్యదర్శి…..

శాసనసభ కార్యదర్శి పదవిపై వివాదం రేగడంతో విధిలేని పరిస్థితుల్లో పదవి నుంచి సత్యనారాయణ తప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ శాసన సభకు వచ్చిన ముగ్గురు డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారుల్లో తొలుత సత్యనారాయణకు అసెంబ్లీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఆయన నియామకంపై వివాదం తలెత్తడంతో విజయరాజుకు బాధ్యతలు అప్పగించారు. అయితే విజయరాజు నియామకం ఫైలు గవర్నర్ వరకు వెళ్లకపోవడం., అంతకు ముందు ఇన్ ఛార్జి సత్యనారాయణ నియామకానికి గవర్నర్ అమోద ముద్ర వేయడంతో ఎవరు అసలైన కార్యదర్శి అనే ప్రశ్న తలెత్తింది. అదే సమయంలో సత్యనారాయణకు అప్పటి మండలి ఛైర్మన్., ఇతర సీనియర్ నాయకుల మద్దతు లభించడంతో మండలిలో జరిగే సభా కార్యకలాపాలన్నీ ఆయన పేరు మీదే జరగడం మొదలైంది. శాసనసభ కార్యదర్శి హోదాలో విజయరాజు బాధ్యతలు నిర్వహిస్తుంటే మండలి కార్యకలాపాలు మాత్రం సత్యనారాయణ పేరు మీదే ఇప్పటికీ సాగుతున్నాయి. గవర్నర్ తన పేరు మీద ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించారు కాబట్టి తానే కార్యదర్శి అని ఒకరు., నిబంధనల ప్రకారం తనకు బాధ్యతలు వచ్చాయని మరొకరు విధులు నిర్వహిస్తున్నారు. చివరకు శాసనసభకు ఒకరు., మండలిని మరొకరు పంచుకున్నారు.

సరిదిద్దే ప్రయత్నాలేవి….

ఏపీ పాలనా వ్యవస్థల్లో కులాల కుమ్ములాట చివరకు అసెంబ్లీకి సైతం పాకింది. సత్యనారాయణకు పాలక పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో ఆయన ఆడింది ఆటగా మారింది. దాదాపు ఎనిమిదేళ్లుగా శాసనసభ సిబ్బంది పదోన్నతులు కూడా జరగడం లేదంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం శాసనసభ కార్యదర్శి పదవికి జాయింట్ సెక్రటరీ స్థాయి వ్యక్తికి పదోన్నతి కల్పించడం ద్వారా ఆ స్థానంలోకి వస్తారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పదోన్నతులు వస్తే., తమ స్థానానికి ముప్పు వస్తుందని ఎవరికి ప్రమోషన్లు ఇవ్వకుండా తొక్కిపెట్టారు. దీంతో డిప్యూటీ సెక్రటరీ స్థాయిలోనే ప్రమోషన్లు ఆగిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారినే కార్యదర్శిగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో అలా…..?

ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న రాజాసదారామ్ తెలంగాణ శాసన సభా కార్యదర్శిగా మరికొంత కాలం ఉండేందుకు ప్రయత్నించడంతో అక్కడి ఉద్యోగులు తిరుగుబాటు చేశారు. చివరకు పంచాయితీ కేసీఆర్ వరకు చేరడంతో సదారామ్ కు ఆర్టీఐ పదవి కట్టబెట్టి ఆ స్థానంలో నరసింహాచారికి బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో సీనియారిటీ ప్రకారం అందరికి పదోన్నతులు ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తెలంగాణ అసెంబ్లీ వ్యవస్థను గాడిలో పెట్టారు. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. ఇప్పటికీ తమకు పదోన్నతులు రాకపోవడానికి రాజకీయ నాయకుల తొత్తులుగా మారిన సీనియర్లే కారణమని కింది స్థాయి అధికారులు అక్రోశం వ్యక్తం చేస్తున్నారు. 58 నుంచి 60ఏళ్లకు పదవీ కాలం పెంచి., ఆ తర్వాత ఓఎస్డీల పేరుతో మరో రెండేళ్లు కొనసాగడం వల్ల జూనియర్లు నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.

ఎవరి దారి వారిదే…….

అసెంబ్లీ కార్యదర్శి హోదాలో ఇద్దరు డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులు కొనసాగుతున్నారు. వీరితో పాటు మరో డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి బాలకృష్ణాచారి కూడా నిబంధనల ప్రకారం ఈ రేసులో ఉన్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంచడంతో సీనియర్ గా ఉన్న సత్యనారాయణ పదవీ కాలం వచ్చే ఏడాది అక్టోబర్ వరకు పెరిగింది. సీనియార్టీలో తానే ముందున్నందున కార్యదర్శి తానే అవుతానని సహోద్యోగులతో ఆయన వాదిస్తున్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి వ్యవహారం రాజ్ భవన్ చేరిన సమయంలో సీనియార్టీ విషయంలో గవర్నర్ సైతం తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వంట వచ్చిన ప్రతి వారు కుక్ అవ్వలేరని., అర్హతలను చదువే నిర్ణయిస్తుందనే ఘాటైన వ్యాఖ్యలు రావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందంటారు. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ వ్యవహారాలు గవర్నర్ దృష్టికి పోకుండా జాగ్రత్తపడ్డారు. గవర్నర్ నేరుగా రంగ ప్రవేశం చేస్తే తప్ప ఏపీ అసెంబ్లీ గాడిన పడదనే భావన ఉద్యోగుల్లో ఉంది.

ఉద్యోగులు ఉన్నా పని లేదే…..

రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షల ద్వారా శాసనసభకు 26మంది ఏఎస్ఓ స్థాయి అధికారులు నియమితులయ్యారు. ఏడాదిన్నరగా వారికి ఎలాంటి విధులు కేటాయించకుండా పనిచేయిస్తున్నారు. వారికి విధులు కేటాయిస్తే ఎక్కడ తమకు ఇబ్బంది కలుగుతుందోననే ఉద్దేశంతో 26మందిని ఖాళీగా కూర్చోబెట్టి జీతాలిస్తున్నారు.

అమ్మో ఏపీ అసెంబ్లీనా….?

ఏపీ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ అనివార్యంగా తప్పించాల్సి రావడంతో ఆ స్థానంలో మరో సమర్ధుడైన అధికారిని నియమించే ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. అసెంబ్లీలో పాతుకుపోయిన ముదురు కేసులు వచ్చిన వారిని బెదరగొట్టి పారిపోయేలా చేశారు. అమరావతికి అసెంబ్లీని తరలించిన వెంటనే రాజ్యసభ స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన రామాచారిని అసెంబ్లీ ఇన్ ఛార్జి కార్యదర్శిగా నియమించారు. నర్సాపురానికి చెందిన రామాచారి నెలరోజుల్లోనే ఏపీ అసెంబ్లీ వదిలి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న జుగుప్సాకరమైన వాతావరణం నచ్చక వెళ్లిపోయినట్లు సన్నిహితులతో చెప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత మాతృసంస్థలో కీలక పదోన్నతి లభించినట్లు సమాచారం….

తలలు పట్టుకుంటోన్న ప్రభుత్వ పెద్దలు…..?

రామాచారి తర్వాత ఢిల్లీ అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేసిన తెలుగు వ్యక్తిని ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా తీసుకువచ్చేందుకు ప్రయత్నం జరిగింది. గతంలో రాజ్యసభ స్పీకర్ కార్యదర్శిగా పనిచేసిన ప్రసారభారతి అధికారి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఢిల్లీ అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేశారు. కేంద్రానికి., ఢిల్లీ ప్రభుత్వానికి పొసగకపోవడంతో అకారణంగా ఆయన్ని మాతృసంస్థ వెనక్కి పిలిపించింది. ఆయన్ని ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలను ఇక్కడి లాబీ అడ్డుపడుతూ వచ్చింది. చివరకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర శాసనసభ వ్యవహారాలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఎవరికి తెలీదు.

తలోదారి….. పాలన గాలికి….

అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి తలోదారిలో వ్యవహరిస్తుండటంతో సిబ్బంది కూడా నిరాసక్తంగా తయారయ్యారు. అడపాదడపా ఎవరో కార్యదర్శి వచ్చేస్తున్నారనే ప్రచారం వాళ్లలో ఉత్సాహాన్ని నింపినా మళ్లీ అవి సద్దుమణిగితే గొణుక్కుంటూ కూర్చోవడం మామూలైంది. కీలకమైన ఫైళ్లు., ఆర్టీఐ ఫైళ్ల విషయంలో తమకు ఇబ్బంది కలిగే సమాచారం బయటకు పొక్కకుండా సీనియర్ అధికారులు తొక్కి పెడుతున్నారు. నిబంధనల మేరకు వ్యవహరించాలని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నా తాము చెప్పిందే నోట్ ఫైళ్లుగా రాయాలని బెదిరించి నోరు మూయిస్తున్నారు. సభా కార్య కలాపాల నిర్వహణ., ఖర్చులు., సిబ్బంది నియమకాలు., జీత భత్యాల చెల్లింపు అంతా నలుగురైదుగురి కనుసన్నల్లో జరుగుతోంది.

ఎవరి లెక్కలు వారివే……

నిబంధనల ప్రకారం అసెంబ్లీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు సభాపతితో పాటు అధికారిక పర్యటనలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే దళితుడైన విజయరాజుని పక్కనపెట్టి సత్యనారాయణ డిప్యూటీ సెక్రటరీ స్థాయిలో సభాపతితో పాటు విదేశీ పర్యటనకు వెళ్లారు. దీనిపై ఆ వర్గం ఉద్యోగులు రగిలిపోతున్నారు. త్వరలో ముఖ్యమంత్రి వద్ద తేల్చుకోవాలని పోరాటానికి సిద్ధమవుతున్నారు.

అన్నీ వారి నియంత్రణలోనే…..

శాసన సభ వ్యవహారాలు తాత్కలిక సిబ్బంది నియమకాల మీద కూడా బోలెడు ఆరోపణలు…. గతంలో ఉద్యోగుల పాలనా వ్యవహారాల్లో కార్యదర్శులు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవని సిబ్బంది గుర్తు చేస్తున్నారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి., నాదెండ్ల మనోహర్., సురేష్ రెడ్డి ఉన్న రోజులు చాలా మెరుగ్గా ఉండేవని., సభాపతి స్థానంలో హుందాగా వ్యవహరించే వారని చెబుతున్నారు. సభాపతి వ్యక్తిగత కార్యదర్శి నేరుగా సిబ్బంది వ్యవహారాల ఫైళ్లను పరిశీలించడంపై కూడా విమర్శలున్నాయి. ఇక తాత్కలిక సిబ్బంది మొత్తాన్ని ఒకే ప్రాంతం వారిని నియమిస్తున్నారని., ఇదో పునరావాస కేంద్రంగా తయారైందని ఆరోపిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 15976 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*