జేసీ బ్రదర్స్ పై తాడోపేడో తేల్చుకునేందుకు…?

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలపై సొంత పార్టీ నేతలు కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నారు. జేసీ బ్రదర్స్ ను కట్టడి చేయకుంటే జిల్లాలో తాము పనిచేసుకోలేమని, పార్టీకూడా నవ్వుల పాలవుతుందని చంద్రబాబుకు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొన్న, నిన్న గుంటూరు జిల్లా సమీక్షను చంద్రబాబు నిర్వహించారు. ఒక్కొక్క నియోజకవర్గం పరిస్థితి, నేతల మధ్య విభేదాలుంటే వాటిని పరిష్కరించే దిశగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

ఐదుగురు ఎమ్మెల్యేలు……

అనంతపురం జిల్లాకు వచ్చే సరికి దాదాపు ఐదుగురు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జేసీ బ్రదర్స్ పై విరుచుకుపడుతున్నారు. జేసీ బ్రదర్స్ వల్ల నియోజకవర్గాల్లో తాము అప్రతిష్ట పాలవుతున్నామని, పార్టీ పరువు కూడా బజారున పడుతుందని వారు బహిరంగంగానే శాసనసభ లాబీల్లో చెబుతుండటం విశేషం. జేసీ బ్రదర్స్ ను ఇలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోయే ప్రమాదముందని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

ప్రత్యేక సమావేశాలతో…..

అనంతపురం జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై జేసీ బ్రదర్స్ వ్యవహారాలపై చర్చించినట్లు తెలిసింది. జేసీ బ్రదర్స్ ఏ నియోజకవర్గాల్లో ఎప్పుడు? ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? వారు ఉపయోగించిన భాష, టీడీపీ ఎమ్మెల్యేల పైన చేసిన ఆరోపణలను పత్రికా క్లిప్పింగ్ లతో పాటు వీడియోలను కూడా వీరు సిద్ధం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ రాకమునుపు కూడా పార్టీ పరిస్థితి స్ట్రాంగ్ గానే ఉండేదన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. జేసీ బ్రదర్స్ ను ఇలా ఉపేక్షిస్తూ వెళితే ఇక లాభం లేదని భావించిన టీడీపీ నేతలు చంద్రబాబు వద్దే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

బాబు మౌనం వీడాలంటున్న…..

జేసీ బ్రదర్స్ వైఖరిపై ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, పల్లె రఘునాధరెడ్డి, యామిని బాల, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత వంటి వారు ఆగ్రహంతో ఉన్నారు. వీరు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి జేసీ బ్రదర్స్ వ్యవహారాన్నితేల్చాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై జేసీ దివాకర్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మంత్రికాల్వ శ్రీనివాసులు నియోజకవర్గమైన రాయదుర్గంలో జేసీ అల్లుడు దీపక్ రెడ్డి విడిగా పార్టీ సమావేశాలు పెడుతున్నారు. ఈ చికాకులన్నింటినీ వదిలించుకోవడానికి అనంత టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. జేసి విషయంలో చంద్రబాబు ఇప్పటికైనా మౌనం వీడాలని వారు కోరుతున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.