జేసీ….మరో వైపు చూడరా….?

అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జె.సి. దివాకర్ రెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రభోదానందస్వామి వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. జేసీ వ్యవహారంతో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందన్న వ్యాఖ్యలు ఆపార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం. జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరతీస్తూనే ఉంటారు. అందుకే ఆయనకు ఎప్పుడూ సొంత పార్టీలోనే ప్రత్యర్థులుంటారన్నది వాస్తవం. కాంగ్రెస్ లో ఉన్నప్పుడూ అంతే. ఇప్పుడూ ఆయన తీరు మారలేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు చెప్పినా జేసీ తన వైఖరి మార్చుకోకపోవడంతో ఆయన కూడా విసిగిపోయినట్లు తెలుస్తోంది.

సమస్యను ఇలా పరిష్కరించుకోవాలా?

జేసీని కదిలిస్తే తేనెతుట్టెను కదిలించినట్లే. ప్రభోదానంద స్వామికి చెందిన ఆశ్రమం వ్యవహారం తీసుకుంటేనే అర్థమవుతోంది. ఒక ఆశ్రమంలోని భక్తులు గ్రామస్థులపై దాడి చేశారన్నది జేసీ ఆరోపణ. నిజంగా ఆశ్రమంలోని భక్తులే దాడికి పాల్పడి ఉంటే అధికారంలో ఉన్న జేసీ పోలీసులతో మాట్లాడి వారిపై కేసులు నమోదు చేయించవచ్చు. శాంతియుతంగానే సమస్యను పరిష్కరించుకోవచ్చు. స్వాములు, బాబాలకు వత్తాసు పలకమని ఎవరూ అనరు. గ్రామస్థుల వెంటనే ప్రజాప్రతినిధులు ఉంటారు. అంతవరకూ జేసీ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. కాని ఆశ్రమాన్ని ఖాళీ చేయాలంటూ అతి పెద్ద డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచి దాదాపు రెండు రోజుల పాటు ధర్నాకు దిగడం జేసీ చేసిన తప్పంటున్నారు. ఎందుకంటే ఆశ్రమాన్ని ఖాళీ చేయించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఆచి తూచి అడుగులు వేస్తుంది.

బాబుతో సమావేశమైన తర్వాత…..

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశమై ఈ సమస్యపై చర్చించిన తర్వాతనైనా జేసీ తన దూకుడును తగ్గించుకుంటే బాగుండేది. చంద్రబాబును కలసి వచ్చిన వెంటనే జేసీ ప్రభోదానంద స్వామితో పాటు పోలీసులపైనా విరుచుకుపడ్డారు. అనరాని మాటల అనేశారు. దీంతో పోలీస్ అధికారుల సంఘం రంగంలోకి దిగాల్సి వచ్చింది. పోలీసు అధికారుల సంఘం నేత మాధవ్ కూడా కొంత తొందరపడినట్లే కన్పిస్తోంది. పోలీసు దుస్తులు వేసుకుని మీసం మెలేస్తూ నాలుక కోసేస్తాం అనడం ఆ వృత్తికే అవమానం అని చెప్పక తప్పదు. దీనిపై జేసీ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఊరుకుని ఉంటే బాగుండేది. కానీ జేసీ కదా…అలా ఎందుకు చేస్తారు.

పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులే……

మరోసారి మీడియా ముందుకు వచ్చి పోలీసులపై మరోసారి విరుచుకుపడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులకు జేసీ సవాల్ విసరడం కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది. అధికారంలో ఉన్న తాము పోలీసులను అలా ఎలా అంటామని తెలుగుదేశం నేతలే పెదవి విరుస్తున్నారు. ప్రభోదానందస్వామి తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నారన్న విషయం ఆ ప్రాంత ప్రజలకు తప్ప రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ జేసీ పుణ్యమా అని ఇప్పుడు ఆ స్వామి పాపులర్ అయి కూర్చున్నారు. ఇలా జేసీ ప్రభుత్వాన్ని,పార్టీని తరచూ ఇరకాటంలో పెడుతుండటంతో చంద్రబాబు సయితం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జేసీ ఇప్పటికైనా దూకుడు తగ్గించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*