మంత్రి గెలుపు అంత ఈజీ కాదట….!

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి నల్గొండ జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కి సమానంగా అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నా ఆధిక్యం మాత్రం చూపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనేతలుగా ఉన్నవారిలో ఎక్కువ మంది నల్గొండ జిల్లా నుంచి ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా కనిపిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ముఖ్యనేతలను ఓడించడంతో పాటు నల్గొండ జిల్లాలో పూర్తి ఆధిక్యం ప్రదర్శించాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్న గుంటకండ్ల జగదీశ్ రెడ్డిపైనే ప్రధానంగా ఈ బాధ్యతలు పెట్టారు. జిల్లా పార్టీ మొత్తం జగదీశ్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తోంది. ఇటువంటి సమయంలో జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ గెలుపుతో పాటు ముఖ్యంగా మంత్రి స్వంత నియోజకవర్గం సూర్యాపేటలో తిరుగులేని విజయాన్ని సాధించాల్సిన అవసరం ఉంది.

గత ఎన్నికల్లో బహుముఖ పోరు…

ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న జగదీశ్ రెడ్డి 2009లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై సుమారు 2 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విజయం నాలుగు స్తంభాలాట ఆడింది. కాంగ్రెస్ తరుపున అప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టీడీపీ తరుపున పటేల్ రమేశ్ రెడ్డితో పాటు టీడీపీలో పనిచేసిన సంకినేని వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే, విజయం నలుగురి మధ్య దోబూచులాడింది. నలుగురు అభ్యర్థులకు మధ్య ఓట్ల తేడా కేవలం 2-3 వేలు మాత్రమే. సంకినేని రెండు స్థానంలో, దామోదర్ రెడ్డి మూడో స్థానంలో, రమేశ్ రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు.

త్రిముఖ పోటీ ఖాయం..!

ఇక ఈ ఎన్నికల్లోనూ బహుముఖ పోటీనే ఉండనున్నట్లు కనపడుతోంది. జగదీశ్ రెడ్డికి మళ్లీ పాత ప్రత్యర్థులే పోటీ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున దామోదర్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి చేరిన పటేల్ రమేశ్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇద్దరూ స్థానికంగా బలమైన నాయకులే. ఇక గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ తరుపున బరిలో దిగనున్నారు. అయితే, కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు కూడా సహకరిస్తేనే ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా అయితే త్రిముఖ పోటీ ఉండనుంది.

గట్టి పోటీ తప్పదా..?

టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా జగదీశ్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో విజయం ఎంతో కీలకం. మంత్రిగా అభివృద్ధి చేయడం, సూర్యాపేట ప్రత్యేక జిల్లాగా ఏర్పడటం వంటి అంశాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీతో పాటు ఆయన వ్యక్తిగతంగా కూడా గతంలో కంటే బాగా బలం పెంచుకున్నారు. అయితే, ఆయనపై ఆరోపణలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ప్రజల్లోనూ కలిసిపోరనే పేరుంది. బీజేపీ నుంచి పోటీపడనున్న సంకినేని వెంకటేశ్వరరావుకు సౌమ్యుడిగా నియోజకవర్గంలో మంచి పేరుంది. అన్ని గ్రామాల్లో క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. నియోజకవర్గంలో చురుగ్గా ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన సానుభూతి వర్కవుట్ అయితే గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రతీ గ్రామంలోనూ ఓటు బ్యాంకు బాగానే ఉంది. టిక్కెట్ ఆశిస్తున్న ఇద్దరూ బలమైన నాయకులుగానే ఉన్నారు. కుమ్ములాటలు లేకుండా చూసుకుంటే మాత్రం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీ సమానంగా చీల్చుకునే అవకాశం ఉంది. ఇది జగదీశ్ రెడ్డికి మేలు చేస్తుంది. మొత్తానికి జగదీశ్ రెడ్డి గత ఎన్నికల కంటే మెరుగైనా గట్టి పోటీ మాత్రం ఎదుర్కోక తప్పేలా లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*