జగన్ జాబితా రెడీ చేసేస్తున్నారే

వైసీపీ అధినేత జగన్ తన పార్టీ అభ్యర్థుల జాబితాను దాదాపుగా రెడీ చేశారు. ప్రస్తుతం పర్యటించిన జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పేర్లను ఆయను టిక్ పెట్టినట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర పూర్తయిన జిల్లాల్లో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరు పాదయాత్ర పూర్తయిన నెల తర్వాత కూడా మరోసారి సర్వే చేసి నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను రూపొందించారు. తాము నిర్వహించిన సర్వేలో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి ఒక్కొక్కి నియోజకవర్గానికి మూడు పేర్లతో పీకే టీం జాబితాను రూపొందించింది.

పీకే టీం ఇచ్చిన జాబితాతో….

ఈ జాబితాలో ఒకరికి జగన్ టిక్ పెట్టినట్లు చెబుతున్నారు. తాను దగ్గరుండి చూసిన ప్రాంతాలు కావడం, నేతల నైపుణ్యం, మాటతీరు, పాదయాత్రలో కనబర్చిన శ్రద్ధ ఇలాంటి వన్నీ బేరీజు వేసుకున్న జగన్ టిక్కెట్ కేటాయించలనుకున్న వారిని నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడే దాదాపుగా అనుకున్నారని వైసీపీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇప్పటికే జగన్ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించారు. ప్రత్తికొండలో శ్రీదేవి, దర్శిలో మాధవ్, కుప్పంలో చంద్రమౌళిని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత కర్నూలులో కూడా పార్టీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ ను పార్టీ ప్రకటించింది.

తన అంచనాతో బేరీజు వేసుకుని….

జగన్ ప్రస్తుతం ఆరుజిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర పూ్ర్తయింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. ఈ జిల్లాలో కూడా యాత్ర చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లోని ప్రధాన నియోజకవర్గాల్లో అభ్యర్థులను దాదాపుగా జగన్ ఖారారు చేసినట్లేనన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. పాదయాత్ర జిల్లాను వీడే సమయంలో కొంత మంది అభ్యర్థులను జగన్ పిలిపించుకుని పార్టీకి గట్టిగా పనిచేసి విజయం సాధించాలని చెప్పారని, కొందరికి ఆల్ ది బెస్ట్ అని చెప్పారని ప్రకాశంజిల్లాలోని వైసీపీ నేత ఒకరు చెప్పారు. ఈ కారణాలతోనే జగన్ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

సిట్టింగ్ లకు గ్యారంటీ…..

సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ దాదాపుగా టిక్కెట్లు వచ్చినట్లేనన్నది వైసీపీలో టాక్ నడుస్తుంది. నాలుగేళ్ల నుంచి అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా తన వెంట ఉన్నందుకు జగన్ వారిని అక్కున చేర్చుకుంటున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫాను జగన్ తన వద్దకు పిలిపించుకుని మరీ మాట్లాడి, ఆయనకు ఏమైనా ఇబ్బందులున్నాయేమోనని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ టెక్కెట్ కన్ ఫర్మ్ అయినట్లేనన్నది వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నమ్మకంగా ఉన్న వారికి తాను ఎలాంటి ప్రాధాన్యత ఇస్తానో మీరే చూస్తారంటూ జగన్ ఒక సీనియర్ నేత వద్ద చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి అద్దంపడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*