పవన్ తో ప్రమాదమేమీ లేదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 200వ రోజు ముగిసింది. ఇప్పటికే ఆయన 2400 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఓ జాతీయ ఆంగ్ల దినప్రతికకు వై.ఎస్. జగన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం జగన్, ఏపీలో జరుగుతున్న అనేక విషయాలకు, అనుమానాలకు ఈ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తన పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పారు. ఏ పార్టీ అయితే తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాసి ఇస్తుందో వారికే మద్దతు ఇస్తామని తెలిపారు. ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం…

 

రానున్న ఎన్నికల్లో  ఏ అంశం ప్రధానమవుతుంది?

అన్ని అంశాలను తీసుకెళ్తాం. గత ఎన్నికల్లో కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయాం. చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, నరేంద్ర మోదీ హవాతో పాటు అనుభవం ఉన్న నాయకుడనే ప్రచారం బాబుకు కలిసి వచ్చింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజలు చంద్రబాబు అబద్ధాలకోరు అని తెలుసుకున్నారు. తన సైకిల్ కి రెండు చక్రాల్లాంటి మోదీ, పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాబుతో లేరు. మేము అధికారంలోకి వస్తే ప్రజలకు చేయనున్న నవరత్నాలు అనే తొమ్మిది హామీలను ప్రజలకు ఇస్తున్నాం. ఇదే సమయంలో వైఎస్సార్ సువర్ణయుగాన్ని తిరిగి తీసుకువస్తామనే భరోసా కల్పిస్తున్నాం. ప్రత్యేక హోదా కూడా రానున్న ఎన్నికల్లో ప్రధాన అంశం. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే మొదటి నుంచి చిత్తశుద్ధితో పోరాడుతోంది. టీడీపీ ఇప్పుడే తన వైఖరి మార్చుకుంది.

 

ముందస్తు ఎన్నికలు వస్తే…. మీరు సిద్ధమేనా ?

ఇప్పటి వరకు నాకు అటువంటి సమాచారం ఏమీ లేదు. ప్రస్థుతానికి నేను పాదయాత్రపైనే దృష్టి పెట్టాను. అయితే ఎన్నికలు ఎంత త్వరగా వస్తే రాష్ట్రానికి, మాకు అంత మేలు. ఎన్నికల కోసం అదనంగా సిద్ధమవడం ఏమీ అవసరం లేదు.

 

పవన్ కళ్యాణ్  ఓట్లు చీలుస్తారా?

బహుముఖ పోటీ మా పార్టీపై ఎటువంటి ప్రభావమూ చూపదనుకుంటున్నాను. 2014లో పొత్తుల వల్ల పవన్ కళ్యాణ్, బీజేపీకి మద్దతు ఇచ్చేవారు కూడా తెలుగుదేశం పార్టీకే ఓట్లేశారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఓట్లే చీలుతాయి కానీ మాకు ఏమీ నష్టం లేదు.

 

పవన్ కళ్యాణ్ మీ పార్టీకి మద్దతు ఇస్తారా?

నాకు అయితే ఇప్పటి వరకు అటవంటి ప్రతిపాదన ఏమీ రాలేదు. ఎవరి మద్దతూ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా మా పార్టీకి ఉంది. ఇప్పటివరకైతే వేరే పార్టీల మద్దతూ, పొత్తు అవసరమని నేను అనుకోవడం లేదు.

 

వైసీపీ, బీజేపీ రహస్య మిత్రులంటున్న టీడీపీ  ఆరోపణపై మీ సమాధానం ?

ఇది ఒక తెలివితక్కువ, అబద్ధపు ప్రచారం. భారతీయ జనతా పార్టీతో నాలుగు సంవత్సరాల పాటు కలిసి పయనించింది తెలుగుదేశం పార్టీనే కదా.

 

2019 ఎన్నికల్లో మీ పార్టీ రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లకు 20 సీట్లు గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారు ?

మేము ఇక మాటల ద్వారా ఇచ్చే హామీలను నమ్మదలుచుకోలేదు. ఏ పార్టీ గానీ, కూటమి గానీ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాసి ఇస్తారో వారికే మా మద్దతు ఇస్తాం.

 జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర ఏవిధంగా ఉండబోతోంది ?

నాకు జాతీయ స్థాయిలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, కూటమిలో చేరడంపై ఆసక్తి లేదు. జాతీయ రాజకీయాల్లో స్థానం కూడా నాకు అవసరం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*