బెజవాడలో జగన్ ముహూర్తం షాట్ అదిరిందే…!

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్పపాదయాత్ర విజయవాడ కు చేరుకోనుంది. అధికార తెలుగుదేశం పార్టీకి పట్టున్న కృష్ణా జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 136వ రోజుకు చేరుకుంది. జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. మొత్తం ఏడు జిల్లాల్లో జగన్ పాదయాత్ర పూర్తయింది. ఇక ఆరు జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

టీడీపీకి పట్టున్న జిల్లాలో….

గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీదే పై చేయి అయింది. ఈసారి టీడీపీకి తొలి నుంచి పట్టున్న జిల్లాలో పాగా వేయాలన్నది వైసీపీ ప్రయత్నం. అందుకోసమే జగన్ పాదయాత్రను పకడ్బందీగా ప్లాన్ చేశారు. జగన్ పాదయాత్ర ప్రారంభం రోజునే అదిరిపోయే ముహూర్తం షాట్ ను రెడీ చేసేశారు వైసీపీ నేతలు. ఈరోజు ఉదయం 9గంటలకు జగన్ పాదయాత్ర విజయవాడ కనకదుర్గమ్మ వారథి మీదకు చేరుకుంటుంది. వారధి మీదకు వచ్చారంటే కృష్ణా జిల్లాలో కాలుమోపినట్లే. ఆ వారధిమీదనే టీడీపీ నేత యలమంచలి రవిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు.

పాదయాత్రకు హైప్ తీసుకొచ్చేందుకు….

కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన వెంటనే మంచి యాత్రకు హైప్ తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఈ ఏర్పాటు చేసినట్లున్నారు. ఇప్పటికే టీడీపీ నేత యలమంచిలి రవి తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కనకదుర్గమ్మ వారధి మీదనే రవి జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం వారథి మీద పెద్దయెత్తున వైసీపీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీనేత చేరికతో యాత్రను కృష్ణా జిల్లాలో ప్రారంభించాలన్నది ఆ పార్టీ ఆలోచన. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు.

నేడు యలమంచిలి రవి చేరిక…..

ఇదిలా ఉండగా తనకు టీడీపీలో గౌరవం లభించనందుకే వైసీపీలో చేరుతున్నానని యలమంచలి రవి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 2009లో తాను ప్రజారాజ్యం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయని, తర్వాత టీడీపీలో చేరానన్నారు. 2004, 2014 ఎన్నికల సందర్భంలో టీడీపీ అధిష్టానం తనను పట్టించుకోలేదన్నారు. ఇక పార్టీలో తనకు భవిష్యత్ లేదని భావించి వైస్సార్సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నానన్నారు. జగన్ ఏ బాధ్యతలను అప్పగించినా తాను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రత్యేక హోదాపై మాటలు మార్చే చంద్రబాబును ప్రజలు ఎవ్వరూ విశ్వసించరని ఆయన అన్నారు. తనను కించపర్చే విధంగా కొందరు మంత్రులు వ్యాఖ్యానించడం కూడా తనకు మనస్థాపం కల్గించిందన్నారు. టీడీపీ నన్ను అన్ని విధాలుగా వాడుకుని వదిలేసిందన్నారు. అందుకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*